భూపాలపల్లి అర్బన్: కాళేశ్వరం పుష్కరాల సందర్భంగా గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చిన ఎడ్లబండ్లు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి. పుష్కర క్షేత్రానికి చేరుకునేందుకు భక్తులను ఎడ్లబండ్లలో తరలిస్తూ పలువురు రైతులు, బండి యజమానులు ఉపాధి పొందుతున్నారు. కుటుంబ సభ్యులతో కలిసి భక్తులను ఎడ్లబండ్లలో తీసుకెళ్తూ గ్రామీణ జీవనశైలిని ప్రతిబింభిస్తున్నారు. ఆధునిక వాహనాల మధ్య సంప్రదాయ ఎడ్లబండ్ల ప్రయాణం భక్తులను ఆకట్టుకుంటోంది. ఎడ్లబండ్ల ద్వారా రవాణా సేవలు అందిస్తూ కొంతమంది కుటుంబాలు రోజువారీ ఆదాయం పొందుతున్నాయి. పార్కింగ్ పాయింట్ల నుంచి గోదావరి వరకు ఒక్కరికీ రూ.50 చొప్పున చార్జీలు తీసుకుంటున్నారు.


