వాజేడు: వర్షాకాలంలో సీజనల్ వ్యాధులు ప్రభలే అవకాశం ఉందని వైద్య సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు అన్నారు. బుధవారం వాజేడుకు వచ్చిన ఆయన వాజేడు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆకస్మిక తనిఖీ చేశారు. అక్కడే ఉన్న జిల్లా వైద్యాధికారి గోపాల రావు ద్వారా సిబ్బంది వివరాలను అడిగి తెలుసుకున్నారు. రోగులకు అందుతున్న వైద్యసేవలపై ఆరా తీశారు. ప్రజలకు అందే వైద్యం పట్ల నిర్లిప్తత ఉండవద్దన్నారు. ప్రజలకు మెరుగైన వైద్యం అందించడంతో పాటు వారికి భరోసా కల్పించాలని సూచించారు. ఆస్పత్రుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను వెంటనే భర్తీ చేసేలా చర్యలు తీసుకోవాలని డీఎంహెచ్‌ఓ గోపాలరావుకు సూచించారు. ఆయన వెంట కాంగ్రెస్ పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి విక్రాంత్, సొసైటీ ఉపాధ్యక్షుడు జగన్నాథరాజు, అచ్చ నాగేశ్వరరావు తదితరులు ఉన్నారు.
రేపు సమావేశం
భూపాలపల్లి అర్బన్: ఏరియాలో ఈ నెల 19న నిర్వహించనున్న ట్రైపార్టైట్ సేఫ్టీ రివ్యూ సమావేశాన్ని విజయవంతం చేయాలని ఏరియా సింగరేణి సింగరేణి జనరల్ మేనేజర్ రాజేశ్వర్‌రెడ్డి పిలుపునిచ్చారు. బుధవారం జీఎం కార్యాలయంలో జరిగిన సన్నాహక సమావేశంలో ఆయన మాట్లాడారు. డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ మైన్స్ సేఫ్టీ (డీజీఎంఎస్) ఉన్నతాధికారులు సమావేశానికి హాజరుకానున్నందున అన్ని ఏర్పాట్లను ప్రతిష్టాత్మకంగా పూర్తిచేయాలని అధికారులకు సూచించారు. గనుల్లో భద్రతా ప్రమాణాల అమలు, ప్రమాద నివారణ చర్యలు, కార్మికులకు అందిస్తున్న భద్రతా పరికరాలు, శిక్షణ కార్యక్రమాలు, అత్యవసర స్పందన వ్యవస్థలకు సంబంధించిన పూర్తి సమాచారాన్ని సిద్ధం చేయాలని ఆదేశించారు. భద్రత విషయంలో చిన్న నిర్లక్ష్యం కూడా పెద్ద ప్రమాదాలకు దారితీసే అవకాశం ఉన్నందున ప్రతీ ఉద్యోగి భద్రతా నిబంధనలను తప్పనిసరిగా పాటించాలన్నారు. జీరో ప్రమాదాల లక్ష్యసాధనకు అధికారులు, సూపర్‌వైజర్లు, కార్మికులు సమన్వయంతో పనిచేయాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో ఎస్‌వోటు జీఎం కవీంద్ర, వివిధ గనులు, విభాగాల అధికారులు, కార్మిక సంఘాల ప్రతినిధులు డాక్టర్ పద్మజ, రవికుమార్, శ్యామ్‌సుందర్, రాజేశ్వర్, రవీందర్, తిరుపతి, శ్యామ్‌సుందర్, రమేష్, హుస్సేన్ పాల్గొన్నారు.
కై లాపూర్ పాఠశాల
పునఃప్రారంభం
చిట్యాల: మండలంలోని కై లాపూర్ ప్రాథమిక పాఠశాల విద్యార్థు కొరతతో గతేడాది మూతబడింది. గ్రామస్తుల చొరవతో బుధవారం పునఃప్రారంభమైంది. గ్రామంలో పాఠశాల మూతపడడంతో అనేక ఇబ్బందులు పడాల్సి వస్తుందని గమనించిన గ్రామస్తులు తిరిగి పాఠశాల తెరుచుకునే విధంగా సర్పంచ్ కొడారి ఓదేలు, ఉపాధ్యాయుడు దశరథం, గ్రామస్తులు పలు చర్యలు చేపట్టారు. దీంతో పాఠశాలకు 20 మంది విద్యార్థులు హాజరైనట్లు వారు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సీఆర్ పల్లి పాఠశాల స్కూల్ అసిస్టెంట్ శనిగరపు భద్రయ్య, గ్రామస్తులు, వార్డు సభ్యులు పాల్గొన్నారు.


