ములుగు రూరల్: జిల్లాలో నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించడమే లక్ష్యంగా మెగా జాబ్‌మేళా నిర్వహించినట్లు రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, సీ్త్ర–శిశు సంక్షేమశాఖ మంత్రి ధనసరి సీతక్క అన్నారు. బుధవారం ఇంచర్ల ఎంఆర్ గార్డెన్‌లో నిర్వహించిన జాబ్‌మేళాకు కలెక్టర్ బోర్ఖడే హేమంత్ సహదేవరావుతో కలిసి ఆమె ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. యువతకు విద్యా అర్హతలు, నైపుణ్యాల ఆధారంగా ఉద్యోగ అవకాశాలు కల్పించామని తెలిపారు. యువత అవకాశాలను సద్వినియోగం చేసుకొని భవిష్యత్‌కు బలమైన పునాదులు వేసుకోవాలని అన్నారు. వచ్చిన అవకాశాలను యువత వినియోగించుకోవాలని సూచించారు. రూరల్ డెవలప్‌మెంట్ ఆధ్వర్యంలో యువతకు ప్రత్యేక వసతి గృహాలు ఏర్పాటుచేసి ఉచిత శిక్షణ కార్యక్రమాలు అందించేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తుందని అన్నారు. జిల్లా అన్ని రంగాలలో అభివృద్ధి చెందాలంటే యువత ఆర్థికాభివృద్ధి, ఉద్యోగ, ఉపాధిలో ముందుండాలని అన్నారు. ఉద్యోగం రాకుంటే నిరాశకు గురికాకూడదని అవకాశాలు వస్తాయని అన్నారు. కలెక్టర్ మాట్లాడుతూ జాబ్ మేళాలో సుమారు 2 వేల మంది పాల్గొన్నారని తెలిపారు. జాబ్ సాధించిన అభ్యర్థులు శిక్షణ కాలాన్ని సమర్థవంతంగా పూర్తిచేసి భవిష్యత్‌ను నిర్మించుకోవాలని సూచించారు. ఎస్పీ సుధీర్ రామ్‌నాథ్ కేకన్ మాట్లాడుతూ యువత సమాజానికి ఆదర్శంగా ఉండాలని అన్నారు. మత్తు పదార్థాలకు దూరంగా ఉంటూ ఉద్యోగ, ఉపాధి, వ్యక్తిత్వ వికాసం వైపు అడుగులు వేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో ఐటీడీఏ పీఓ లెనిన్ వత్సవ్ టోప్పో, రిటైర్డ్ ప్రొఫెసర్ పాండురంగారావు, ఏఏస్పీ మమన్ భట్, పంచాయితీరాజ్ డైరెక్టర్ భగవాన్‌రెడ్డి, మార్కెట్ కమిటీ చైర్‌పర్సన్ రేగ కల్యాణి, ఇంచర్ల సర్పంచ్ ముసినపల్లి కుమార్‌గౌడ్, మున్సిపాలిటీ వైస్ చైర్‌పర్సన్ ఆసియా షాహిన్ పాల్గొన్నారు.
మంత్రి సీతక్క


