మహిమాన్వితం హేమాచల క్షేత్రం | - | Sakshi
Sakshi News home page

మహిమాన్వితం హేమాచల క్షేత్రం

Jun 17 2026 12:52 AM | Updated on Jun 17 2026 12:52 AM

ధర్మాదాయ, దేవాదాయశాఖ కమిషనర్‌ హన్మంతరావు

మంగపేట: మల్లూరు శ్రీ హేమాచల క్షేత్రం ఎంతో మహిమాన్వితమైందని ధర్మాదాయ, దేవాదాయ శాఖ కమిషనర్‌ ఎం. హన్మంతరావు అన్నారు. రెండో యాదగిరి గుట్టగా ప్రసిద్ధిగాంచిన శ్రీ హేమాచల లక్ష్మీనర్సింహస్వామిని ఆయన ధార్మిక సలహాదారు గోవిందాహరితో కలిసి మంగళవారం దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ కార్యనిర్వహణ ఇన్‌చార్జ్‌ వీరస్వామి ఆధ్వర్యంలో అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికి వేదమంత్రోచ్ఛరణ నడుమ వారి గోత్రనామాలతో ప్రత్యేక అర్చనలు జరిపించారు. స్వామివారి శేష వస్త్రాలతో సత్కరించారు. అనంతరం స్వామివారి ప్రత్యేకత, ఆలయ చరిత్రను వారికి వివరించి స్వామివారి తీర్థ ప్రసాదాలను అందచేశారు.

ఆలయ అభివృద్ధికి రూ.3కోట్లు మంజూరు

హేమాచలుడిని దర్శించుకున్న అనంతరం దేవాదాయశాఖ కమిషనర్‌ హన్మంతరావు సాక్షితో మాట్లాడారు. వచ్చే ఏడాది గోదావరి పుష్కరాలు జరగనున్న నేపథ్యంలో ఆలయ ప్రాంగణంలో వివిధ అభివృద్ధి పనులు చేపట్టేందుకు ప్రభుత్వం రూ.3 కోట్ల నిధులను మంజూరు చేసిందని తెలిపారు. ఆయా పనులకు త్వరలోనే టెండర్లు నిర్వహించనున్నట్లు వెల్లడించారు. అభివృద్ధి పనులు చేపట్టేందకు ఆలయ ప్రాంతం అటవీశాఖ పరిధిలో ఉండటంతో పర్యావరణ, అటవీశాఖ అనుమతులు తప్పనిసరి కావడంతో ఉన్నదానిలో అభివృద్ధి పనులు చేపట్టాలనే విషయంపై క్షేత్రస్థాయిలో పరిశీలించేందుకు వచ్చినట్లు వివరించారు. కార్యక్రమంలో మాజీ చైర్మన్‌ పూజారి సమ్మయ్య, యర్రంగారి సురేశ్‌, నూతులకంటి ముకుందం, ఆలయ పూజారులు ముక్కామల రాజశేఖర్‌శర్మ, పవన్‌కుమార్‌ ఆచార్యులు, ఏడునూతుల ఈశ్వర్‌చంద్‌, రామానుజం శర్మ, ఆలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement