ఎల్‌నినో సెగ! | - | Sakshi
Sakshi News home page

ఎల్‌నినో సెగ!

Jun 20 2026 11:13 AM | Updated on Jun 20 2026 11:13 AM

జిల్లాలో పంటల సాగు అంచనా (ఎకరాల్లో)

వరి 1,07,700

పత్తి 28,600

మొక్కజొన్న 11,329

వివిధ పంటలు 15,600

ములుగు: వానాకాలం సాగు సీజన్‌ ప్రారంభమై రోజులు గడుస్తున్నా.. ఆకాశం వైపు చూస్తున్న అన్నదాతకు నిరాశే ఎదురవుతోంది. ‘ఎల్‌నినో’ ప్రభావంతో ఈ ఏడాది సాధారణం కంటే తక్కువ వర్షపాతం నమోదయ్యే సూచనలు ఉన్నాయని, పంటల ఎంపికలో తగు జాగ్రత్తలు తీసుకొని ప్రత్యామ్నాయ పంటలను ఎంపిక చేసుకోవాలని వ్యవసాయ శాఖ రైతులకు సూచిస్తుంది. ఎల్‌నినో దెబ్బతో ఉష్ణోగ్రతలు పెరిగి భూగర్భజలాలు తగ్గే అవకాశం ఉందని, ఫలితంగా పంటల దిగుబడులు పడిపోయే అవకాశం ఉందని అధికారులు హెచ్చరిస్తున్నారు. జూన్‌ మొదటివారంలో అంతంతమాత్రంగా కురిసిన చిరుజల్లులకే ఇప్పటికే రైతులు పత్తి విత్తనాలను విత్తారు. రెండు మూడు రోజుల్లో వర్షాలు కురవకపోతే విత్తనాలు మొలకెత్తవని, దీంతో ఎకరానికి రూ.10 వేల మేర నష్టం వాటిల్లుతుందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జిల్లాలో అధిక శాతం రైతులు వరి, పత్తి పంటలు సాగు చేసేందుకే మొగ్గు చూపుతున్నారు.

కంది, పెసర, మినుములు..

ఎల్‌నినో ముప్పు కారణంగా రైతులు ఆందోళన చెందుతున్నారు. దీంతో ప్రత్యామ్నాయ పంటల సాగువైపు రైతులు దృష్టి సారించాలని అధికారులు పేర్కొంటున్నారు. ఎల్‌నినో ప్రభావాన్ని తట్టుకునేందుకు రైతులు కంది, పెసర, మినుము, జొన్న, సజ్జ, నువ్వులు తదితర వంటి ప్రత్యామ్నాయ పంటలను సాగు చేయాలని వ్యవసాయ శాఖ సూచిస్తుంది. ఒకే పంటపై ఆధారపడకుండా పంట మార్పిడి చేపట్టాలని, జూలై 15వ తేదీ వరకు సరిపడా వర్షాలు లేకపోతే 125 రోజుల లోపు పండే స్వల్పకాలిక వరి రకాలను ఎంచుకోవాలని వ్యవసాయ శాఖ పేర్కొంటుంది.

జిల్లాలో 1.63 లక్షల ఎకరాల్లో సాగు

జిల్లాలోని 10 మండలాల పరిధిలో రైతులు 1,63,229 ఎకరాల్లో పంటలు సాగు చేయనున్నట్లు అధికారులు అంచనా వేశారు. సాగుకు సరిపోయే విత్తనాలను, ఎరువులను అందుబాటులో ఉంచి విక్రయిస్తున్నారు. జిల్లాలో అత్యధికంగా 1,07,700 ఎకరాల్లో వరి పంట, 28,600 ఎకరాల్లో పత్తి, 11,329 ఎకరాల్లో మొక్కజొన్న, 15,600 ఎకరాల్లో వివిధ రకాల పంటలను రైతులు సాగు చేయనున్నారు. ఇందుకోసం 26,925 క్వింటాళ్ల వరి విత్తనాలు, 906 క్వింటాళ్ల మొక్కజొన్న విత్తనాలు, 54,286 పత్తి విత్తనాల ప్యాకెట్లు అవసరమున్నట్లు వ్యవసాయ అధికారులు గుర్తించి ప్రభుత్వ, ప్రైవేట్‌ సెక్టార్లలో విత్తనాల కోనుగోలుకు ఏర్పాట్లు చేశారు. పంటల సాగు కోసం 17,504 మెట్రిక్‌ టన్నుల యూరియా, 10 వేల మెట్రిక్‌ టన్నుల డీఏపీ, 8వేల మెట్రిక్‌ టన్నుల ఎంఓపీ ఎరువులు అవసరమున్నట్లు ప్రణాళికలు రూపొందించి రైతులకు అందుబాటులో ఉంచేందుకు చర్యలు తీసుకుంటున్నారు. కాగా ఈ ఏడాది ఎల్‌నినో ప్రభావంతో తక్కువ వర్షపాతం సూచన ఉన్న నేపద్యంలో రైతులు ప్రత్యామ్నాయ పంటల సాగు చేయాలని అధికారులు చెబుతున్నప్పటికీ రైతులు ఇప్పటికే బోర్ల కింద వరినార్లు పోయగా, మరికొంత మంది రైతులు పత్తి విత్తనాలు నాటి వర్షాల కోసం ఎదురు చూస్తున్నారు.

ఎల్‌నినోతో ఏమి జరుగుతుంది?

ఎల్‌నినో ప్రభావంతో వర్షపాతం తగ్గే అవకాశంతో పాటు వేడి తరంగాలు పెరిగి, భూగర్భ జలాలు పడిపోయే అవకాశం ఉంది. వానాకాలం పంటలపై ప్రతికూల ప్రభావం ఉంటుందని వ్యవసాయ అధికారులు పేర్కొంటున్నారు. పంటలను సాగు చేస్తే దిగుబడులు తగ్గే అవకాశం ఉంటుందని అంటున్నారు. జూన్‌ మాసంలో సాధారణం కంటే తక్కువ వర్షాలు కురిసే అవకాశంతో పాటు జూలై, ఆగస్టు మాసాల్లో అంతంతమాత్రంగానే వర్షాలు కురిసే అవకాశం ఉందని వ్యవసాయ శాఖ రైతులకు హెచ్చరిస్తుంది.

ప్రత్యామ్నాయ పంటలే మేలు..

రాష్ట్రంలో ఎల్‌నినో ప్రభావంతో వర్షాలు సకాలంలో కురవకుండా సాగుకు ఇబ్బందులు ఏర్పడే అవకాశం ఉంది. వర్షాభావ పరిస్థితులు నెలకొని పంటలకు సాగు నీరు అందే అవకాశాలు తక్కువగా ఉంటాయి. ఎల్‌నినో ప్రభావాన్ని దృష్టిలో పెట్టుకొని తక్కువ కాలపరిమితి కలిగిన పంటలను ఎంపిక చేసుకోవాలి. ప్రత్యామ్నాయ పంటలను రైతులు ఎంపిక చేసుకుంటే ఫలితం ఉంటుంది.

– సురేష్‌కుమార్‌, జిల్లా వ్యవసాయ అధికారి

వర్షాల కోసం రైతన్నల ఎదురుచూపులు

జిల్లాలో రోజురోజుకూ పెరుగుతున్న ఉష్ణోగ్రతలు

పడిపోతున్న భూగర్భజలాలు

ప్రత్యామ్నాయ పంటలు సాగు చేయాలని వ్యవసాయశాఖ అధికారుల సూచన

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement