భూపాలపల్లి అర్బన్: కాళేశ్వరం త్రివేణి సంగమం పుష్కరాల సందర్భంగా అపార భక్తజన సందోహంతో కళకళలాడుతోంది. సరస్వతి పుష్కరాల పుణ్యకాలంలో పితృదేవతలకు పిండ ప్రదానాలు, తర్పణాలు చేయడానికి తెలంగాణతో పాటు ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్ తదితర రాష్ట్రాల నుంచి భక్తులు తరలివస్తున్నారు. తెల్లవారుజాము నుంచే భక్తులు పవిత్ర త్రివేణి సంగమంలో పుణ్యస్నానాలు ఆచరించి, అనంతరం వేద పండితుల ఆధ్వర్యంలో పిండ ప్రదాన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. త్రివేణి సంగమ ప్రాంతమంతా వేద మంత్రోచ్ఛారణలు, గోవింద నామస్మరణలు, హరినామ సంకీర్తనలతో మారుమోగుతూ భక్తిమయ వాతావరణాన్ని సంతరించుకుంది. ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన పూజా మండపాల్లో కుటుంబ సభ్యులతో కలిసి భక్తులు పితృకార్యాలు నిర్వహిస్తూ ఆధ్యాత్మిక ఆనందాన్ని పొందుతున్నారు. పుష్కర సమయంలో పిండ ప్రదానాలు చేయడం ద్వారా పితృదేవతల ఆశీస్సులు లభిస్తాయని, కుటుంబానికి శాంతి, సౌభాగ్యాలు కలుగుతాయని భక్తులు విశ్వసిస్తున్నారు. పుష్కరాల సందర్భంగా వివిధ ప్రాంతాల్లో పండితులు 500పైగా తరలివచ్చారు. పండితులు పితృకార్యాలు చేయడంతో పాటు పుష్కర స్ధానాలు చేసిన వారికి గోదావరి ప్రత్యేక పూజలు చేస్తున్నారు. దీంతో వారికి కొంత మేర ఉపాధి దొరుకుంతుంది. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని జిల్లా యంత్రాంగం విసృత ఏర్పాట్లు చేసింది. ఘాట్‌ల వద్ద తాత్కాలిక షెడ్లు, విశ్రాంతి కేంద్రాలు, తాగునీటి సదుపాయాలు, మొబైల్ టాయిలెట్లు ఏర్పాటు చేశారు.


