అర్హులకు సంక్షేమ పథకాలు అందేలా చూడాలి | - | Sakshi
Sakshi News home page

అర్హులకు సంక్షేమ పథకాలు అందేలా చూడాలి

Jun 23 2026 1:34 AM | Updated on Jun 23 2026 1:34 AM

ములుగు: గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ ఆధ్వర్యంలో అమలు చేస్తున్న ప్రభుత్వ సంక్షేమ పథకాలు పూర్తిస్థాయిలో అర్హులకు అందేలా అధికారులు సమన్వయంతో పనిచేయాలని సెర్ప్‌ సీఈఓ దివ్య దేవరాజన్‌ ఆదేశించారు. ఈ మేరకు హైదరాబాద్‌ నుంచి అన్ని జిల్లాల కలెక్టర్లతో ఆమె సోమవారం వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. జిల్లా నుంచి కలెక్టర్‌ బోర్ఖడే హేమంత్‌ సహదేవరావు వీసీలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా సెర్ప్‌ సీఈఓ దివ్యదేవరాజన్‌ మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా గుర్తించిన లబ్ధిదారులకు జీవనోపాధి అవకాశాల కల్పన, ఉత్పాదక ఆస్తుల పంపిణీ, గ్రామస్థాయిలో కార్యక్రమాల అమలు ప్రక్రియను వేగవంతం చేసి జిల్లా అధికారులు నిరంతరం పర్యవేక్షించాలని సూచించారు. లబ్ధిదారుల కుటుంబాలకు ఆధార్‌ నమోదు, ఉపాధిహామీ జాబ్‌ కార్డులు, రేషన్‌ కార్డులు, గృహాల మంజూరు, ఆరోగ్య సేవలు, టీకాల కార్యక్రమాలు వంటి ప్రభుత్వ సంక్షేమ పథకాలు సకాలంలో అందేలా ప్రత్యేక శిబిరాలు నిర్వహించాలని తెలిపారు. గ్రామాల్లో సీసీ రోడ్లు, అప్రోచ్‌ రోడ్లు వంటి మౌలిక సదుపాయాల పనులను త్వరితగతిన పూర్తి చేయాలని ఆదేశించారు. అటవీ ఉత్పత్తుల ఆధారంగా ఇప్పపువ్వు, తేనె సేకరణ, తేనెటీగల పెంపకం, వెదురు సాగు వంటి కార్యక్రమాలను ప్రోత్సహించి ఆదివాసీ కుటుంబాల ఆదాయాన్ని పెంపొందించే విధంగా ప్రణాళికలు రూపొందించాలని తెలిపారు. ఈ వీసీలో అదనపు కలెక్టర్‌ సంపత్‌ రావు, డీఆర్‌డీఓ చంద్రశేఖర్‌, సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు.

బాధితులకు అండగా

‘భరోసా‘ కేంద్రం

ములుగు: మహిళలు, చిన్నారుల రక్షణకు అత్యున్నత ప్రాధాన్యతనిస్తూ భాధితులకు భరోసా కేంద్రం అండగా నిలుస్తుందని ఎస్పీ సుధీర్‌ రాంనాథ్‌ కేకన్‌ అన్నారు. ఈ మేరకు జిల్లా స్థాయి కన్వర్జెనన్స్‌ సమావేశం ఎస్పీ కార్యాలయంలో సోమవారం నిర్వహించగా ఆయన హాజరై మాట్లాడారు. లైంగిక వేధింపులు, పొక్సో, గృహహింస వంటి కేసుల బాధితులకు వైద్యం, కౌన్సెలింగ్‌, న్యాయ సహాయం, పరిహారం, ఆశ్రయం, పునరావాస సేవలు సకాలంలో అందేలా అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. భరోసా సెంటర్‌ ద్వారా ఇప్పటివరకు బాధితులకు కౌన్సెలింగ్‌, వైద్య సహకారం, న్యాయ సహాయం, ఆశ్రయం, విద్యా సదుపాయాలు కల్పించడంతో పాటు అవగాహన కార్యక్రమాలు విస్తృతంగా నిర్వహించినట్లు తెలిపారు. పలు పొక్సో కేసుల్లో నిందితులకు శిక్షలు పడేలా భరోసా కేంద్రం కీలక పాత్ర పోషించిందన్నారు. బాధితులకు తక్షణ న్యా యం, భద్రత, గౌరవప్రదమైన పునరావాసం కల్పించడంలో జిల్లా పోలీసు శాఖ నిరంతరం కృషి చేస్తోందని వివరించారు. ఈ సమావేశంలో ఏటూరునాగారం ఏఎస్పీ మనన్‌ భట్‌, డీఎస్పీ కిశోర్‌కుమార్‌, డిడబ్ల్యూఓ ప్రేమలత, ఎస్సై రాజ్యలక్ష్మి, వివిధ ప్రభుత్వ శాఖల అధికారులు, భరోసా సెంటర్‌ సిబ్బంది పాల్గొన్నారు.

మొబైల్‌ డీటీఆర్‌

ట్రాలీ ప్రారంభం

ములుగు: విద్యుత్‌ వినియోగదారులకు నిరంతరాయ విద్యుత్‌ సరఫరా అందించేందుకు ములుగు సర్కిల్‌ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మొబైల్‌ డీటీఆర్‌ ట్రాలీని సోమవారం సూపరింటెండెంట్‌ ఇంజనీర్‌ (ఆపరేషన్‌) బి.భిక్షపతి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యుత్‌ ట్రాన్స్‌ఫార్మర్‌(డీటీఆర్‌) ఫెయిల్‌ అయినా లేదా ఓవర్‌లోడ్‌ కారణంగా పనిచేయలేని పరిస్థితి ఏర్పడితే మరో డీటీఆర్‌ను ఏర్పాటు చేయడానికి కొంత సమయం పడుతుందని తెలిపారు. అటువంటి అత్యవసర పరిస్థితుల్లో విద్యుత్‌ సరఫరాలో అంతరాయం కలగకుండా ఉండేందుకు మొబైల్‌ డీటీఆర్‌ ట్రాలీలో అందుబాటులో ఉంచిన ట్రాన్స్‌ఫార్మర్‌ను తాత్కాలికంగా వినియోగించి వెంటనే విద్యుత్‌ సరఫరా పునరుద్ధరించవచ్చని తెలిపారు. జిల్లాలోని మారుమూల అటవీ, గిరిజన ప్రాంతాల్లో విద్యుత్‌ అంతరాయాల సమయంలో వినియోగదారులకు త్వరితగతిన సేవలు అందించేందుకు ఈ మొబైల్‌ డీటీఆర్‌ ట్రాలీ ఎంతో ఉపయోగపడుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ములుగు డీఈ రాజు, ఏడీఈ వేణుగోపాల్‌, ములుగు డివిజన్‌ పరిధిలోని అసిస్టెంట్‌ ఇంజనీర్లు పాల్గొన్నారు.

భారీ వర్షానికి కూలిన ఇల్లు

రేగొండ: ఈదురుగాలులతో కురిసిన భారీ వర్షానికి ఓ ఇల్లు కూలిపోయింది. మండలంలోని రేపాక గ్రామానికి చెందిన మడప రత్నాకర్‌ రెడ్డి ఇల్లు సోమవారం కురిసిన భారీ వర్షానికి ఇల్లు నేలమట్టమైంది.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement