భూపాలపల్లి అర్బన్: జిల్లాలోని ప్రైవేట్ ఆస్పత్రుల్లో వైద్య ఆరోగ్యశాఖ అధికారులు శుక్రవారం ప్రత్యేక తనిఖీలు నిర్వహించారు. జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ మధుసూదన్ ఆధ్వర్యంలో ప్రోగ్రాం అధికారులు డాక్టర్ శ్రీదేవి, డాక్టర్ దేవేందర్, డెమో శ్రీదేవి ఈ తనిఖీలు నిర్వహించారు. పట్టణంలోని కిరణ్ హాస్పిటల్, యోదా హాస్పిటల్, మేధ హాస్పిటల్, స్మార్ట్ కేర్, శ్రీ వెంకటేశ్వర హాస్పిటల్, ప్రధాన్ హాస్పిటల్‌లలో తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఫైర్ సేఫ్టీ, కాలుష్య నియంత్రణ, బయోమెడికల్ వ్యర్థాల నిర్వహణ, అవసరమైన అనుమతులు, సర్టిఫికెట్లు, ధరల పట్టికలు తదితర అంశాలను పరిశీలించారు. అన్ని ఆస్పత్రుల్లోనూ దశలవారీగా తనిఖీలు నిర్వహిస్తామని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ మధుసూదన్ తెలిపారు. నిబంధనలు పాటించని ఆస్పత్రులపై తగిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
రేపు అంతర్జాతీయ
యోగా దినోత్సవం
భూపాలపల్లి అర్బన్: అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని ఈ నెల 21న జిల్లాకేంద్రంలోని ఇల్లందు క్లబ్‌లో యోగా కార్యక్రమం నిర్వహించనున్నట్లు ఆయుష్ వైద్యులు, నోడల్ అధికారి డాక్టర్ రాఘవేంద్రరావు శుక్రవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. యోగా ద్వారా శారీరక, మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకోవచ్చనే సందేశాన్ని ప్రజల్లో విస్తృతంగా చాటిచెప్పేందుకు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటుచేసినట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమానికి కలెక్టర్ రాహుల్ శర్మ, ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు, ప్రముఖులు హాజరుకానున్నారని తెలిపారు. అధికారులు, ప్రజాప్రతినిధులు, ఉద్యోగులు, ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.
‘ఎస్‌ఐఆర్’ను పకడ్బందీగా నిర్వహించాలి
ములుగు: స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (ఎస్‌ఐఆర్)–2026 ప్రక్రియను పకడ్బందీగా నిర్వహించాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సుదర్శన్ రెడ్డి సంబంధిత అధికారులను ఆదేశించారు. శుక్రవారం ఎస్‌ఐఆర్ ప్రక్రియ నిర్వహణపై రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సుదర్శన్ రెడ్డి రాష్ట్రంలోని అన్ని జిల్లాల కలెక్టర్లు, ఎన్నికల అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ వీసీలో కలెక్టరేట్ నుంచి కలెక్టర్ బోర్ఖడే హేమంత్ సహదేవరావు హాజరయ్యారు. ఈ సందర్భంగా సుదర్శన్ రెడ్డి మాట్లాడుతూ అన్ని జిల్లాల్లో ఎస్‌ఐఆర్ ప్రక్రియలో భాగంగా ఎన్యుమరేషన్ ఫారంల పంపిణీ, స్వీకరణ, ఓటరు వివరాల ధృవీకరణ తదితర ప్రక్రియలను ఎలాంటి లోపాలకు తావులేకుండా నిర్వహించాలని సూచించారు. బూత్ లెవల్ అధికారులకు (బీఎల్‌ఓలు) ప్రక్రియకు సంబంధించిన ప్రతీ అంశంపై పూర్తి అవగాహన ఉండాలన్నారు. జిల్లాల వారీగా ఎస్‌ఐఆర్ అమలుకు చేపట్టిన చర్యలు, రాజకీయ పార్టీల ప్రతినిధులతో నిర్వహించిన సమావేశాల వివరాలను కలెక్టర్లను అడిగి తెలుసుకున్నారు. మొత్తం ప్రక్రియను కలెక్టర్లు, ఉన్నతాధికారులు క్షేత్రస్థాయిలో నిరంతరం పర్యవేక్షించాలని ఆదేశించారు. సమావేశంలో తహసీల్దార్ విజయభాస్కర్, ఎన్నికల తహసీల్దార్ సలీం, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.
కోటంచ ఆలయ ఈఓగా శ్రీనివాస్ బాధ్యతల స్వీకరణ
రేగొండ: కొడవటంచ శ్రీ లక్ష్మీ నరసింహాస్వామి ఆలయ కార్యనిర్వహణాధికారిగా బిల్ల శ్రీనివాస్ శుక్రవారం బాధ్యతలు చేపట్టారు. అంతకుముందు ఆయన ప్రత్యేక పూజలలో పాల్గొని స్వామి వారిని దర్శించుకున్నారు. అనంతరం ఆలయంలోని ఈఓ కార్యాలయంలో శ్రీనివాస్ బాధ్యతలు తీసుకున్నారు.
‘అవినీతి అనడం
హాస్యాస్పదం’
కాళేశ్వరం: కాళేశ్వరాలయం టెండర్లు పూర్తికాలేదని ఇప్పుడే అవినీతి అని పుట్ట మధు వ్యాఖ్యలు చేయడం హాస్యాస్పదం అని కాళేశ్వరం దేవస్థానం చైర్మన్ అవధాని మోహన్‌శర్మ శుక్రవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. కాళేశ్వర క్షేత్రాన్ని రాజకీయాల్లోకి లాగడం బాధ్యతారాహిత్యమన్నారు.


