● రెండు పంటల వైపే రైతుల ఆసక్తి
● పప్పుధాన్యాలు, ఉద్యాన పంటలు అంతంతే
● ఆరుతడి పంటల సాగుపై ఆసక్తి చూపాలంటున్న
అధికారులు
గోవిందరావుపేట: జిల్లా వ్యాప్తంగా ఈ ఏడాది 1,64,897 ఎకరాల్లో పంటలు సాగు కానుండగా అందులో అధిక భాగం వరి, పత్తి పంటల సాగుకే రైతులు మొగ్గు చూపుతున్నారు. కూరగాయలు, పప్పుధాన్యాలు, ఉద్యాన పంటల సాగుకు రైతులు పెద్దగా ఆసక్తి చూపడం లేదు. సాగు విస్తీర్ణంలో అధికంగా వరి, పత్తి తర్వాత స్థానంలో మొక్కజొన్నపై ఆసక్తి చూపుతున్నారు. రైతులు మార్కెట్‌లో డిమాండ్, కొనుగోలు, సాగు అనుభవంతో పాటు సాంకేతిక పరిజ్ఞానం వంటి కారణాలతో ఈ పంటలనే ఎంచుకుంటున్నట్లుగా వ్యవసాయ అధికారులు చెబుతున్నారు. జిల్లాలో సాగు విస్తీర్ణం ఏటేటా పెరుగుతున్నా ఆరుతడి పంటల సాగు మాత్రం పెరగడం లేదు.
కూరగాయలు, పప్పుధాన్యాల పంటలు
అంతంతే
ప్రజల ఆహార అవసరాల్లో కీలకమైన కూరగాయలు, పప్పుధాన్యాల సాగు అత్యంత తక్కువ స్థాయిలో ఉండడం ఆందోళన కలిగిస్తోంది. ఏటూరునాగారం మండలంలో పచ్చి మిర్చి కేవలం 15 ఎకరాల్లో మాత్రమే సాగవుతుండగా ములుగు మండలంలో బెండకాయ, సోరకాయ, క్యాబేజీ, వంకాయ వంటి కూరగాయల సాగు కూడా 15 ఎకరాలకే పరిమితమైంది. పప్పుధాన్యాల పరిస్థితి కూడా అంతే. ఏటూరునాగారంలో మినుములు, అలసందలు, పెసర్లు, కందులు కలిపి 585 ఎకరాల్లో సాగవుతుండగా ములుగు మండలంలో ఈ పంటలు కేవలం 25 ఎకరాల్లో మాత్రమే సాగు చేస్తున్న పరిస్థితి నెలకొంది.
3,011 ఎకరాల్లో ఉద్యాన, ప్రత్యామ్నాయ
పంటలు
జిల్లా భౌగోళిక పరిస్థితులు ఉద్యాన పంటలకు అనుకూలంగా ఉన్నప్పటికీ ఆ రంగం ఆశించిన స్థాయిలో అభివృద్ధి చెందడం లేదు. జిల్లాలో మామిడి, బొప్పాయి, ఆయిల్‌పామ్, డ్రాగన్ ఫ్రూట్, వివిధ రకాల కూరగాయలతో కూడిన ఉద్యాన పంటలు మొత్తం 3,011 ఎకరాల్లో మాత్రమే ఉన్నాయి. అదే విధంగా వెదురు, కాసురీనా, మలబార్ నీమ్, యూకలిప్టస్, గంధం, టేకు వంటి అటవీ ఆధారిత పంటలు 1,193 ఎకరాల్లో మాత్రమే సాగవుతున్నాయి. ప్రస్తుతం జిల్లాలో వరి, పత్తి పంటల సాగుకే మొగ్గు చూపుతున్నారు. భవిష్యత్ అవసరాలను దృష్టిలో పెట్టుకుని వైవిధ్య పంటల సాగు వైపు రైతులు మొగ్గు చూపాలని వ్యవసాయ అధికారులు సూచిస్తున్నారు.
వైవిధ్య పంటల సాగుపై ఆసక్తి చూపాలి
జిల్లాలో రైతులు ప్రధానంగా వరి, పత్తి పంటల సాగుకు ఎక్కువగా ఆసక్తి చూపుతున్నారు. అదే సమయంలో పప్పుధాన్యాలు, ఉద్యాన పంటలు, కూరగాయల సాగు విస్తీర్ణాన్ని పెంచేందుకు వ్యవసాయశాఖ ప్రత్యేక చర్యలు చేపడుతోంది. రైతులకు అవగాహన కల్పించడంతో పాటు ప్రత్యామ్నాయ పంటల సాగుపై ప్రోత్సాహం అందిస్తున్నాం. భవిష్యత్తులో పంటల వైవిధ్యం పెరిగేలా ప్రణాళికతో చర్యలు చేపడుతాం.
– సురేశ్‌కుమార్, డీఏఓ


