తునికాకు వివరాలు (స్టాండర్డ్ బ్యాగులు)
జిల్లాలో 23 తునికాకు కల్లాలు
ఏటూరునాగారం: జిల్లాలో తునికాకు సేకరణ లక్ష్యం చేరలేదు. జిల్లాలోని ఐదు అటవీ సబ్ డివిజన్ల పరిధిలో మొత్తం 23 యూనిట్లు ఏర్పాటు చేశారు. ఆయా యూనిట్ల నుంచి 19,100 స్టాండర్డ్ బ్యాగులు సేకరణ లక్ష్యంగా నిర్దేశించారు. ఇప్పటివరకు 10,600 సంచులను మాత్రమే సేకరించారు. తాడ్వాయి సబ్ డివిజన్‌లో 5,900 సేకరణ లక్ష్యం కాగా 1,940 స్టాండర్డ్ బ్యాగులను మాత్రమే సేకరించారు. ఏటూరునాగారం సబ్ డివిజన్‌లో 6,500గాను 3,980 సేకరించారు. వెంకటాపురం (కె) సబ్ డివిజన్‌లో 3,100 బ్యాగులకు గాను 2,700 సేకరించారు. ములుగు సబ్ డివిజన్ పరిధిలో సైతం 59 శాతం సేకరించారు.
పలు కారణాలు..
వేసవిలో ఉపాధి కల్పించే తునికాకు(బీడీ ఆకు) సేకరణ లక్ష్యాన్ని చేరకపోవడానికి పలు కారణాలు కనిపిస్తున్నాయి. ఆకును సేకరించే కూలీలకు గతంలో రెండు, మూడు రోజులకోసారి డబ్బులను చెల్లించేవారు. ప్రస్తుతం ఈ పరిస్థితి లేదు. కూలీలకు ఖాతాల్లో ఒకటి రెండు నెలలు ఆలస్యంగా డబ్బులను జమచేస్తున్నారు. కూలీలకు అంతకుముందు బ్యాంకులో ఏవైనా రుణాలు ఉంటే.. తునికాకు డబ్బులను బకాయి కింద జమ చేసుకునే అవకాశముంది. ఈ విధానంతో కూలీలు ఇబ్బందులు పడుతున్నారు. ప్రస్తుతం ఏజెన్సీ గ్రామాల్లో మిరప ఏరేందుకు వెళితే రోజుకు రూ.600 చెల్లిస్తున్నారని, ఏ రోజుకారోజే అందజేస్తున్నారని కూలీలు అంటున్నారు. అటవీశాఖ రెండు నెలలు ఆలస్యంగా డబ్బులు ఇస్తుండడంతో తునికాకు కోతకు వెళ్లేందుకు కూలీలు ఆసక్తి చూపడంలేదు. మరోవైపు ఉపాధి హామీ పనులు కూడా లభిస్తుండడంతో తునికాకుకు మొండిచేయి అయింది.
ప్రోత్సహించని అటవీశాఖ
తునికాకు సేకరణలో అటవీ శాఖ అధికారులు కూలీలు వచ్చేందుకు ఎలాంటి ప్రోత్సాహాన్ని ఇవ్వలేదు. బీట్ అధికారి నుంచి డివిజన్ అధికారి వరకు కూలీలను ప్రోత్సహించడం, అవగాహన కల్పించడం చేయకపోవడంతో లక్ష్యం నీరుగారిపోయిందని తునికాకు కాంట్రాక్టర్ ఆవేదన వ్యక్తం చేశారు.
లక్ష్యం 19,100
సేకరించింది 10,994.55
అత్యధిక సేకరణ పెరూరు 1314.67
అతి తక్కువ సేకరణ లింగాల 41.71
సున్నా సేకరణ నారాయణపూర్, కోడిశెల్ల–ఏ
లక్ష్యం 19,100 స్టాండర్డ్ బ్యాగులు
ఇప్పటివరకు సేకరణ 10,994


