ఓటరు జాబితా సవరణకు సన్నద్ధం | - | Sakshi
Sakshi News home page

ఓటరు జాబితా సవరణకు సన్నద్ధం

Jun 19 2026 1:00 AM | Updated on Jun 19 2026 1:00 AM

ములుగు: ఓటరు జాబితా ప్రత్యేక సవరణ కార్యక్రమానికి అధికారులు పూర్తిస్థాయిలో సన్నద్ధం కావాలని, ఎస్‌ఐఆర్‌ నిర్వహణలో బూత్‌ లెవల్‌ ఆఫీసర్లు, ఏజెంట్ల పాత్ర కీలకంగా ఉంటుందని కలెక్టర్‌ బోర్ఖడే హేమంత్‌ సహదేవరావు అన్నారు. గురువారం ఎస్‌ఐఆర్‌ నిర్వహణ, బీఎల్‌ఓలు, బీఎల్‌ఏల శిక్షణ తరగతుల ఏర్పాట్లపై సంబంధిత అధికారులతో కలెక్టర్‌ గురువారం టెలీకాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ ములుగు నియోజకవర్గ పరిధిలో చేపట్టనున్న ఎస్‌ఐఆర్‌ కార్యక్రమాన్ని సమర్థవంతంగా అమలు చేసేందుకు బూత్‌ లెవల్‌ ఆఫీసర్లు, గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల బూత్‌ లెవల్‌ ఏజెంట్లకు ప్రత్యేక శిక్షణ తరగతులు నిర్వహించనున్నట్లు తెలిపారు. ఓటర్‌ జాబితాలో పొరపాట్లు లేకుండా, డూప్లికేట్‌ నమోదులను గుర్తించి, అభ్యంతరాలను నిబంధనల ప్రకారం పరిశీలించేలా బీఎల్‌ఓలకు పూర్తి అవగాహన కల్పించాలన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ఆదేశాల మేరకు నేడు(శుక్రవారం) ములుగు, మల్లంపల్లి, వెంకటాపురం(ఎం) మండలాలకు చెందిన బీఎల్‌ఓలకు కలెక్టరేట్‌ సమావేశ మందిరంలో, గోవిందరావుపేట, ఎస్‌ఎస్‌తాడ్వాయి మండలాల వారికి గోవిందరావుపేట పీఎస్‌ఆర్‌ గార్డెన్‌లో శిక్షణ తరగతులు నిర్వహించనున్నట్లు తెలిపారు. 20న శనివారం ఏటూరునాగారం, కన్నాయిగూడెం, మంగపేట మండలాల వారికి ఏటూరునాగారం ప్రభుత్వ డిగ్రీ కళాశాల సెమినార్‌ హాల్‌లో, 22న సోమవారం కొత్తగూడ, గంగారం మండలాల వారికి కొత్తగూడ రైతు వేదికలో ఉదయం, మధ్యాహ్నం రెండు సెషన్లలో శిక్షణ తరగతులు నిర్వహించనున్నట్లు వెల్లడించారు. ఈ శిక్షణలో ఓటరు జాబితా సవరణ ప్రక్రియ, కొత్త ఓటర్ల నమోదు, పేరు, చిరునామా మార్పులు, డూప్లికేట్‌ నమోదుల గుర్తింపు, అభ్యంతరాల పరిశీలనతో పాటు తదితర అంశాలపై సమగ్ర అవగాహన కల్పించనున్నట్లు కలెక్టర్‌ వివరించారు. ఈ టెలీకాన్ఫరెన్స్‌లో డిప్యూటీ జిల్లా ఎన్నికల అధికారి మహేందర్‌ జీ, ఎలక్ట్రోరల్‌ రిజిస్ట్రేషన్‌ ఆఫీసర్‌ కృష్ణవేణి, ఎన్నికల సూపరింటెండెంట్‌ సలీం, ఎన్నికల డిప్యూటీ తహసీల్దార్‌ నితీష్‌ కుమార్‌ తదితరులు పాల్గొన్నారు. అనంతరం కలెక్టరేట్‌లో ఏర్పాటు చేసిన ప్రత్యేక హెల్ప్‌ డెస్క్‌ను కలెక్టర్‌ బోర్ఖడే హేమంత్‌ సహదేవరావు పరిశీలించి పలు సూచనలు చేశారు.

కలెక్టర్‌ పేరుతో వాట్సాప్‌ ఫేక్‌ సందేశాలు

కలెక్టర్‌ బోర్ఖడే హేమంత్‌ సహదేవరావు పేరుతో కొంతమంది గుర్తుతెలియని వ్యక్తులు వాట్సాప్‌ ద్వారా ఫేక్‌ మెసేజ్‌లు పంపుతూ అధికారులను సంప్రదించే ప్రయత్నం చేస్తున్నారని కలెక్టర్‌ తెలిపారు. జిల్లాలోని అన్ని శాఖల అధికారులు, సిబ్బంది ఇటువంటి నకిలీ సందేశాలకు ఎట్టి పరిస్థితుల్లోనూ స్పందించవద్దని కలెక్టర్‌ సూచించారు.

కలెక్టర్‌ బోర్ఖడే హేమంత్‌ సహదేవరావు

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement