● బీఆర్‌ఎస్ నియోజకవర్గ
ఇన్‌చార్జ్ నాగజ్యోతి
ములుగు: ప్రజా ప్రభుత్వమని చెప్పుకుంటున్న కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు సకాలంలో విత్తనాలు, ఎరువులు, పంటలకు గిట్టుబాటు ధర, పెట్టుబడి సాయం అందించలేక రైతులను ఇబ్బందులకు గురిచేస్తుందని బీఆర్‌ఎస్ నియోజకవర్గ ఇన్‌చార్జ్ బడే నాగజ్యోతి ఆరోపించారు. జిల్లా కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో శనివారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడారు. బీఆర్‌ఎస్ పాలనలో తెలంగాణను అన్నపూర్ణ రారష్ట్‌రంగా నిలిపితే కాంగ్రెస్ ప్రభుత్వం రైతులను కష్టాల్లోకి నెట్టే పరిస్థితి తెచ్చిందన్నారు. 2013లో 40 లక్షల ఎకరాల్లో సాగు జరిగితే, 2014 తర్వాత అది 2.30 కోట్ల ఎకరాలకు పెరిగిందని తెలిపారు. పంజాబ్‌ను తలదన్నే స్థాయిలో పంటలు పండించిన ప్రస్తుతం కరెంట్, ఎరువులు, నీటి కొరతతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని పేర్కొన్నారు. నియోజకవర్గంలో ప్రధానంగా వరి, పత్తి, మొక్కజొన్న, మిర్చి పంటలు సాగవుతున్నాయని తెలిపారు. పంటల సాగుపై ఆధారపడే రైతులకు ప్రభుత్వం స్పష్టమైన భరోసా ఇవ్వాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో మాజీ గ్రంథాలయ చైర్మన్ గోవింద్‌నాయక్, బీఆర్‌ఎస్ మండలాధ్యక్షుడు సానికొమ్ము రమేశ్‌రెడ్డి, నాయకులు పాల్గొన్నారు.


