ములుగు: మున్సిపాలిటీ పారిశుద్ధ్య కార్మికుడు సాంబయ్య ఇటీవల వడదెబ్బతో మృతిచెందాడు. దీంతో బాధిత కుటుంబాన్ని మాజీ జెడ్పీ చైర్‌పర్సన్ బడే నాగజ్యోతి శనివారం పరామర్శించి ఆర్థికసాయం అందించారు. వడదెబ్బతో మృతిచెందిన సాంబయ్య కుటుంబానికి ప్రభుత్వం వెంటనే రూ.4లక్షల ఎక్స్‌గ్రేషియా చెల్లించాలని కోరారు. ఈ కార్యక్రమంలో బీఆర్‌ఎస్ నాయకులు భిక్షపతి, రమేష్‌రెడ్డి, చంద్రమౌళి, వెంకన్న, సాగర్, ఓదేలు, కుమార్, రామ్మూర్తి తదితరులు పాల్గొన్నారు.
ఏటూరునాగారం: మండల కేంద్రంలోని 7వ వార్డులోని రామన్నగూడెం వెళ్లే దారిలోని పెట్రోల్ బంక్ సమీపంలో ఓ చెట్టుకు నిప్పు అంటుకుంది. వార్డు సభ్యుడు మాదరి మధుకు సమాచారం అందడంతో జీపీ సిబ్బంది, ఫైర్ ఇంజన్ సిబ్బంది, స్థానిక ఎస్సై మహేష్‌తో కలిసి చెట్టుకు అంటుకున్న నిప్పును చల్లార్చారు. జేసీబీతో చెట్టును కింద పడేశారు. పక్కనే పెట్రోల్‌బంక్, రహదారి వెంట వాహనా లకు పెను ప్రమాదం తప్పింది. ఉప సర్పంచ్‌పర్వతాల ఎల్లయ్య, 15వ వార్డు సభ్యుడు నాగవత్ కిరణ్, రామన్నగూడెం సర్పంచ్ నవీన్ పాల్గొన్నారు.
మొగుళ్లపల్లి: మండలంలోని ఎల్లారెడ్డిపల్లిలో వనపర్తి మొండయ్య, కదుర్ల కొమురయ్య, మేకల రాజ్ కుమార్, నైనాకంటి కృష్ణారెడ్డి చెందిన సుమారు 100 క్వింటాళ్ల మొక్కజొన్నలు శనివారం దగ్ధమయ్యాయి. దీంతో ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు ఎల్లారెడ్డిపల్లికి చేరుకుని అగ్ని ప్రమాదం జరిగిన ప్రాంతాన్ని పరిశీలించి బాధిత రైతులను పరామర్శించారు. ఘటనకు సంబంధించిన వివరాలను రైతులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రైతులు పంట అవశేషాలు, వరి కొయ్యలకు నిర్లక్ష్యంగా నిప్పంటించరాదని సూచించారు. వేసవి కాలంలో చిన్న అజాగ్రత్త కూడా భారీ అగ్ని ప్రమాదాలకు దారితీస్తుందని, రైతులు అప్రమత్తంగా ఉండి తమ పంటలను కాపాడుకోవాలని తెలిపారు. అధికారులు, స్థానిక ప్రజా ప్రతినిధులు, నాయకులు ఉన్నారు.
మల్హర్(కాటారం): మండలంలోని కాటారం ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో పాలీసెట్ హెల్ప్‌లైన్ సెంటర్ ఏర్పాటు చేసినట్లు ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల ప్రిన్సిపాల్ డా.రాజ్ కుమార్ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. విద్యార్థులు దూర ప్రాంతాలైన వరంగల్ భూపాలపల్లి, కరీంనగర్ వెళ్లకుండా విద్యార్థుల సౌలభ్యం కోసం ఇక్కడే సహాయక కేంద్రం ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. విద్యార్థులు ఈ సదవకాశం వినియోగించు కోవాలని ప్రిన్సిపాల్ కోరారు. పాలీసెట్ షెడ్యూల్ తొలి విడత కౌన్సిలింగ్లో ధ్రువపత్రాల పరిశీలన ఈనెల29 నుంచి ప్రారంభం అవుతుందని తెలిపారు.


