● సాదా బైనామా, రీ– సర్వే ప్రక్రియలను గడువులోగా పూర్తి చేయాలి
● వీసీలో రాష్ట్ర రెవెన్యూ శాఖ
ప్రిన్సిపల్ సెక్రటరీ లోకేష్ కుమార్
ములుగు: భూధార్ సర్వే, భూభారతి దరఖాస్తుల పరిష్కారాన్ని వేగవంతం చేయాలని, సాదా బైనామా, రీ–సర్వే ప్రక్రియలను గడువులోగా పూర్తి చేయాలని, రెవెన్యూ సేవలను ప్రజలకు పారదర్శకంగా అందించాలని రాష్ట్ర రెవెన్యూ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ డీ.ఎస్.లోకేష్ కుమార్ అధికారులను ఆదేశించారు. శుక్రవారం పలు జిల్లాల కలెక్టర్లతో భూధార్ సర్వే, భూభారతి, సాదా బైనామా, నాన్–కడాస్ట్రల్ గ్రామాల రీ–సర్వే, నక్షా కార్యక్రమం, తదితర అంశాలపై వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించగా జిల్లా నుంచి కలెక్టర్ బోర్ఖడే హేమంత్ సహదేవరావు, అదనపు కలెక్టర్ సీహెచ్ మహేందర్ జీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా లోకేష్ కుమార్ మాట్లాడుతూ రాష్ట్రవ్యాప్తంగా కొనసాగుతున్న భూధార్ సర్వే కార్యక్రమాన్ని వేగవంతంగా పూర్తి చేయాలని, ప్రతి భూ యజమానికి ఖచ్చితమైన భూ వివరాలు నమోదు అయ్యేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. భూభారతి కార్యక్రమం కింద వచ్చిన దరఖాస్తులను ఎటువంటి జాప్యం లేకుండా పరిశీలించి త్వరగా పరిష్కరించాలని, ప్రజలకు రెవెన్యూ సేవలు సకాలంలో అందేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. జిల్లాలో కొనసాగుతున్న నాన్–కడాస్ట్రల్ గ్రామాల రీ–సర్వే కార్యక్రమాన్ని నిర్దేశిత గడువులోగా పూర్తి చేయాలని, ఎంపిక చేసిన గ్రామాల్లో నక్షా డిజిటల్ భూ మ్యాపింగ్ పనులను నాణ్యతా ప్రమాణాలతో అమలు చేయాలన్నారు. భూముల హద్దుల నిర్ధారణలో పారదర్శకత పాటిస్తూ భూ రికార్డుల ఆధునీకరణకు అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. వీసీ అనంతరం కలెక్టర్ బోర్ఖడే హేమంత్ సహదేవరావు సంబంధిత అధికారులతో సమీక్ష నిర్వహించి, రాష్ట్ర ప్రభుత్వం నిర్దేశించిన లక్ష్యాలను గడువులోగా పూర్తి చేయడానికి సమన్వయంతో పనిచేయాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ విజయభాస్కర్, సంబంధిత రెవెన్యూ అధికారులు పాల్గొన్నారు.


