అన్నదాతల చెంతకే విత్తనాలు.. | - | Sakshi
Sakshi News home page

అన్నదాతల చెంతకే విత్తనాలు..

Jun 23 2026 1:34 AM | Updated on Jun 23 2026 1:34 AM

రైతు వేదికల్లో విత్తనాల పంపిణీకి శ్రీకారం

నేటి నుంచి 30వ తేదీ వరకు విత్తనమేళా

ములుగు: రైతులకు నాణ్యమైన విత్తనాలు, ఎరువులను సకాలంలో అందించడమే లక్ష్యంగా వ్యవసాయ శాఖ చర్యలు చేపట్టింది. జిల్లాలోని వ్యవసాయ క్లస్టర్లలో ఉన్న రైతు వేదికల ద్వారా నేరుగా విత్తనాలు, నానో యూరియా, నానో డీఏపీ పంపిణీ చేయడానికి శ్రీకారం చుట్టింది. ఈనెల 23 నుంచి 30వ తేదీ వరకు రైతు వేదికల్లో విత్తనమేళా కార్యక్రమం ద్వారా అన్నదాతలకు 7 రకాల సన్నవడ్లకు చెందిన విత్తనాలను పంపిణీ చేయనుంది. ప్రభుత్వం రూ.500 బోనస్‌ ప్రకటించిన సన్నరకం వరి విత్తనాలను మంగళవారం నుంచి రైతు వేదికల ద్వారా వ్యవసాయ అధికారులు అందించనున్నారు.

జిల్లాలో 31 క్లస్టర్లు..

జిల్లాలో ప్రతీ 5 వేల ఎకరాలకు ఒకటి చొప్పున 31 వ్యవసాయ క్లస్టర్లను ఏర్పాటు చేశారు. 2020లో ప్రభుత్వం క్లస్టర్‌కు ఒక రైతు వేదికను నిర్మించింది. ప్రతీ రైతు వేదికలో ఏఈఓలు అందుబాటులో ఉంటారు. రైతు వేదికల్లో రైతు అవగాహన సదస్సులు, ఫార్మర్‌ రిజిస్ట్రీ, వ్యవసాయానికి సంబంధించిన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. జిల్లాలో సుమారు 86 వేల మంది రైతులు ఉండగా 1.70 లక్షల ఎకరాల్లో వివిధ పంటలు సాగు చేస్తున్నారు.

అందుబాటులో ఉండే విత్తనాలు

రాష్ట్ర ప్రభుత్వం ఆరుతడి పంటలతో పాటు సన్నరకం ధాన్యం సాగును ప్రోత్సహిస్తోంది. ప్రభుత్వం ఎంపిక చేసిన సన్నరకం ధాన్యానికే రూ. 500 బోనస్‌ ఇవ్వనున్నట్లు ప్రభుత్వం స్పష్టం చేసిన విషయం విధితమే. దీంతో ఎంపికచేసిన సన్నరకం ధాన్యానికి సంబంధించి విత్తనాలు మాత్రమే రైతు వేదికల్లో అందుబాటులో ఉంటాయి. రైతులకు లాభదాయ కం, ఎగుమతులకు అనుకూలమైన బీపీటీ– 5204, ఆర్‌ఎన్‌ఆర్‌– 15048, కేఎన్‌ఎం–1638, జై శ్రీరాం, హెచ్‌ఎంటీ సోనా, డబ్ల్యూజీఎల్‌ 44, జేజీఎల్‌ 1798 వరి వంగడాలు అందుబాటులో ఉంటాయి.

నేటి నుంచి పంపిణీ

రైతు వేదికల్లో విత్తన మేళా కార్యక్రమం ద్వారా నేటి నుంచి ఈనెల 30 వరకు సన్నవడ్లకు చెందిన 7 రకాల విత్తనాలను అందిస్తాం. విత్తనాలతో పాటు నానో యూరియా, నానో డీఏపీని సైతం రైతులకు అందుబాటులో ఉంచాం. రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి.

– శైలజ, వ్యవసాయ అధికారి,

వెంకటాపురం(ఎం)

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement