ఎస్‌ఎస్‌తాడ్వాయి: మండలంలోని మేడారం ఇంగ్లిష్ మీడియం పాఠశాలలో మామిడి తోరణాలు కట్టి పాఠశాలను సుందరంగా తీర్చిదిద్దారు. కాని పాఠశాలకు నలుగురు విద్యార్థులు మాత్రమే హాజరయ్యారు. అలాగే ఊరట్టం ఆశ్రమ పాఠశాలకు ఉపాధ్యాయులు హాజరైనప్పటికీ ఒక విద్యార్థి కూడా పాఠశాలకు హాజరు కాలేదు. ఊరట్టం పాఠశాలలో ముగ్గురు విద్యార్థినులు నూతనంగా అడ్మిషన్ తీసుకున్నట్లు హెచ్‌ఎం శ్రీనివాస్ తెలిపారు. పాఠశాల ప్రారంభం రోజున పాఠశాలకు వచ్చిన ఊరట్టం పాఠశాలలో పిల్లలను చేర్పించేందుకు వచ్చిన విద్యార్థినుల తల్లిదండ్రులు, సర్పంచ్ శైలజకు ఉపాధ్యాయులు పుష్పగుచ్చాలు అందజేసి స్వాగతం పలికారు.
ఒక విద్యార్థి.. ఇద్దరు టీచర్లు
గోవిందరావుపేట: మండల పరిధిలోని గాంధీనగర్ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో కేవలం ఒక్క విద్యార్థి మాత్రమే హాజరయ్యారు. గతేడాది పాఠశాలలో ఆరుగురు విద్యార్థులు ఉండగా ఈ ఏడాది ప్రస్తుతం ఒకరు మాత్రమే పాఠశాలకు హాజరయ్యారు. ఆ విద్యార్థికి బోధించేందుకు పాఠశాలలో ఒక రెగ్యులర్ ఉపాధ్యాయురాలితో పాటు ఒకరు డిప్యుటేషన్ ఉపాధ్యాయురాలు విధులు నిర్వర్తిస్తున్నారు. పిల్లలు పాఠశాలలో చేరేలా చిన్నారుల తల్లిదండ్రులకు అవగాహన కల్పిస్తున్నారు.


