మంగపేట : పురిటి నొప్పులతో బాధపడుతున్న ఓ గర్భిణి 108లో పీహెచ్‌సీకి తరలిస్తుండగా మార్గమధ్యలోనే పండంటి బిడ్డకు జన్మనిచ్చింది. ఈ ఘటన మండల పరిధిలోని తిమ్మాపురంలో మంగళవారం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. మండల పరిధిలోని తిమ్మాపురంకు చెందిన పూనెం సీత నిండు గర్భిణి. పురటి నొప్పులతో బాధపడుతుండగా ఆశ వర్కర్ రాణి 108 అంబులెన్స్‌కు సమాచారం అందించారు. వెంటనే 108 సిబ్బంది నొప్పులతో బాధపడుతున్న మహిళను పీహెచ్‌సీకి తరలిస్తుండగా మార్గమధ్యలో పురిటి నొప్పులు తీవ్రం కావడంతో అంబులెన్స్ ఈఎన్‌టి చిరంజీవి వైద్యం అందించగా పండంటి బిడ్డకు జన్మనిచ్చింది. అనంతరం పీహెచ్‌సీకి తరలించారు.తల్లీబిడ్డ ఆరోగ్యంగా ఉన్నారని పీహెచ్‌సీ వైద్యులు తెలిపారు.
‘ఇసుక క్వారీలు
నిలపకుంటే పోరాటం’
మంగపేట: ఏటూరునాగారం ఏజెన్సీ ప్రాంతంలోని గోదావరిలో డీసిల్టింగ్ ఇసుక క్వారీలను నిలుపకుంటే పోరాటం తప్పదని తుడుందెబ్బ రాష్ట్ర అధ్యక్షుడు మైపతి అరుణ్‌కుమార్ మంగళవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. గోదావరి నది భూగర్బ జలాల విధ్వంసం కోసమే ఇసుక మాఫియా డీసిల్టింగ్ కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు. ఏటూరునాగారం వన్యప్రాణి సంరక్షణ కేంద్రంలో ఇసుకలారీలు అర్ధరాత్రి నడుస్తుంటే కలెక్టర్, జిల్లా అటవీశాఖ అధికారి ఏం చేస్తున్నారో చెప్పాలని కోరారు. అధికార పార్టీ ముఖ్యనేతలు అధికారం ఉందికదా అని గిరిజన సొసైటీల నిర్ణయాలు లేకుండా వారి అభిప్రాయాలను పరిగణంలోకి తీసుకోకుండా వారి లాభాలను తీసుకుంటే ఊరుకునేది లేదని హెచ్చరించారు. ఆయా నేతలు పద్ధతి మార్చుకోకుంటే త్వరలో బహిరంగ, ప్రజా పోరాటం ఉంటుందని ఆయన హెచ్చరించారు.
‘అంగన్‌వాడీల్లోనే విద్యను కొనసాగించాలి’
ములుగు రూరల్: ఫ్రీప్రైమరీ విద్యను అంగన్‌వాడీ కేంద్రాల్లోనే కొనసాగించాలని అంగన్ వాడీ టీచర్స్, హెల్పర్స్ యూనియన్ జిల్లా కార్యదర్శి సమ్మక్క అన్నారు. అంగన్‌వాడీ కేంద్రాల్లో ఫ్రీప్రైమరీ విద్యను కొనసాగించాలని కోరుతూ మంగళవారం అంబేడ్కర్ విగ్రహానికి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా అంగన్‌వాడీ కేంద్రాల్లోనే పీఎంశ్రీ విద్యను యథావిధిగా కొనసాగించాలని కోరారు. ఈ కార్యక్రమంలో నాయకులు రత్నం రాజేందర్, రేఖ, సరిత, భవాని, సౌందర్య, రజిత తదితరులు పాల్గొన్నారు.
సింగరేణిపై మాట్లాడే
అర్హత లేదు
భూపాలపల్లి అర్బన్: సింగరేణి సంస్థపై అసత్య ప్రచారాలు చేస్తున్న బీఆర్‌ఎస్, బీజేపీలకు సంస్థపై మాట్లాడే అర్హత లేదని ఐఎన్‌టీయూసీ కేంద్ర కమిటీ ఉపాధ్యక్షుడు జోగు బుచ్చయ్య ఆరోపించారు. ఏరియాలోని యూనియన్ కార్యాలయంలో మంగళవారం ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. సింగరేణి సంస్థను, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అప్రతిష్టపాలు చేయడమే లక్ష్యంగా బీఆర్‌ఎస్, బీజేపీ కలిసి అసత్య ప్రచారాలు చేస్తున్నాయన్నారు. సింగరేణిలో 40 లక్షల టన్నుల బొగ్గు మాయమైందంటూ కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి చేసిన ఆరోపణలు రాజకీయ కక్ష పూరితంగా ఉందన్నారు. సింగరేణి యాజమాన్యం విడుదల చేసిన అధికారిక ప్రకటనతో వాస్తవాలు వెలుగులోకి వచ్చాయని అన్నారు. సింగరేణిలో బొగ్గు రవాణా పూర్తిగా పారదర్శకంగా జరుగుతుందన్నారు. పటిష్టమైన భద్రతా వ్యవస్థల మధ్య భారీ స్థాయిలో బొగ్గు చోరీ జరగడం అసాధ్యమని యాజమాన్యం స్పష్టం చేసినప్పటికీ బీఆర్‌ఎస్, బీజేపీ నాయకులు దుష్పచ్రారాన్ని కొనసాగించడం బాధాకరమని విమర్శించారు.


