● తెలంగాణ రక్షణ సేన అధ్యక్షురాలు కవిత
భూపాలపల్లి అర్బన్: సింగరేణిలో నిలిచిపోయిన మెడికల్ బోర్డును నిర్వహించి కార్మికుల పిల్లలకు ఉద్యోగ అవకాశాల కల్పించాలని తెలంగాణ రక్షణ సేన(టీఆర్‌ఎస్) వ్యవస్థాపక అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత డిమాండ్ చేశారు. బాయిబాట కార్యక్రమంలో భాగంగా శనివారం భూపాలపల్లి ఏరియాలో పర్యటించి కేటీకే–5వ గనిలో ఆవరణలో కార్మికులను ఉద్దేశించి మాట్లాడారు. తెలంగాణ ప్రభుత్వానికి, సింగరేణి యాజమాన్యానికి నెల రోజుల సమయం ఇస్తున్నా.. ఈలోగా నెలకు రెండుసార్లు మెడికల్ బోర్డు ఏ రోజు నిర్వహిస్తామని ప్రకటించాలని లేకుంటే జూలై 20 నుంచే గాంధేయ మార్గంలో నిరాహార దీక్షకు దిగుతానని తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 30 నెలలు గడుస్తుందని, ఇంతవరకు ఒక సారి కూడా మెడికల్ బోర్డు నిర్వహించలేదని ఆరోపించారు. మెడికల్ బోర్డు నిర్వహించి, పెండింగ్‌లో ఉన్న 1200 మంది కార్మికులకు సంబంధించిన వారసత్వ ఉద్యోగాలు కల్పించాలని డిమాండ్ చేశారు. అనంతరం జిల్లా కేంద్రంలోని ప్రధాన రహదారిపై ర్యాలీ నిర్వహించారు. జయశంకర్, అంబేడ్కర్ విగ్రహాలకు కవిత పూలమాల వేసి నివాళుర్పించారు. అనంతరం ఆర్టీసీ బస్టాండ్ సమీపంలో పార్టీ జెండా ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో హెచ్‌ఎంఎస్ రాష్ట్ర నాయకులు సారయ్య, రియాజ్ అహ్మద్, చెన్నూరు మాబోడ జనార్దన్, నాయకులు నరేష్ నేత, మల్లేష్, నర్సయ్య పాల్గొన్నారు.


