కేయూ క్యాంపస్: ఉమ్మడి జిల్లాలో ఆదివారం జరగనున్న యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ ప్రిలిమినరీ పరీక్ష –2026కు అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. హనుమకొండలోని యూనివర్సిటీ ఆర్ట్స్‌అండ్ సైన్స్‌కళాశాలలో రెండు పరీక్ష కేంద్రాలను ఏర్పాటుచేయగా శనివారం కలెక్టర్ చాహత్ బాజ్‌పాయ్ సందర్శించారు. తాగునీరు, విద్యుత్, మరుగుదొడ్లు తదితర సదుపాయాలు ఎలా ఉన్నాయో పరిశీలించారు. ప్రిన్సిపాల్ ఎస్.జ్యోతితో మాట్లాడి అడిగి తెలుసుకున్నారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ సివిల్స్ పరీక్ష రెండు సెషన్‌లలో జరుగుతుందని తెలిపారు. మొదటిసెషన్ ఉదయం 9–30నుంచి 11–30గంటల వరకు, రెండో సెషన్ మధ్యాహ్నం 2–30నుంచి సాయంత్రం 4–30గంటల వరకు ఉంటుందన్నారు. జిల్లాలో మొత్తంగా పది సెంటర్లు ఏర్పాటు చేశామని, 4,075మంది అభ్యర్థులు పరీక్ష రాయనున్నట్లు చెప్పారు.
నిమిషం నిబంధన..
అభ్యర్థులు పరీక్ష ప్రారంభానికి గంటముందే కేంద్రాలకు చేరుకోవాల్సింటుంది. నిర్ధేశించిన సమయానికి అర్ధగంట ముందే కేంద్రాల గేట్ల మూసివేస్తారు. నిమిషం ఆలస్యమైనా కేంద్రాల్లోనికి అనుమతి ఉండబోదని కలెక్టర్ చాహత్ బాజ్‌పాయ్ స్పష్టం చేశారు. అభ్యర్థులు పరీక్షకేంద్రాలకు మొబైల్ ఫోన్‌లు, స్మార్ట్‌వాచ్‌లు, ఎలాంటి ఎలక్ట్రానిక్ పరికరాలు తీసుకురావొద్దని సూచించారు. హాల్‌టికెట్‌తోపాటు ప్రభుత్వం జారీచేసిన ఫొటోగుర్తింపు కార్డును తప్పనిసరిగా తీసుకురావాల్సింటుంది. కేంద్రాలవద్ద అభ్యర్థులను క్షుణ్ణంగా తనిఖీ చేశాకే లోనికి అనుమతించాలని అధికారులను ఆదేశించారు. ఆమెవెంట యూపీఎస్‌సీ కేంద్ర తనిఖీ అధికారి శుభంగాద్, ఆర్ట్స్ కాలేజీ వైస్ ప్రిన్సిపాల్ రెహమాన్, తహసీల్దార్ రవీందర్‌రెడ్డి, రూట్ అధికారి భావ్‌సింగ్ ఉన్నారు.
పరీక్ష కేంద్రాలు ఇవే..
హనుమకొండలోని ఆర్ట్స్ అండ్ సైన్స్‌కాలేజీలో రెండు సెంటర్లు, ఫాతిమానగర్‌లోని సేయింట్ గాబ్రియల్ హైస్కూల్, హంటర్‌రోడ్డులోని న్యూసైన్స్ కళాశాల, అడ్వకేట్స్ కాలనీలోని ఎస్‌ఆర్ నేషనల్ హైస్కూల్, వడ్డెపల్లిలోని ప్రభుత్వ పింగిళి మహిళా డిగ్రీ కళాశాల, ములుగు రోడ్డులోని శ్రీగాయత్రి డిగ్రీ అండ్ పీజీ కళాశాల, వరంగల్‌లోని ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల, ఎల్‌బీ కళాశాల, హనుమకొండ అశోక్ జంక్షన్‌లోని ప్రభుత్వ జూని యర్ కళాశాలలో సెంటర్లు ఏర్పాటు చేశారు. ఆయా కేంద్రాల వ ద్ద పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాటుచేశారు.
నేడు యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ ప్రిలిమినరీ పరీక్ష
పది పరీక్ష కేంద్రాలు.. 4,075 మంది అభ్యర్థులు
పకడ్బందీ ఏర్పాట్లు చేసిన అధికారులు
ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజీ కేంద్రాన్ని సందర్శించిన కలెక్టర్
పరీక్ష కేంద్రాల వద్ద నిషేధాజ్ఞలు : సీపీ
వరంగల్ క్రైం: ఆదివారం నిర్వహించనున్న యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ ప్రిలిమినరీ పరీక్ష కేంద్రాల వద్ద నిషేధాజ్ఞలు అమలు చేస్తునట్లు వరంగల్ పోలీస్ కమిషనర్ సన్‌ప్రీత్ సింగ్ తెలిపారు. సెంటర్లనుంచి 500మీటర్ల పరిధిలో ఆదివారం ఉదయం 6 నుంచి సాయంత్రం 6 గంటల వరకు సెక్షన్ 163 బీఎన్‌ఎన్‌ఎస్ చట్టాన్ని అనుసరించి గుమిగూడడం, ర్యాలీలు, సభలు, సమావేశాలు నిర్వహించడం నిషేధమని, ఎవరైనా అతిక్రమిస్తే చట్టపరమైన చర్యలు తప్పవని పేర్కొన్నారు.


