● పథకాలు అర్హులైన ప్రతీ లబ్ధిదారుడికి చేరాలి
● మహబూబాబాద్ ఎంపీ, దిశా కమిటీ చైర్మన్ పోరిక బలరాం నాయక్
ములుగు: కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న వివిధ అభివృద్ధి, సంక్షేమ పథకాల ప్రయోజనాలు అర్హులైన ప్రతీ లబ్ధిదారుడికి సకాలంలో అందేవిధంగా అధికారులు క్షేత్రస్థాయిలో పర్యవేక్షణతో పనిచేయాలని మహబూబాబాద్ పార్లమెంట్ సభ్యుడు, దిశా కమిటీ చైర్మన్ పోరిక బలరాం నాయక్ అన్నారు. శుక్రవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో గ్రామీణాభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన జిల్లా అభివృద్ధి సమన్వయ పర్యవేక్షణ కమిటీ సమావేశానికి బలరాం నాయక్ హాజరై మాట్లాడారు. జిల్లాలో వివిధ శాఖల ఆధ్వర్యంలో కొనసాగుతున్న అభివృద్ధి పనుల పురోగతిని శాఖల వారీగా సమీక్షించి, పనుల అమలులో ఎటువంటి జాప్యం లేకుండా అధికారులు బాధ్యతాయుతంగా వ్యవహరించాలని ఆదేశించారు. జిల్లా కేంద్రంలోని ఏరియా ఆస్పత్రిలో ఎంఆర్‌ఐ స్కాన్ ఏర్పాటు కోసం తక్షణమే ప్రతిపాదనలు సిద్ధం చేసి పంపించాలని సంబంధిత శాఖ అధికారులను ఆదేశించారు. మెడికల్ కళాశాల విద్యార్థులతో గిరిజన ప్రాంతాలలో వైద్య శిక్షణ శిబిరాలు నిర్వహించేలా చర్యలు చేపట్టాలని సూచించారు. సమగ్ర శిక్ష కార్యక్రమం, మధ్యాహ్న భోజన పథకం అమలును మరింత సమర్థవంతంగా నిర్వహించాలన్నారు. ముఖ్యంగా ఏజెన్సీ ప్రాంతాలలో విద్య, వైద్యం, వ్యవసాయ రంగాలపై అధికారులు ప్రత్యేక దృష్టి సారించి ప్రజలకు మెరుగైన సేవలు అందించాలన్నారు. యూరియా వినియోగంపై రైతులకు విస్తృత అవగాహన కల్పించాలని, ఆన్‌లైన్ విధానం ద్వారానే ఎరువుల కొనుగోలు, అమ్మకాలు జరిగేలా చర్యలు తీసుకోవాలని, బ్లాక్ మార్కెట్‌పై కఠిన చర్యలు చేపట్టాలని సంబంధిత శాఖ అధికారులను ఆదేశించారు. రైతులు సేంద్రియ వ్యవసాయం వైపు మొగ్గుచూపేలా ప్రోత్సహించాలని పేర్కొన్నారు. ములుగు, ఏటూరునాగారం ప్రాంతాల్లో రింగ్ రోడ్ ఏర్పాటుకు అంచనాలు సిద్ధం చేయాలని, ఏజెన్సీ ప్రాంతాల అభివృద్ధికి అవసరమైన పనుల జాబితాను రూపొందించి ప్రాధాన్యత క్రమంలో అమలు చేయాలన్నారు. అనంతరం కలెక్టర్ బోర్ఖడే హేమంత్ సహదేవరావు మాట్లాడుతూ జిల్లాలో ప్రతీ మూడు నెలలకు ఒకసారి దిశా సమావేశం నిర్వహిస్తూ అభివృద్ధి పనులపై సమీక్ష కొనసాగిస్తామన్నారు. సమావేశంలో తెలంగాణ రాష్ట్ర మహిళా కమిషన్ సభ్యురాలు రాధాబాయి, ఎస్పీ సుధీర్ రామ్నాద్ కేకన్, అటవీ శాఖ జిల్లా అధికారి వికాస్ మీనా, దిశా కమిటీ సభ్యులు పూర్ణచందర్, అదనపు కలెక్టర్ సంపత్ రావు, జిల్లా రెవెన్యూ అధికారి రవికుమార్, మున్సిపల్ చైర్‌పర్సన్ చింతనిప్పుల చంద్రకళ, అధికారులు పాల్గొన్నారు.


