సోలార్‌ వెలుగులు | - | Sakshi
Sakshi News home page

సోలార్‌ వెలుగులు

Jun 20 2026 11:13 AM | Updated on Jun 20 2026 11:13 AM

సాక్షిప్రతినిధి, వరంగల్‌ :

మారుమూల గిరిజనగూడేల్లో విద్యుత్‌ వెలుగులు నింపేందుకు రాష్ట్ర ప్రభుత్వం కీలక అడుగు వేసింది. సాంకేతిక యుగంలోనూ ఇప్పటికీ సాధారణ విద్యుత్‌ సరఫరా అందని, అంతరాయాలతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న గొత్తికోయ గిరిజన నివాస ప్రాంతాలకు స్టోరేజ్‌ ఆధారిత సోలార్‌ విద్యుత్‌ వ్యవస్థలను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ఈ మేరకు పైలట్‌ ప్రాజెక్టుగా ములుగు జిల్లాను ప్రభుత్వం ఎంపిక చేసింది. దశలవారీగా తెలంగాణ వ్యాప్తంగా ఉన్న అటవీ, గిరిజన గూడాలకు సోలార్‌ విద్యుత్‌ అందనుంది.

సిద్ధమైన డీపీఆర్‌లు..

త్వరలో టెండర్లు, పనులు..

ప్రాజెక్టు అమలుకు సంబంధించి అధికారులు ఇప్పటికే క్షేత్రస్థాయి సర్వేలు పూర్తి చేశారు. గొత్తికోయగూడాల భౌగోళిక పరిస్థితులు, విద్యుత్‌ అవసరాలు, సాంకేతిక అంశాలను పరిశీలించి వివరణాత్మక ప్రాజెక్టు నివేదికలు (డీపీఆర్‌లు) సిద్ధం చేశారు. ప్రస్తుతం టెండర్ల ప్రక్రియ కొనసాగుతుండగా, త్వరలోనే పనులు ప్రారంభమయ్యే అవకాశముంది. ఈ ప్రాజెక్టు పూర్తయితే ప్రతీగూడెంలో సోలార్‌ ప్యానెళ్లు, విద్యుత్‌ నిల్వ కోసం బ్యాటరీ స్టోరేజ్‌ వ్యవస్థలు ఏర్పాటు చేసి రాత్రివేళల్లో కూడా విద్యుత్‌ అందేలా చర్యలు తీసుకోనున్నారు. ఒక్కో ఇంటికి ఎంత సామర్థ్యం గల విద్యుత్‌ సరఫరా అందించనున్నారనే సాంకేతిక వివరాలు త్వరలోనే వెల్లడిస్తామని టీజీరెడ్‌కోకు చెందిన ఉన్నతాధికారి ఒకరు ‘సాక్షిప్రతినిధి’కి తెలిపారు. ములుగు జిల్లాలో పైలట్‌ ప్రాజెక్టుగా చేపడుతున్న ఈ కార్యక్రమం సక్సెస్‌ తర్వాత దశలవారీగా రాష్ట్రంలోని ఇతర అటవీ, గిరిజన ప్రాంతాలకు కూడా విస్తరించే దిశగా ప్రతిపాదనలు ఉన్నాయి. కాగా విద్యుత్‌ అందుబాటులోకి రావడంతో గిరిజన కుటుంబాల జీవన ప్రమాణాలు మెరుగుపడటంతో పాటు విద్య, ఆరోగ్యం, సమాచార సదుపాయాల వినియోగానికి కొత్త అవకాశాలు ఏర్పడనున్నాయని అధికారులు భావిస్తున్నారు.

పైలట్‌ ప్రాజెక్టుగా ములుగు జిల్లా.. గొత్తికోయగూడేలకు మహర్దశ

85 నివాస ప్రాంతాలు,

2,020 ఇళ్లకు సౌకర్యం...

రూ.17.036 కోట్లు విడుదల..

‘టీజీరెడ్‌కో’సౌజన్యంతో ఏర్పాట్లు

సర్వే, డీపీఆర్‌లు సిద్ధం చేసిన అధికారులు... టెండర్ల దశలో ‘సోలార్‌’పనులు

దశలవారీగా తెలంగాణ వ్యాప్తంగా అమలు

ఛత్తీస్‌గఢ్‌, మహారాష్ట్ర, తెలంగాణ సరిహద్దు.. ఏటూరునాగారం డివిజన్‌లో గిరిజన, గొత్తికోయగూడాలున్నాయి. ఏటూరునాగారం, మంగపేట, కన్నాయిగూడెం, ఎస్‌ఎస్‌ తాడ్వాయి మండలాల్లో ఇప్పటికీ సాధారణ విద్యుత్‌ సరఫరా అందని, అంతరాయాలను ఎదుర్కొంటున్న 85 గిరిజనగూడేలను ప్రభుత్వం గుర్తించింది. ఈ గూడేల్లో ఉన్న 2,020 ఇళ్లకు ప్రయోజనం చేకూర్చేలా సోలార్‌ విద్యుత్‌ను అందించనున్నారు. ఈ ప్రాజెక్టును తెలంగాణ రాష్ట్ర పునరుద్ధరణీయ ఇంధన వనరుల అభివృద్ధి సంస్థ (టీజీరెడ్‌కో) ఆధ్వర్యంలో రూ.17.036 కోట్ల వ్యయంతో చేపట్టనున్నారు. ప్రాజెక్టుకు సంబంధించిన పరిపాలనా, ఆర్థిక అనుమతులు ఇప్పటికే లభించగా, ఇంధన శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి నవీన్‌ మిట్టల్‌ జీఓ ఆర్‌టీనం.5 జారీ చేశారు. అంతకుముందు మార్చి 6న ఆర్థిక శాఖ నిధుల కేటాయింపునకు ఆమోదం తెలిపింది.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement