● పది, ఇంటర్ ఫలితాల్లో ప్రతిభ కనబర్చిన విద్యార్థులకు సైకిళ్ల పంపిణీ
● రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి
ధనసరి సీతక్క
ములుగు: అటవీ ప్రాంత జిల్లాగా పేరుగాంచిన ములుగు విద్యారంగంలో రాష్ట్రానికే ఆదర్శంగా నిలుస్తుందని, విద్యార్థుల్లో ప్రతిభను గుర్తించి ప్రోత్సహించడం ద్వారా వారి భవిష్యత్‌కు బలమైన పునాది వేయవచ్చని రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ధనసరి సీతక్క అన్నారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో విద్యాశాఖ ఆధ్వర్యంలో రోటరీ క్లబ్ ఆఫ్ వరంగల్ సెంట్రల్ సహకారంతో జిల్లా వ్యాప్తంగా పదో తరగతి, ఇంటర్మీడియట్ పరీక్షల్లో ఉత్తమ ప్రతిభ కనబర్చిన 50 మంది విద్యార్థులకు మంత్రి సీతక్క మంగళవారం సైకిళ్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి సీతక్క మాట్లాడుతూ జిల్లాలో నిరక్షరాస్యత అధికంగా ఉనప్పటికీ అధికారులు, విద్యార్థుల తల్లిదండ్రులు, విద్యార్థుల సమష్టి కృషి ఫలితంగా ఈ ఏడాది పదో తరగతి ఫలితాల్లో 99.30 శాతం ఉత్తీర్ణతతో రాష్ట్రంలో మొదటి స్థానం, ఇంటర్మీడియట్ ఫలితాల్లో రాష్ట్రంలో రెండో స్థానం సాధించడం గర్వంగా ఉందని పేర్కొన్నారు. జిల్లా వ్యాప్తంగా అన్ని మండలాల్లో మొదటి మూడు స్థానాల్లో నిలిచిన విద్యార్థులకు రోటరీ క్లబ్ ఆఫ్ వరంగల్ సెంట్రల్ సహకారంతో 50 సైకిళ్లు పంపిణీ చేయడం అభినందనీయమన్నారు. అదే విధంగా ప్రభుత్వం చేపట్టిన ‘అమ్మకు అక్షరమాల’ కార్యక్రమం రాష్ట్రంలో మహిళా అక్షరాస్యతకు కొత్త దిశానిర్దేశం చేస్తోందన్నారు. చదువురాని 12 లక్షల మంది మహిళా సంఘాల సభ్యులను గుర్తించామన్నారు. మొదటి విడతగా 6 లక్షల మందికి లిటరసీ పరీక్షలు నిర్వహించగా 83.33 శాతం మంది ఉత్తీర్ణత సాధించడం విశేషమన్నారు. కార్యక్రమంలో కలెక్టర్ హేమంత్ సహదేవరావు, గ్రంథాలయ సంస్థ చైర్మన్ రవిచందర్, మార్కెట్ కమిటీ చైర్‌పర్సన్ కల్యాణి, మున్సిపాలిటీ చైర్‌పర్సన్ చంద్రకళ, వైస్ చైర్‌పర్సన్ ఆసియా షాహిన్, డీఈఓ సిద్ధార్థ రెడ్డి, రోటరీ క్లబ్ ప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు. అనంతరం మంత్రి సీతక్క ఆర్‌అండ్‌బీ అతిథి గృహంలో మదర్ ఫౌండేషన్ స్వచ్ఛంద సంస్థ సహకారంతో మహిళా సంఘాల సభ్యులకు కుట్టు మిషన్ శిక్షణపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మంత్రి హాజరై పలు సూచనలు చేశారు.
కార్యకర్తలు సైనికుల్లా పనిచేయాలి
కార్యకర్తలు పార్టీ అభ్యున్నతికి సైనికుల్లా పనిచేయాలని మంత్రి సీతక్క పేర్కొన్నారు. జిల్లా కేంద్రంలోని డీఎల్‌ఆర్ ఫంక్షన్ హాల్‌లో డీసీసీ అధ్యక్షుడు పైడాకుల అశోక్ ఆధ్వర్యంలో మంగళవారం నిర్వహించిన జిల్లా స్థాయి బూత్ లెవల్ ఏజెంట్లు, ముఖ్య కార్యకర్తల సమావేశానికి మంత్రి సీతక్క ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. ఓటర్ల జాబితాల ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియ ప్రజాస్వామ్య పరిరక్షణలో అత్యంత కీలకమన్నారు. ముఖ్యంగా యువత, మహిళలు, గిరిజనులు, అణగారిన వర్గాల ఓటర్ల నమోదు, తొలగింపుల ధృవీకరణపై దృష్టి సారించాలని సూచించారు.


