‘స్థలం కేటాయించాలని వినతి’ | - | Sakshi
Sakshi News home page

‘స్థలం కేటాయించాలని వినతి’

Jun 19 2026 1:00 AM | Updated on Jun 19 2026 1:00 AM

ఎస్‌ఎస్‌ తాడ్వాయి: మండల పరిధిలోని మేడారంలో లేదా పెట్రోల్‌ పంపు సమీపంలో డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ విగ్రహ ప్రతిష్ఠాపనకు స్థలం కేటాయించాలని కోరుతూ అంబేడ్కర్‌ విగ్రహ ప్రతిష్ఠాపన కమిటీ అధ్యక్షులు గజ్జల ప్రసాద్‌ కోరారు. ఈ మేరకు గురువారం కలెక్టరేట్‌లో కలెక్టర్‌ బోర్ఖడే హేమంత్‌ సహదేవరావును మర్యాదపూర్వకంగా కలిసి వినతిపత్రం అందజేశారు. అనంతరం ఆయనను శాలువాతో సత్కరించి బొకే అందజేశారు. అంబేడ్కర్‌ విగ్రహ ప్రతిష్ఠాపనకు స్థలం కేటాయించాలని విన్నవించారు. దీనిపై కలెక్టర్‌ సానుకూలంగా స్పందించారని వివరించారు. ఈ కార్యక్రమంలో ఎంఎస్పీ జిల్లా అధ్యక్షుడు మడిపెల్లి శ్యాంబాబు, విగ్రహ ప్రతిష్ఠాపన కమిటీ కార్యదర్శి గజ్జెల రాజశేఖర్‌, సహాయ కార్యదర్శి గజ్జెల మహేశ్‌, అంబేడ్కర్‌ యువజన సంఘం అధ్యక్షులు గజ్జల నవీన్‌, అంబాల సందీప్‌ తదితరులు పాల్గొన్నారు.

ధాన్యం కొనుగోళ్ల డబ్బుల చెల్లింపులు పూర్తి

ములుగు రూరల్‌: యాసంగి సీజన్‌లో జిల్లా పౌర సరఫరాల శాఖ ఆధ్వర్యంలో ధాన్యం కొనుగోళ్లు చేసిన డబ్బుల చెల్లింపులు విజయవంతంగా పూర్తి చేశామని జిల్లా పౌర సరఫరాల అధికారి సయ్యద్‌ షా ఫైసల్‌ హుస్సేని గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లా వ్యాప్తంగా 149 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి 1,11,766 మెట్రిక్‌ టన్నుల ధాన్యం 14,220 మంది రైతుల నుంచి కొనుగోలు చేసినట్లు వెల్లడించారు. అందుకు గాను రూ. 265 కోట్లు చెల్లించామని వివరించారు. అలాగే ఎల్‌పీజీ వినియోగదారులు ఈ కేవైసీని ఈ నెల 30వ తేదీ వరకు చేసుకోవాలని సూచించారు. లేనిపక్షంలో గ్యాస్‌ సబ్సిడీ కోల్పోతారని తెలిపారు.

ల్యాబ్‌ టెక్నీషియన్‌

పోస్టులకు దరఖాస్తులు

ములుగు రూరల్‌: జాతీయ ఆరోగ్య మిషన్‌ విభాగం ఎన్‌టీఈఎఫ్‌ ప్రోగ్రాం నందు ల్యాబ్‌ టెక్నీషియన్‌ పోస్టులు రెండు ఖాళీగా ఉన్నాయని అందుకు అర్హులైన వారు దరఖాస్తులు చేసుకోవాలని డీఎంహెచ్‌ఓ గోపాల్‌రావు గురువారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఈ పోస్టుల భర్తీ కాంట్రాక్ట్‌ పద్ధతిలో చేపడుతున్నట్లు తెలిపారు. అర్హులు ఈనెల 24వ తేదీ లోపు దరఖాస్తులు జిల్లా వైద్యాధికారి కార్యాలయంలో సమర్పించాలని తెలిపారు. ఆన్‌లైన్‌ హెచ్‌టీటీపీఎస్‌://ములుగు.తెలంగాణ .జీఓవీ.ఇన్‌లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.

నైరుతి ప్రాకారం నుంచి తొలగింపు ప్రక్రియ షురూ

కాళేశ్వరం: మహదేవపూర్‌ మండలం కాళేశ్వరంలోని శ్రీకాళేశ్వర ముక్తీశ్వరస్వామి ఆలయం నైరుతిలో ఉన్న విజయగణపతి ఆలయం నుంచి దక్షిణ గోపురం వరకు ఉన్న ప్రాకారం విగ్రహాలను తమిళ శిల్పి రవీంద్రన్‌ ఆధ్వర్యంలో తొలగింపు ప్రక్రియను గురువారం ప్రారంభించారు. ముందుగా కొబ్బరికాయ, గుమ్మడికాయలు కొట్టి తొలగింపును ప్రారంభించగా.. ప్రాకారంపై ఉన్న విగ్రహాలను తొలిగించారు. బుధవారం శృంగేరి పీఠం శిష్యులు విశేష పూజలు చేసి ఆదిముక్తీశ్వరాలయంలో బాలాలయం ఏర్పాటు చేసి ఉత్సవ మూర్తులకు ప్రాణపత్రిష్ఠ చేసిన విషయం తెలిసిందే. దీంతో తొలగింపును దేవాదాయశాఖ గురువారం నుంచి ప్రారంభించింది. పూర్తి స్థాయిలో త్వరలో ప్రారంభిస్తారని తెలిసింది.

ప్రమాదమని తెలిసినా..

మహాముత్తారం : మండలం మారుమూల ప్రాంతమైన కనుకునూర్‌ గ్రామానికి భూపాలపల్లి డిపో ఆర్టీసీ బస్సు ఉదయం, సాయంత్రం మాత్రమే నడుతున్నారు. మధ్యాహ్నం ప్రయాణం చేసేవారు ఇబ్బందులు పడుతున్నారు. విధిలేని పరిస్థితిలో కొంతమంది మండలకేంద్రానికి రావాలంటే 15కిలోమీటర్లు కాలినడకన పెగడపల్లికి వస్తున్నారు. అక్కడ నుంచి ప్రైవేట్‌ వాహనాల్లో మండలకేంద్రానికి చేరుకుంటున్నారు. గురువారం కాటారం మండలకేంద్రానికి వివిధ పనుల మీద వచ్చిన గ్రామస్తులు తిరుగు ప్రయాణంలో బస్సు లేకపోవడంతో ఓ ప్రైవేట్‌ వాహనంలో పైన వెనుక బాగంలో నిల్చొని ప్రయాణం చేశారు. ప్రమాదమని తెలిసినా తప్పనిసరి పరిస్థితుల్లో ప్రయాణం చేస్తున్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement