పచ్చి రొట్టతో భూసారం పెంపు | - | Sakshi
Sakshi News home page

పచ్చి రొట్టతో భూసారం పెంపు

May 25 2026 9:33 AM | Updated on May 25 2026 9:33 AM

పచ్చి రొట్టతో భూసారం పెంపు మెరుగైన వైద్య సేవలు అందించాలి టీఆర్‌ఎస్‌ గద్దెలు నిర్మించాలి రాజయ్య ఆశయ సాధనకు కృషి

మల్హర్‌: పచ్చి రొట్టతో భూసారం పెరుగుందని మండల వ్యవసాయ అధికారి శ్రీజ ఆదివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. రాయితీపై 50 క్వింటాళ్ల జీలుగు విత్తనాలు మండలంలోని కొయ్యూరు ఆగ్రోస్‌ రైతు సేవ కేంద్రంలో పంపిణీకి సిద్ధంగా ఉన్నాయని తెలిపారు. వరి, మిరప పంటలు వేసే రైతులు తప్పనిసరిగా ఈ పచ్చి రోట్ట విత్తనాలు తొలకరిలో దుక్కి దున్ని చల్లుకొని 45 రోజుల తర్వాత పూత దశలో భూమిలో కలియదున్నుకుంటే భూమి సారవంతం కావడమే కాక పంట దిగుబడులు పెరుగుతాయన్నారు. జీలుగ విత్తనాలు కావలసిన రైతులు పట్టా పాస్‌ పుస్తకం, ఆధార్‌ కార్డ్‌ జిరాక్స్‌ కాఫిలతో మండల వ్యవసాయధికారి కార్యాలయంలో సంప్రదించాలన్నారు. ఒక బస్తా (30 కిలోల) జీలుగ విత్తనాలు రూ.2452.50 చెల్లించాల్సి ఉంటుందన్నారు. రైతులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

భూపాలపల్లి అర్బన్‌: సరస్వతి అంత్య పుష్కరాల సందర్భంగా కాళేశ్వరానికి భారీగా తరలివస్తున్న భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా మెరుగైన వైద్య సేవలు అందించాలని జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారులు వైద్య సిబ్బందిని ఆదేశించారు. ఆదివారం కాళేశ్వరం ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, వైద్య శిబిరాలను భూపాలపల్లి జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి డాక్టర్‌ మధుసూదన్‌, ములుగు జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి డాక్టర్‌ గోపాల్‌ రావు కలిసి సందర్శించారు. ఈ సందర్భంగా వారు చికిత్స పొందుతున్న ఇన్‌పేషెంట్ల ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకుని, వారికి అందిస్తున్న వైద్యం, మందుల లభ్యత, అత్యవసర సేవల పరిస్థితిపై వివరాలు సేకరించారు. వైద్యులు, నర్సింగ్‌ సిబ్బంది విధుల నిర్వహణను సమగ్రంగా పరిశీలించి అవసరమైన సూచనలు చేశారు. ప్రస్తుతం అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్న నేపథ్యంలో భక్తులు వడదెబ్బకు గురికాకుండా ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని, తాగునీరు, ఓఆర్‌ఎస్‌ ప్యాకెట్లు, ప్రాథమిక మందులు అందుబాటులో ఉంచాలని సూచించారు. అత్యవసర పరిస్థితుల్లో వెంటనే స్పందించేలా వైద్య బృందాలు సిద్ధంగా ఉండాలని ఆదేశించారు. పుష్కరాల కాలంలో భక్తులకు నిరంతర వైద్య సేవలు అందించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు అధికారులు తెలిపారు. ఈ వైద్య అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

భూపాలపల్లి రూరల్‌: ప్రతీ గ్రామంలో తెలంగాణ రక్షణ సేన పార్టీ గద్దెలు నిర్మించాలని ఆ పార్టీ రాష్ట్ర అబ్జర్వర్‌ మెడల అభిలాష్‌ గౌడ్‌ కార్యకర్తలకు సూచించారు. ఆదివారం జిల్లా కేంద్రంలోని ప్రెస్‌ క్లబ్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. జిల్లాలోని అన్ని గ్రామాలలోటీఆర్‌ఎస్‌ పార్టీ గద్దెలు నిర్మాణం చేయాలన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్‌ పార్టీ చేస్తున్న అవినీతిని ప్రజల్లోకి తీసుకెళ్లి వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ వ్యవస్థాపక అధ్యక్షురాలు కల్వకుంట్ల కవితను ముఖ్యమంత్రిగా చేయడమే లక్ష్యంగా ప్రతి కార్యకర్త పనిచేయాలని వారు కోరారు. జిల్లా ఇన్‌చార్జ్‌ నరేష్‌ నేత, నియోజకవర్గ అబ్జర్వర్‌ అజయ్‌ రెడ్డి, సీనియర్‌ నాయకులు వినోద్‌,నాయకులు గోవర్దన్‌, చుక్క రాజు, విగ్నేష్‌, సన్నీ తదితరులు పాల్గొన్నారు.

భూపాలపల్లి అర్బన్‌: రాజయ్య ఆశయ సాధనకు కృషి చేయాలని సీఐటీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాలడుగు భాస్కర్‌ తెలిపారు. జిల్లా కేంద్రంలోని పైలెట్‌ కాలనీ సింగరేణి కమ్యూనిటీ హాల్‌లో సీఐటీయూ జిల్లా కార్యదర్శి బందు సాయిలు అధ్యక్షతన కంపేటి రాజయ్య సంస్మరణ సభ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సీఐటీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాలడుగు భాస్కర్‌, సింగరేణి కాలరీస్‌ ఎంప్లాయిస్‌ యూనియన్‌ రాష్ట్ర అధ్యక్షుడు మందా నరసింహారావు, రాష్ట్ర కార్యదర్శి తుమ్మల రాజారెడ్డిలు హాజరయ్యారు. ఈ సందర్భంగా భాస్కర్‌ మాట్లాడుతూ.. రాజయ్య జీవితం అసలైన కమ్యూనిస్టు ఉద్యమానికి నిదర్శనమని అన్నారు. క్రమశిక్షణ, పట్టుదల, కార్మిక హక్కుల కోసం చేసిన పోరాటాలు తరతరాలకు ఆదర్శమని నాయకులు పేర్కొన్నారు. బీజేపీ, కాంగ్రెస్‌ ప్రభుత్వాల కార్మిక వ్యతిరేక విధానాలను వ్యతిరేకిస్తూ సింగరేణి ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఆయన నిరంతరం పోరాడారని తెలిపారు. అనంతరం రాజయ్య పేరుతో పర్మినెంట్‌ కార్మికుల కోసం ఒక కార్యాలయం, కాంట్రాక్ట్‌ కార్మికుల కోసం మరో కార్యాలయాన్ని ప్రారంభించారు. త్వరలో రాజయ్య స్మారక స్తూపం, స్మారక భవనం నిర్మాణానికి కృషి చేస్తామని నాయకులు ప్రకటించారు. ఈ కార్యక్రమంలో రాజయ్య కుటుంబ సభ్యులు లక్ష్మి, నాగరాజు, స్వాతి, సీఐటీయూ, ప్రజా సంఘాల నాయకులు, కార్యకర్తలు, కార్మికులు, రాజయ్య కుటుంబ సభ్యులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement