గొత్తికోయల అభ్యున్నతికి కృషి | - | Sakshi
Sakshi News home page

గొత్తికోయల అభ్యున్నతికి కృషి

Jun 17 2026 12:52 AM | Updated on Jun 17 2026 12:52 AM

ఎస్‌ఎస్‌తాడ్వాయి: ఏజెన్సీలో నివసిస్తున్న గొత్తికోయల అభ్యున్నతికి సహకారం అందిస్తామని ఎస్పీ సుధీర్‌ రాంనాథ్‌ కేకన్‌ అన్నారు. మండల పరిధిలోని తోగు గొత్తికోయగూడెంను ఎస్పీ మంగళవారం సందర్శించారు. స్థానిక పెద్దలతో సమావేశమై సమస్యలను అడిగి తెలుసుకన్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ గొత్తికోయ గూడేలకు మట్టిరోడ్డు వేయించేలా చర్యలు తీసుకుంటామన్నారు. అవసరమైన ప్రాంతాల్లో సోలార్‌ లైట్లు ఏర్పాటు చేసేందుకు కృషి చేస్తామని వెల్లడించారు. గొత్తికోయల సమస్యలను ప్రభుత్వం, మంత్రి సీతక్క దృష్టికి తీసుకెళ్తానని హామీ ఇచ్చారు. అనంతరం గొత్తికోయ విద్యార్థులకు స్కూల్‌ బ్యాగులు, యువతకు వాలీబాల్‌ కిట్లు పంపిణీ చేశారు. అలాగే గూడెంలోని పాఠశాల ఆవరణలో ఎస్పీ రాంనాథ్‌ కేకన్‌, డీఎస్పీ రవీందర్‌ మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో పస్రా సీఐ దయాకర్‌, ఎస్సైలు జగదీశ్‌, తాజుద్దీన్‌, కమలాకర్‌ పాల్గొన్నారు.

రాజేశ్‌కు రాష్ట్ర సేవా

పురస్కారం

ములుగు రూరల్‌: మండల పరిధిలోని జాకారం గ్రామానికి చెందిన రేకులపల్లి రాజేశ్‌కు రాష్ట్ర సేవా పురస్కార నేషనల్‌ అవార్డు–2026 అందుకున్నారు. ఈ మేరకు మంగళవారం హైదరాబాద్‌లో ఆసియా వేదిక ఇంటర్నేషనల్‌ కల్చర్‌ అండ్‌ రీసెర్చ్‌ అకాడమి వారు ప్రదానం చేశారు. సామాజిక స్పృహ, సేవా కార్యక్రమాలు చేపడుతూ ప్రజలను చైతన్యపర్చడంతో పాటు తెలంగాణ సంస్కృతి ప్రతిభింభించే బోనాలు, బతుకమ్మ సామాజిక గీతాల ఎడిటర్‌గా ఎన్నో సేవలందించినందుకు గాను అవార్డును ప్రదానం చేసినట్లు రాజేశ్‌ వెల్లడించారు.

ఆత్మజిల్లా రైతు సలహాల కమిటీ ఏర్పాటు

ఏటూరునాగారం: జిల్లా ఆత్మరైతు సలహా కమిటీని ఏర్పాటు చేస్తూ జిల్లా వ్యవసాయ అధికారి సురేశ్‌ మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఏటూరునాగారం మండల కేంద్రానికి చెందిన కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నాయకుడు చిటమట రఘును ఆత్మ రైతు అడ్వైజర్‌ కమిటీ జిల్లా చైర్మన్‌గా ఎన్నిక చేశారు. అలాగే ఆత్మ కమిటీ ములుగు చైర్మన్‌ కొండం రవీందర్‌రెడ్డి, ఏటూరునాగారం ఆత్మ చైర్మన్‌గా కర్ల అరుణ, డైరెక్టర్లుగా జక్కుల రేవంత్‌ యాదవ్‌, కొంపెల్లి రాజురెడ్డి, పూజారి సమ్మయ్య, తడకల మహేందర్‌లను నామినేట్‌ చేసినట్లు, వీరి పదవీ కాలం రెండేళ్లు ఉంటుందని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.

210 గ్రాముల

గంజాయి స్వాధీనం

భూపాలపల్లి అర్బన్‌: భూపాలపల్లి పట్టణంలో సీసీఎస్‌, భూపాలపల్లి పోలీసులు 210 గ్రాముల గంజాయి స్వాధీనం చేసుకుని ఐదుగురిని అరెస్టు చేశారు. సీఐ నరేష్‌కుమార్‌ తెలిపిన వివరాల ప్రకారం.. సెగ్గంపల్లికి చెందిన దాసరి వంశీ (20), దుర్గం మహర్షి పట్టణ శివారు బాంబులగడ్డలో గంజాయి సేవిస్తున్నారు. వారి వద్ద నుంచి 210 గ్రాముల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. అనంతరం విచారణలో గడ్డిగానిపల్లికి చెందిన సెగ్గం సాయి వర్ధన్‌, ములుగు జిల్లా ఏటూరునాగారం మండలం రోయ్యూరు గ్రామానికి చెందిన జాడి మనోజ్‌, దుర్గం కిరణ్‌ గంజాయి సరఫరా చేసినట్లు గుర్తించి వారిపై కూడా కేసు నమోదు చేశారు. ఐదుగురిని అరెస్టు చేశారు.

గడువు పొడిగింపు

భూపాలపల్లి అర్బన్‌: డిగ్రీలో ప్రవేశాలకు దోస్తి మూడో దశ దరఖాస్తుల స్వీకరణ గడువును ఈ నెల 21వరకు పొడిగించినట్లు ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్‌ రమణారావు ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఇంటర్మీడియట్‌ ఉత్తీర్ణులైన విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని వీలైనంత త్వరగా దోస్తి పోర్టల్‌లో తమ నమోదు ప్రక్రియను పూర్తి చేసుకోవాలని ప్రిన్సిపాల్‌ రమణారావు సూచించారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement