పుష్కరాల్లో సంతోషం వ్యక్తం చేస్తున్న భక్తులు
చిట్యాల(కాశేశ్వరం): కాళేశ్వరంలో కొనసాగుతున్న సరస్వతీ అంత్య పుష్కరాలలో రాష్ట్ర ప్రభుత్వం, దేవాదాయ శాఖ కల్పించిన వసతులు సంతృప్తిగా ఉన్నాయని భక్తులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. పుష్కరాలకు వచ్చే భక్తులు ఆర్టీసీ బస్సుల్లో బస్టాండ్‌కు చేరుకోగానే బస్టాండ్ నుంచి పుష్కర ఘాట్ వరకు ఉచిత బస్సు సౌకర్యాన్ని కల్పించారు. సరస్వతీ ఘాట్ ఆరంభం నుండి గోదావరి నీటి ప్రాంతం వరకు దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో భక్తుల కోసం భక్తులకు ఎండ తీవ్రత కలుగకుండా నీడ కోసం పాండాలు ఏర్పాటు చేయడంతో పాటు, వేడి గాలుల నుండి ఉపశమనం పొందేందుకు స్ప్రీంకర్ల చిరుజల్లులతో చల్లని గాలి వస్తుంది.
ప్రత్యేకాకర్షణగా బాహుబలి సెట్టింగ్..
సరస్వతీ ఘాట్ వద్ద ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన బాహుబలి సెట్టింగ్ పుష్కరాలకు ప్రత్యేకాకర్షణగా నిలిచింది. బాహుబలి సెట్టింగ్‌కు ముందు భాగంలో డయాస్‌లో సాయంత్రం వేళ సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. అలాగే అదే డయాస్ నుండి పుష్కర ప్రధాన అర్చకులు గోదావరికి హారతి అందించడం వంటి ఘట్టాలకు భక్తులు పులకరించిపోతున్నారు. పుష్కర స్నానం అనంతరం ఆలయ దర్శనానికి భక్తులు ఎలాంటి ఇబ్బందులు పడకుండా క్యూలైన్ ఏర్పాటు చేశారు. పుష్కరాలలో ఎలాంటి అవాంచనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు పటిష్టమైన బందోబస్తు నిర్వహిస్తున్నారు.
ఏర్పాట్లు బాగున్నాయి..
అంత్య పుష్కరాలలో రాష్ట్ర ప్రభుత్వం, దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో భక్తుల కోసం చేసిన ఏర్పాట్లు చాలా బాగున్నాయి. ఎండల నుంచి ఉపశమనం కోసం వేసిన టెంట్లు, స్ప్రింకర్లు, అన్నదానం, కూలర్లు, తదితర సదుపాయాలు కల్పించారు. అలాగే బస్టాండ్ నుండి పుష్కర ఘాట్ వరకు బస్సు సౌకర్యం చాలా సౌకర్యంగా ఉంది. ఘాట్‌కు చేరుకునేందుకు ఎండలో నడవడం తప్పింది.
– సత్యనారాయణ, భక్తుడు, చంద్రాపూర్
శివయ్య సేవ కోసం వచ్చాం...
దైవ కార్యక్రమాలు ఎక్కడ జరిగినా వెళ్తాం. అందులో భాగంగానే కాళేశ్వరంలో నిర్వహిస్తున్న అంత్య పుష్కరాలకు కొరుట్ల నుంచి 50మంది భక్తులం శివయ్య సేవ చేసేందుకు ఇక్కడికి వచ్చాం. ప్రత్యేకంగా సేవ కోసం వచ్చిన తమకు ఆలయ సిబ్బంది అందించిన సహకారం బాగుంది.
– లక్ష్మీ, సేవకురాలు, కోరుట్ల


