● డీసీసీ అధ్యక్షుడు పైడాకుల అశోక్
ములుగు/ఎస్‌ఎస్ తాడ్వాయి: ఇటీవల సోషల్ మీడియాలో బీఆర్‌ఎస్ నాయకుడు, రెడ్కో మాజీ చైర్మన్ సతీశ్ రెడ్డి ఇసుక అక్రమ రవాణాపై బహిరంగ చర్చకు రావాలని కాంగ్రెస్ నేతలకు సవాల్ విసిరారు.. సవాల్ స్వీకరించిన ఉదయం 11గంటలకు మేడారం చేరుకున్నా బీఆర్‌ఎస్ నాయకులు రాలేదని డీసీసీ అధ్యక్షుడు పైడాకుల అశోక్ తెలిపారు. ఈ మేరకు మేడారంలోని వనదేవతల ఆలయ ఆవరణలో డీసీసీ అధ్యక్షుడు అశోక్ మీడియాతో మాట్లాడారు. చర్చకు సిద్ధంగా వేచి ఉన్నప్పటికీ ప్రత్యర్థులు హాజరు కాలేదని పేర్కొన్నారు. ప్రజలను తప్పుదోవ పట్టించడం, రాజకీయ లబ్ధి కోసం ఆరోపణలు చేయడం తప్పా వాస్తవాలపై చర్చించే ధైర్యం బీఆర్‌ఎస్ నాయకులకు లేదని విమర్శించారు. అనంతరం ములుగు గాంధీ సెంటర్‌లో సాయంత్రం 6 గంటలకు ప్రజల సమక్షంలో చర్చకు సిద్ధంగా ఉంటామని తెలిపారని వివరించారు. మేడారం నుంచి ములుగు జిల్లా కేంద్రంలోని గాంధీ చౌక్ వద్దకు చేరుకున్నా చర్చకు బీఆర్‌ఎస్ నేతలు రాకపోవడం సరికాదని తెలిపారు. మంత్రులు సీతక్క, పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డిని విమర్శించే స్థాయి బీఆర్‌ఎస్ నేతలకు లేదన్నారు. పదేళ్లలో ములుగు నియోజకవర్గంలో బీఆర్‌ఎస్ చేసిన అభివృద్దిపై చర్చకు రావాలని ఆశోక్ సవాల్ విసిరారు. వందల కోట్లతో ములుగు నియోజకవర్గాన్ని అన్ని విధాలుగా సీతక్క అభివృద్ది చేస్తున్నారని తెలిపారు. సీతక్క చేస్తున్న అభివృద్దిని చూస్తూ ఓర్వలేని బీఆర్‌ఎస్ నాయకులు తప్పుడు ఆరోపణలు చేస్తూ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని విమర్శించారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ రవిచందర్, మార్కెట్ కమిటీ చైర్మన్ రేగ కల్యాణి, కాంగ్రెస్ నాయకులు గొల్లపెల్లి రాజేందర్‌గౌడ్, చింతనిప్పుల భిక్షపతి, పల్లె జయపాల్‌రెడ్డి, వంగ రవియాదవ్, శ్రీనివాస్‌రెడ్డి, మామిడిశెట్టి కోటి, సుమన్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.


