ములుగు రూరల్: జిల్లాలోని యువతలో ఆరోగ్యకర జీవన శైలి, ఫిట్‌నెస్‌పై అవగాహన పెంపొందించడమే ప్రధాన లక్ష్యంగా 50కిలో మీటర్ల అల్ట్రా మారథాన్ ఆదివారం విజయవంతంగా నిర్వహించారు. మారఽథాన్ రన్నర్ నిఖికుమార్ తన స్వగ్రామం రాయినిగూడెంలో ఆదివారం తెల్లవారుజామున 2.30గంటలకు పరుగును ప్రారంభించారు. ఈ కార్యక్రమాన్ని సర్పంచ్ సునీత గ్రామస్తుల సమక్షంలో ప్రారంభించారు. ఈ రన్ రాయినిగూడెం నుంచి జంగాలపల్లి, వెంకటాపురం(ఎం), రామప్ప, బండారుపల్లి మీదుగా ములుగు వరకు కొనసాగింది. ఈ సందర్భంగా నిఖికుమార్‌ను సీఐ సురేశ్, కాంగ్రెస్ పార్టీ నాయకులు చింతనిప్పుల భిక్షపతి, కౌన్సిలర్ ఓం ప్రకాశ్ తదితరులు శాలువా కప్పి అభినందించారు.
108తో అత్యవసర సేవలు
భూపాలపల్లి అర్బన్: కాళేశ్వరంలో సరస్వతి అంత్య పుష్కరాల సందర్భంగా 326మందికి 108 అంబులెన్స్ సేవల ద్వారా తరలించినట్లు 108 ప్రోగ్రాం మేనేజర్ శివకుమార్ తెలిపారు. రోగులకు అంబులెన్స్‌లోనే ప్రీ–హాస్పిటల్ ట్రీట్మెంట్ అందిస్తూ సమీప ఆస్పత్రులకు సురక్షితంగా తరలిస్తున్నట్లు తెలిపారు. పుష్కరాలకు వచ్చే భక్తులతో పాటు విధులు నిర్వహిస్తున్న సిబ్బంది వడదెబ్బకు గురవుతున్నారని వివరించారు. ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో 108 సిబ్బంది సమర్థవంతంగా సేవలు అందిస్తున్నట్లు తెలిపారు. పుష్కరాలు, ఆలయ దర్శనానికి వచ్చే భక్తులు తీవ్రమైన ఎండల బారిన పడకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.
అరటి తోట దగ్ధం
టేకుమట్ల: పంట వ్యర్థాలకు పెట్టిన నిప్పుతో చెలరేగిన మంటలు అంటుకుని అరటి తోట దగ్ధమైన ఘటన మండలంలోని పంగిడిపల్లిలో శనివారం సాయంత్రం చోటుచేసుకుంది. బాధిత రైతు పారిపెల్లి మహేందర్ కథనం ప్రకారం.. తనకున్న ఎకరన్నర వ్యవసాయ భూమిలో అరటితోట సాగు చేశాడు. రెండు రోజుల్లో అరటి గెలలను కోసేందుకు సిద్ధమయ్యాడు. ఈ తరుణంలో పరిసర ప్రాంత రైతులు పంట వ్యర్థాలకు అంటించిన నిప్పుతో మంటలు చెలరేగి అరటి తోట మొత్తం దగ్ధమైంది. అరటి తోటపై పెట్టుకున్న ఆశలు అగ్ని రూపంలో ఆవిరయ్యాయని రైతు ఆవేదన వ్యక్తం చేశాడు. ఆరుగాలం కష్టపడి పండించిన పంట పూర్తిగా దగ్ధమైందని.. ప్రభుత్వమే ఆదుకోవాలని వేడుకుంటున్నారు.
పామాయిల్ తోట దగ్ధం
భూపాలపల్లి రూరల్: అగ్ని ప్రమాదంలో పామాయిల్‌తోట దగ్ధమైన ఘటన భూపాలపల్లి మండలం గొర్లవీడు గ్రామంలో ఆదివారం చోటు చేసుకొంది. గొర్లవీడు గ్రామానికి చెందిన చెలిమెల రాజయ్యకు చెందిన సుమారు రెండెకరాల పామాయిల్, సుబాబు తోట ఆదివారం అగ్నికి ఆహుతైంది. ఈ ప్రమాదంలో విద్యుత్ మోటర్ వైర్లు, డ్రిప్ పైపులు పూర్తిగా దగ్ధమయ్యాయి.
రికార్డుల తనిఖీ
భూపాలపల్లి రూరల్: జిల్లాకేంద్రంలోని హనుమాన్ దేవాలయంతో పాటు భూపాలపల్లి మండలంలోని కొంపల్లి, ఫుల్లురామయ్యపల్లి, వజినపల్లి, నేరేడుపల్లి గ్రామాల్లోని దేవాలయాల్లో ధూప, దీప నైవేద్యానికి సంబంధించి సోషల్ ఆడిట్‌లో భాగంగా దేవాదాయ శాఖ అధికారి వరలక్ష్మి ఆదివారం తనిఖీ చేశారు. అధికారులు, సిబ్బంది ఆలయాల నిర్వహణ, పూజా కార్యక్రమాల వివరాలు పరిశీలించారు. ఆలయాల్లో జరుగుతున్న కార్యక్రమాలపై వివరాలు సేకరించారు. పుజారులు ఆలయాల్లోని సమస్యలను అధికారి వరలక్ష్మికి వివరించారు.


