● కలెక్టర్ బోర్ఖడే హేమంత్ సహదేవరావు
ములుగు: జిల్లా అభివృద్ధే లక్ష్యంగా అధికారులు పనిచేయాలని, పెండింగ్ దరఖాస్తులతో పాటు అభివృద్ధి పనులు త్వరితగతిన పూర్తి చేయాలని కలెక్టర్ బోర్ఖడే హేమంత్ సహదేవరావు అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్‌లోని తన ఛాంబర్‌లో కలెక్టర్ సోమవారం రెవెన్యూ అధికారులతో భూ భారతి, భూసేకరణ, రామచంద్రపురం భూముల రీ సర్వే, మీసేవ ధ్రువీకరణ పత్రాల మంజూరు, స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ తదితర అంశాలపై సమీక్ష సమావేశం నిర్వహించారు. భూ భారతి కార్యక్రమం అమలు పురోగతి, భూ రికార్డుల పరిశీలన, ప్రజల నుంచి వచ్చిన దరఖాస్తుల పరిష్కారంపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ ప్రభుత్వ అవసరాలకు, అభివృద్ధి పనులకు సంబంధించిన భూ సేకరణలో నిబంధనలు పాటించాలని సూచించారు. రామచంద్రపురం భూముల రీ సర్వే అంశంపై పెండింగ్‌లో ఉన్న భూ వివాదాలు, సర్వే ప్రక్రియలను త్వరితగతిన పూర్తి చేసి, ప్రజలకు స్పష్టమైన హక్కులు కల్పించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. మీసేవ ధ్రువీకరణ పత్రాలను గడువులోపు అందించేలా సంబంధిత అధికారులు పనిచేయాలని ఆదేశించారు. స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ కార్యక్రమం పురోగతిపై సమీక్షిస్తూ సంబంధిత అధికారులు సమగ్రంగా పనిచేసి అన్ని వివరాలను క్షేత్రస్థాయిలో ఖచ్చితంగా నమోదు చేయాలని సూచించారు. జిల్లా అభివృద్ది, ప్రజాసేవల అమలు, భూ సమస్యల పరిష్కారం వంటి అంశాల్లో అధికారులు పరస్పర సమన్వయంతో పనిచేసి, పెండింగ్ సమస్యలు లేకుండా చూడాలని కలెక్టర్ స్పష్టం చేశారు. ఈ సమావేశంలో ఆర్డీఓ కృష్ణవేణి, డీఆర్‌ఓ రవికుమార్, కలెక్టరేట్ ఏఓ రాజ్‌కుమార్, పర్యవేక్షకులు మంజుల, మహేష్ బాబు, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.
ఇందిరమ్మ ఇళ్లలో వేగం పెంచాలి
ఇందిరమ్మ ఇళ్లలో వేగం పెంచాలని కలెక్టర్ హేమంత్ సహదేవరావు పేర్కొన్నారు. సోమవారం కలెక్టరేట్‌లో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాల పురోగతి, నూతన పింఛన్ల మంజూరు, వన మహోత్సవం, గ్రామాల్లో పారిశుద్ధ్యం, వర్షాకాలం సంసిద్ధత, అప్రమత్తం, తాగునీటి సరఫరా తదితర ఆంశాలపై సంబంధిత అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆదనపు కలెక్టర్ సంపత్‌రావు, డీపీఓ వెంకయ్య, హౌసింగ్ పీడీ సూర్యనారాయణ, మున్సిపల్ కమిషనర్ సంపత్, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.


