‘సాగునీరు అందించాలి’ | - | Sakshi
Sakshi News home page

‘సాగునీరు అందించాలి’

Jun 16 2026 1:16 AM | Updated on Jun 16 2026 1:16 AM

ములుగు రూరల్‌: పొట్లాపూర్‌ పంపు హౌస్‌ నుంచి ములుగు మండల పరిధిలోని అన్ని చెరువులకు సాగునీరు అందించాలని తెలంగాణ రాష్ట్ర రైతు సంఘం జిల్లా కార్యద్శి అంజాద్‌ పాషా అన్నారు. మండలంలోని అన్ని చెరువులకు సాగునీరు అందించాలని కోరుతూ కలెక్టర్‌కు సోమవారం వినతి పత్రం అందజేశారు. ములుగు మండలంలోని రైతులు ఎక్కువగా వర్షాదారం పై ఆధారపడి వ్యవసాయం చేస్తున్నారని తెలిపారు. ప్రతీ ఏడాది వర్షాలు సక్రమంగా కురువక పంటలు ఎండి పోతున్నాయని అన్నారు. పొట్లాపూర్‌ పంపు హౌస్‌ నుంచి అన్ని చెరువులకు సాగునీరు అందించి రైతుల పంటల ఎండి పోకుండా చూడాలని కోరారు. ఈ కార్యక్రమంలో నాయకులు రమేశ్‌, కృష్ణయ్య, సమ్మయ్య, సుధాకర్‌, రమేశ్‌ తదితరులు పాల్గొన్నారు.

తుడుందెబ్బ రాష్ట్ర

ఉపాధ్యక్షుడిగా ప్రకాశ్‌

ఏటూరునాగారం: ఏటూరునాగారం మండలం గోగుపల్లికి చెందిన ఎట్టి ప్రకాశ్‌ను తుడుందెబ్బ రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా నియమించినట్లు తుడుందెబ్బ జాతీయ అధ్యక్షుడు వట్టం ఉపేందర్‌ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఆదివాసీలకు సేవ చేసేందుకు ప్రకాశ్‌ను నియమించినట్లు వెల్లడించారు. తనపై నమ్మకంతో బాధ్యతను అప్పగించిన తుడుందెబ్బ జాతీయ, రాష్ట్ర నాయకులకు ప్రకాశ్‌ కృతజ్ఞతలు తెలిపారు.

రోడ్డు మధ్యలో గుంత.. ప్రయాణికులకు ఇక్కట్లు

కన్నాయిగూడెం: మండల పరిధిలోని సర్వాయి గ్రామ పంచాయతీ పరిధి చిట్యాల గ్రామం ప్రధాన రోడ్డు మధ్యలో ఏర్పడిన గుంతతో ప్రయాణికులు అనేక ఇబ్బందులు పడుతున్నారు. నిత్యం రోడ్డుపై పగలు రాత్రి తేడా లేకుండా వాహనదారులు తిరుగుతుంటారు. దీంతో ఎప్పుడు ఏం ప్రమాదం జరుగుతుందో తెలియక ఆందోళన చెందుతున్నారు. పలువురు ద్విచక్రవాహనదారులు అందులో పడి గాయాలపాలయ్యారని గ్రామస్తులు చెబుతున్నారు. మరమ్మతులు చేయాలని గ్రామస్తులు పంచాయతీ అధికారులకు పలుమార్లు చెప్పినా ఫలితం లేకుండా పోతుందని అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికై నా అధికారులు, ప్రజాప్రతినిధులు చొరవ తీసుకుని మరమ్మతులు చేయాలని కోరుతున్నారు.

పాడుబడ్డబావులు..

మృత్యుపాశాలు

కన్నాయిగూడెం: మండలంలోని వివిధ గ్రామాల్లో పాడుబడ్డ బావులు మూగజీవాలకు మృత్యుపాశాలుగా మారుతున్నాయి. సర్వాయి గ్రామంలో రెండు గేదెలు సోమవారం పాడుబడ్డ బావిలో పడిపోయాయి. అవి ఎవరియో తెలియక గ్రామస్తులు వాట్సప్‌ గ్రూపుల్లో ఫొటోలు తీసి పెడుతున్నారు. వేసవి కావడంతో పంటలు లేకపోవడంతో మండలంలోని పశువులు, గేదెలు చేళ్లలో మేసి వాటంతట అవి తిరిగి గ్రామానికి వస్తున్నాయి. ఇదే క్రమంలో గేదెలు బావిలో పడి ఉంటాయని పలువురు గ్రామస్తులు చర్చించుకుంటున్నారు. గ్రామాల్లోని పాడుబడ్డ బావులను తక్షణమే పూడ్చాలని మండల ప్రజలు అధికారులను కోరుతున్నారు.

కోటగుళ్లలో ప్రత్యేక పూజలు

గణపురం: గణపురం మండలకేంద్రంలోని కాకతీయుల కళాక్షేత్రం కోటగుళ్లలో సోమవారం పర్వదినం సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ అర్చకులు జాలపల్లి నాగరాజు ఆధ్వర్యంలో స్వామి వారికి ఉదయమే ప్రత్యేక అభిషేకాలు, పూజలు నిర్వహించారు. అనంతరం స్వామి వారిని ప్రత్యేకంగా అలంకరించారు. ఉదయం నుంచే భక్తులు పెద్ద సంఖ్యలో స్వామి వారిని దర్శించుకున్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement