రామప్పలో పర్యాటకుల సందడి | - | Sakshi
Sakshi News home page

రామప్పలో పర్యాటకుల సందడి

May 24 2026 1:03 AM | Updated on May 24 2026 1:03 AM

వెంకటాపురం(ఎం): మండలంలోని చారిత్రాత్మక రామప్ప దేవాలయంలో శనివారం పర్యాటకుల సందడి నెలకొంది. వీకెండ్‌ కావడంతో పాటు కాళేశ్వరంలో అంత్యపుష్కరాలు కొనసాగుతుండడంతో పర్యాటకులు తిరుగు ప్రయాణంలో రామప్ప ఆలయాన్ని సందర్శించి రామలింగేశ్వరస్వామిని దర్శించుకుంటున్నారు. ఆలయ పూజారులు హరీషశర్మ, ఉమాశంకర్‌లు భక్తులకు తీర్థప్రసాదాలు అందించి ఆశీర్వచనం చేస్తుండగా, గైడ్‌లు విజయ్‌కుమార్‌, వెంకటేష్‌లు ఆలయ చరిత్రను, విశిష్టతను పర్యాటకులకు వివరిస్తున్నారు. రామప్పకు వచ్చే పర్యాటకుల కోసం ఆలయంలో ఉచిత మినరల్‌ వాటర్‌ను అందుబాటులో ఉంచినట్లు ఆలయ ఈఓ ఇమ్మడి భాస్కర్‌ తెలిపారు.

ఆరోగ్యంపై జాగ్రత్తలు పాటించాలి

ఏటూరునాగారం: ప్రభుత్వ ఉద్యోగులు నిరంతరం ఒత్తిడికి గురవుతుంటారని, ఆరోగ్యంపై శ్రద్ధ తీసుకోవాలని ఐటీడీఏ పీఓ లెనిన్‌ వత్సల్‌ టొప్పో అన్నారు. శనివారం మండలకేంద్రంలోని ఐటీడీఏ కార్యాలయంలో డిప్యూటీ డీఎంహెచ్‌ఓ క్రాంతికుమార్‌ ఆధ్వర్యంలో కార్యాలయంలో పనిచేసే అధికారులు, సిబ్బందికి ఉచితంగా కంటి, ఆరోగ్య పరీక్షల శిబిరాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా పీఓ వైద్యశిబిరాన్ని సందర్శించి మాట్లాడుతూ ఆరోగ్యంగా ఉన్నప్పటికీ అంతర్గత సమస్యలు తెలియకపోవచ్చని, ప్రతీ ఉద్యోగి క్రమం తప్పకుండా బీపీ, షుగర్‌ వంటి పరీక్షలు చేయించుకోవాలన్నారు. ప్రతీఒక్కరికి స్క్రీనింగ్‌ చేయడంతో ఏమైనా సమస్యలు గుర్తించిన పక్షంలో మెరుగైన చికిత్స కోసం పెద్ద ఆస్పత్రులకు పంపించే విధంగా ఏర్పాటు చేస్తామన్నారు. వైద్యశిబిరంలో మొత్తం 63 మందికి పరీక్షలు చేసి మందులు ఇచ్చారు. కార్యక్రమంలో ఏపీఓ నాగోరావు, డిప్యూటీ డైరెక్టర్‌ దబ్బగట్ల జనార్దన్‌, ఏఓ రాజ్‌కుమార్‌, మేనేజర్‌ శ్రీనివాస్‌, వైద్యులు అరవింద, స్రవంతి, సుధీర్‌రెడ్డి, ప్రశాంత్‌, సబ్‌ యూనిట్‌ ఆఫీసర్‌ వాసం నర్సింహరావు, ఎన్‌హెచ్‌ఎం ప్రోగ్రాం అధికారి మహేందర్‌, తదితరులు పాల్గొన్నారు.

కోయగూడెం పాఠశాలను పరిశీలించిన కలెక్టర్‌

ములుగు రూరల్‌: మల్లంపల్లి మండలం రామచంద్రాపురం పంచాయతీ కోయగూడెం గ్రామంలోని జిల్లా పరిషత్‌ పాఠశాలను శనివారం కలెక్టర్‌ బోర్ఖడే హేమంత్‌ సహదేవరావు పరిశీలించారు. జిల్లా పరిషత్‌ పాఠశాల తరలించే ప్రతిపాదన దృష్ట్యా గురుకుల విద్యార్థులకు హాస్టల్‌ వసతి, అదనపు తరగతి గదులు, ఇతర మౌలిక సదపాయాలకు సంబంధించిన అంచనాలను సిద్ధం చేయాలని సంబందిత శాఖ అధికారులను ఆదేశించారు. గ్రంథాలయ సంస్థ చైర్మన్‌ బానోత్‌ రవి చందర్‌, విద్యాశాఖ అధికారి సిద్దార్ధ రెడ్డి, సోషల్‌ వెల్ఫేర్‌ డీసీఓ వెంకటేశ్వర్లు, డీఈ రామకృష్ణ తదితరులు ఉన్నారు.

ములుగు ఆర్డీఓగా నిర్మల

ములుగు: ములుగు ఆర్డీఓగా ఎన్‌.నిర్మలను నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. హైదారాబాద్‌లోని ఎంసీఆర్‌హెచ్‌ఆర్‌డీలో అడ్మినిస్ట్రేటివ్‌ ఆఫీసర్‌గా పనిచేస్తున్న నిర్మలను శుక్రవారం హనుమకొండ ఆర్డీఓగా నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసినప్పటికీ శనివారం ములుగు ఆర్డీఓగా నియమిస్తూ మళ్లీ ఉత్తర్వులు జారీ చేసింది. ములుగు ఆర్డీఓగా పనిచేస్తున్న వెంకటేష్‌ను హనుమకొండ ఆర్డీఓగా ప్రభుత్వం బదిలీ చేసింది.

27 నుంచి టీజీ పాలిసెట్‌ కౌన్సెలింగ్‌

రామన్నపేట: ప్రభుత్వ, ప్రైవేట్‌ పాలిటెక్నిక్‌ కళాశాలల్లో ప్రవేశాల కోసం ఈనెల 27 నుంచి ఫస్ట్‌ ఫేజ్‌ కౌన్సెలింగ్‌ నిర్వహించనున్నట్లు వరంగల్‌ ప్రభుత్వ పాలిటెక్నిక్‌ కళాశాల ప్రిన్సిపాల్‌, టీజీ పాలిసెట్‌ హెల్ప్‌లైన్‌ సెంటర్‌ క్యాంపు ఆఫీసర్‌ పి.శ్రీనివాస్‌ ఒక ప్రకటనలో తెలిపారు. ఈ కౌన్సెలింగ్‌తో విద్యార్థులు సివిల్‌, ఎలక్ట్రికల్‌, మెకానికల్‌, ఎలక్ట్రానిక్స్‌, కంప్యూటర్‌ ఇంజనీరింగ్‌, మైనింగ్‌, కెమికల్‌, తదితర డిప్లొమా కోర్సులలో ప్రవేశం పొందవచ్చని పేర్కొన్నారు. పాలిసెట్‌ రాసిన ప్రతీ విద్యార్థి కౌన్సెలింగ్‌లో పాల్గొని మెరిట్‌ ఆధారంగా సీట్లు పొందవచ్చన్నారు. వివరాలకు http://tgpolycet.nic.in సందర్శించాలని ప్రిన్సిపాల్‌ సూచించారు.

Advertisement
 
Advertisement
Advertisement