ములుగు రూరల్: నేటి 12వ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించనున్నట్లు ములుగు ఆయుష్ విభాగం నోడల్ అధికారి డాక్టర్ సంధ్య శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. నేటి ఉదయం 6 గంటల నుంచి 8 గంటల వరకు జిల్లా కేంద్రంలోని జెడ్పీహెచ్‌ఎస్ బాలుర పాఠశాలలో యోగా డే కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు వెల్లడించారు. ఈ కార్యక్రమానికి అధికారులు, ప్రజాప్రతినిధులు, విద్యార్థులు, యువత, మహిళ సంఘాలు, స్వచ్చంధ సంస్థల ప్రతినిధులు పెద్ద సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు.
ఫీజుల దోపిడీపై
కలెక్టర్‌కు వినతి
ములుగు: జిల్లాలోని ప్రైవేట్ పాఠశాలల యజమానులు విద్యార్థుల వద్ద అధిక ఫీజులు వసూలు చేస్తున్నారని శనివారం కలెక్టర్‌కు ఎన్‌హెచ్‌ఆర్‌సీ ప్రతినిధులు వినతిపత్రం అందజేశారు. 2026–27 విద్యా సంవత్సరానికి సంబంధించి ప్రైవేట్ పాఠశాలలు ఫీజుల నియంత్రణ పాటించడం లేదని తెలిపారు. పేద విద్యార్థులకు 25శాతం సీట్లు కేటాయించడం లేదని వినతిపత్రంలో పేర్కొన్నారు. ఫీజుల వివరాలను వెబ్‌సైట్‌లో పెట్టడం లేదని, తల్లిదండ్రుల కమిటీలు ఏర్పాటు చేయడం లేదని ఆరోపించారు. విద్యాహక్కు చట్టం 2009, తెలంగాణ విద్యా చట్టం 1982 నిబంధనలు పాటించేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్‌ను కోరినట్లు వివరించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్‌గా నాగపురి శ్రీకాంత్, నాయకులు నద్దునూరి రమేశ్, గడ్డం భిక్షపతి, బొచ్చు అశోక్, రవీందర్ రెడ్డి, మామిడి నటరాజ్ తదితరులు పాల్గొన్నారు.
వయో వృద్ధులకు
వైద్య పరీక్షలు
ములుగు: జిల్లా కేంద్రంలోని ప్రణామ్ డే కేర్ సెంటర్‌లో శనివారం డెంటల్ హెల్త్ క్యాంపు నిర్వహించి వయోవృద్ధులకు వైద్య పరీక్షలు నిర్వహించినట్లు ఆర్‌ఎంఓ అల్లెం అప్పయ్య తెలిపారు. ఈ సందర్భంగా ఆయన 30 మంది వయో వృద్ధులకు బీపీ, షుగర్ టెస్టులు చేశారు. అనంతరం మందులు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వయోవృద్ధలందరూ ప్రతిరోజూ ఉదయం, రాత్రి బ్రష్ చేసుకోవడం అలవాటు చేసుకోవాలన్నారు. చక్కెర పదార్థాలు, గుట్కా, పొగాకు వంటి వాటికి దూరంగా ఉండాలని సూచించారు. క్రమం తప్పకుండా బీపీ, షుగర్ టెస్టులు చేయించుకోవాలన్నారు. ఎలాంటి చిన్న సమస్య ఉన్నా వెంటనే డాక్టర్‌ను సంప్రదించాలని తెలిపారు. డే కేర్ సెంటర్ సభ్యులందరూ పౌష్టికాహారం తీసుకుంటూ ఆరోగ్యంగా, ఆనందంగా ఉండాలని ఆకాంక్షించారు. జిల్లా ఆస్పత్రి బృందం సభ్యులు వీరమల్ల హరీశ్, నర్సింగ్ ఆఫీసర్ జి.తిరుపతి, జిల్లా సంక్షేమ శాఖ కార్యాలయ సహాయకులు నాగేంద్ర, ప్రణామ్ డే కేర్ సెంటర్ సూపరింటెండెంట్ చుంచు రమేశ్, డే కేర్ సిబ్బంది పాల్గొన్నారు.
‘30లోగా ఈకేవైసీ
చేయించుకోవాలి’
ములుగు రూరల్: ఎల్‌పీజీ వినియోగదారులు ఈ నెల 30వ తేదీలోగా తప్పనిసరిగా ఈకేవైసీ చేయించుకోవాలని జిల్లా పౌర సరఫరాల శాఖ అధికారి సయ్యద్ షా పైసల్ హుస్సేని శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈకేవైసీ చేయించుకుని సబ్సిడీ ప్రయోజనాలు పొందాలని సూచించారు. ఎల్‌పీజీ వినియోగదారులు ఇప్పటి వరకు ఎవరైతే ఈకేవైసీ చేయించుకోలేదో వారు సంబంధిత గ్యాస్ ఏజెన్సీని సంప్రదించి అప్‌డేట్ చేయి ంచుకోవాలని వెల్లడించారు. నిర్ధేశిత గడువులోపు ఈకేవైసీ పూర్తి చేయని వినియోగదారులు సబ్సిడీ కోల్పోయే ప్రమాదం ఉందని తెలిపారు.
రాజకీయ అవకాశవాదమే
భూపాలపల్లి అర్బన్: టీఆర్‌ఎస్ వ్యవస్థాపక అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత సింగరేణి కార్మికుల అంశాలపై చేసిన వ్యాఖ్యలు రాజకీయ అవకాశవాదానికి నిదర్శనమని ఐఎన్‌టీయూసీ సెంట్రల్ వైస్ ప్రెసిడెంట్ జోగ బుచ్చయ్య శనివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. పదేళ్లపాటు అధికారంలో ఉండి సింగరేణిని అప్పుల ఊబిలోకి నెట్టిన వారు ఇప్పుడు కార్మికుల హక్కుల గురించి మాట్లాడడం ప్రజలను మోసం చేసే మరో రాజకీయ నాటకమని అన్నారు. అధికారంలో ఉన్నప్పుడు మౌనంగా ఉండి ఇప్పుడు కార్మికులపై ప్రేమ చూపించడం రాజకీయ మనుగడ కోసం చేస్తున్న ప్రయత్నమేనని విమర్శించారు.


