● భూ పరిపాలన ప్రధాన కమిషనర్ డీఎస్.లోకేష్‌కుమార్
ములుగు: భూముల మార్కెట్ విలువ సవరణ ప్రక్రియను వేగవంతంగా పూర్తి చేయాలని భూ పరిపాలన ప్రధాన కమిషనర్ డీఎస్.లోకేష్‌కుమార్ తెలిపారు. శనివారం హైదరాబాద్ నుంచి భూ పరిపాలన ప్రధాన కమిషనర్ డీఎస్.లోకేష్‌కుమార్ అన్ని జిల్లాల కలెక్టర్లు, అదనపు కలెక్టర్లలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించగా ములుగు జిల్లా నుంచి కలెక్టర్ బోర్ఖడే హేమంత్ సహదేవరావు, అదనపు కలెక్టర్ మహేందర్ జీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా లోకేష్‌కుమార్ మాట్లాడుతూ మార్కెట్ డిమాండ్, వాస్తవ పరిస్థితులకు అనుగుణంగా మే 28 నాటికి సవరణ పూర్తి చేయాలని ఆదేశించారు. జిల్లాలో భూముల మార్కెట్ విలువ సవరణ ప్రక్రియను పారదర్శకంగా, గడువులోగా పూర్తి చేస్తామని కలెక్టర్ తెలిపారు. వీసీలో డిప్యూటీ తహసీల్దార్ చంద్రశేఖర్, అధికారులు పాల్గొన్నారు.
ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో..
ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా జిల్లాకు చెందిన 25 మంది యువతీయువకులకు కలెక్టర్ బోర్ఖడే హేమంత్ సహదేవరావు ఉద్యోగ నియామక పత్రాలు శనివారం అందించారు. ఈనెల 8న వరంగల్ వేదికగా జరిగిన మెగా జాబ్ మేళాలో వివిధ ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగాలకు ఎంపికై న అభ్యర్థులకు తన చాంబర్‌లో ఆర్డర్ కాపీలను అందజేసి అభినందించారు. త్వరలోనే జిల్లాలో కూడా మెగా జాబ్ మేళాను నిర్వహించడానికి యంత్రాంగం సిద్ధంగా ఉందన్నారు. కార్యక్రమంలో జిల్లా యువజన క్రీడల అధికారి బి.రామ్మోహన్, టాస్క్ మేనేజర్ మురళీకృష్ణ, అధికారులు పాల్గొన్నారు.
పర్యాటకులకు మెరుగైన సౌకర్యాలు
వాజేడు: జిల్లాకు వచ్చే పర్యాటకులకు ఆహ్లాదకర వాతావరణంతో పాటు మెరుగైన సౌకర్యాలను కల్పించాలని కలెక్టర్ బోర్ఖడే హేమంత్ సహదేవరావు అన్నారు. వాజేడు మండల పరిధిలోని బొగత జలపాతాన్ని శనివారం సందర్శించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ పర్యాటక సీజన్‌ను దృష్టిలో ఉంచుకొని తాగు నీరు, మరుగుదొడ్లు, వాహనాల పార్కింగ్, సీసీ కెమెరాల ఏర్పాటు, సైన్ బోర్డులతో పాటు పటిష్ట భద్రత ఏర్పాటు చేయాలని సూచించారు.


