ములుగు: జిల్లాలో వరి ధాన్యం, మొక్కజొన్న కేంద్రాల వద్ద ఉన్న పంట తడవకుండా కొనుగోలు ప్రక్రియను త్వరగా పూర్తి చేయాలని కలెక్టర్ బోర్ఖడే హేమంత్ సహదేవరావు అన్నారు. ఆదివారం ఖమ్మం కలెక్టరేట్ నుంచి ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టివిక్రమార్క, హైదరాబాద్ నుంచి మంత్రులు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, సీతక్క, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు సంబంధిత శాఖ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా వరిధాన్యం కొనుగోలు ప్రక్రియను పది రోజుల్లో యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలని ఆదేశించారు. గోదాముల కొరత, లారీలు, హమాలీల సమస్య ఉన్న చోట సమస్యను పరిష్కరించాలన్నారు. రైతులకు కనీస మద్దతు ధర చెల్లింపులు వేగంగా అందేలా ట్యాబ్ ఎంట్రీల డేటా అప్‌డేట్‌ను ఎప్పటికప్పుడు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. ఆదివారాల్లో సైతం చెల్లింపుల ప్రక్రియ కొనసాగుతుందని తెలిపారు. వర్షాలకు తడిసిన ధాన్యాన్ని కూడా ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందని వెల్లడించారు. ధాన్యం కొనుగోలు విషయంలో రైతులను ఇబ్బంది పెట్టే మధ్యవర్తులు, మిల్లర్లపై కఠిన చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. తాలు, తరుగు పేరుతో మోసం చేసే వారిని ఉపేక్షించబోమని వెల్లడించారు. అలాగే వ్యవసాయ క్షేత్రాల్లో పంటల అవశేషాలను కాల్చడం వల్ల వాతావరణం కలుషితం కావడంతో పాటు నేల సారవంతతను కోల్పోతుందని తెలిపారు. ఈ విషయాలపై కలెక్టర్లు రైతులకు అవగాహన కల్పించాలని వివరించారు. ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల షెడ్యూల్‌లో భాగంగా ఈ నెల 25వ తేదీ నుంచి నిర్వహించే మహిళా సంక్షేమ వారోత్సవాలను షెడ్యూల్ ప్రకారం నిర్వహించి విజయవంతం చేయాలని సూచించారు. ఈ వీసీలో జిల్లా నుంచి కలెక్టర్ బోర్ఖడే హేమంత్ సహదేవరావు, ఎస్పీ సుధీర్ రాంనాథ్ కేకన్, సివిల్ సప్లయీస్ డీఎం కృష్ణవేణి, డీడబ్ల్యూవో ప్రేమలత, సీపీఓ ప్రకాశ్ తదితరులు పాల్గొన్నారు.


