కాంగ్రెస్‌ ఎస్సీ విభాగానికి కొత్త సారథులు.. | - | Sakshi
Sakshi News home page

కాంగ్రెస్‌ ఎస్సీ విభాగానికి కొత్త సారథులు..

May 23 2026 1:52 AM | Updated on May 23 2026 1:52 AM

సాక్షిప్రతినిధి, వరంగల్‌ : కాంగ్రెస్‌ పార్టీ ఎస్సీ విభాగాన్ని గ్రామస్థాయి నుంచి మరింత బలోపేతం చేయాలనే లక్ష్యంతో అధిష్టానం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు టీపీసీసీ ఆధ్వర్యంలో ఎస్సీ విభాగాన్ని మరింత చురుకుగా మార్చేందుకు ఉమ్మడి వరంగల్‌ జిల్లాల పరిధిలోని ఐదు జిల్లాలకు కొత్త చైర్మన్లను నియమిస్తూ శుక్రవారం అధికారిక ఉత్తర్వులు జారీ చేశారు.

ఐదు జిల్లాల చైర్మన్లు వీరే....

కాంగ్రెస్‌ పార్టీ ఎస్సీ విభాగం హనుమకొండ జిల్లా చైర్మన్‌గా ఆరూరి సాంబయ్య, వరంగల్‌ జిల్లాకు చిలువేరు శ్రీనివాస్‌, జనగామకు చేపూరి వినోద్‌, మహబూబాబాద్‌కు తిప్పర్తి శ్రీధర్‌, ములుగు జిల్లాకు మట్టెవాడ తిరుపతిలను నియమించారు. జాబితాలో జయశంకర్‌ భూపాలపల్లి జిల్లాకు నియమించకపోవడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. కాగా కాంగ్రెస్‌ ఎస్సీ విభాగంలో చేపట్టిన ఈ మార్పులు రాబోయే రోజుల్లో పార్టీ క్షేత్రస్థాయి రాజకీయాలకు ఎంతవరకు బలం చేకూరుస్తాయో?నన్న చర్చ మొదలైంది.

శిక్షణ తరగతులను సద్వినియోగం చేసుకోవాలి

ఏటూరునాగారం: భారత విద్యార్థి ఫెడరేషన్‌ (ఎస్‌ఎఫ్‌ఐ) తెలంగాణ రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో రాష్ట్ర స్థాయి విద్యా, వైజ్ఞానిక, రాజకీయ శిక్షణ తరగతులను ఈనెల 24 నుంచి జూన్‌ 3వ తేదీ వరకు మండల కేంద్రంలో నిర్వహించనున్నట్లు ఎస్‌ఎఫ్‌ఐ ములుగు జిల్లా అధ్యక్షుడు జాగటి రవితేజ శుక్రవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఎస్‌ఎఫ్‌ఐ విద్యారంగ ప్రతిష్ట కోసం ప్రత్యేక పోరాటాలను చేస్తోందన్నారు. చదువుకునే విద్యార్థులు ప్రశ్నించే తత్వాన్ని అలవర్చుకోవాలన్నారు. ఈ శిక్షణ తరగతులతో ప్రభుత్వాలు విద్యార్థులకు చేస్తున్న నష్టం, మనం ఎలాంటి హక్కులను పొందామనేది తెలుసుకోవచ్చన్నారు. ప్రతీ విద్యార్థి ఈ శిక్షణ తరగతులకు తరలిరావాలని కోరారు.

చేపల చెరువుపై హక్కు కల్పించాలి

ఏటూరునాగారం: గిరిజనులకు చేపల చెరువులపై హక్కు కల్పించాలని ఆదివాసీ హక్కుల పోరాట సమితి తుడుందెబ్బ రాష్ట్ర కార్యదర్శి కోరగట్ల లక్ష్మణ్‌రావు అన్నారు. శుక్రవారం మండలకేంద్రంలోని తహసీల్దార్‌ జగదీష్‌కు పలు డిమాండ్లతో కూడిన వినతి పత్రం అందించారు. మండలంలోని షాపెల్లి పెద్ద చెరువులో పెసా గ్రామ సభల ద్వారా తీర్మానం చేసిన సభ్యులకు చేపలు పట్టుకునే అవకాశం కల్పించాలన్నారు. కార్యక్రమంలో తుడుందెబ్బ మండలాల అధ్యక్షులు యాలం దేవేందర్‌, మోకాళ్ళ వెంకటేశ్వర్లు, తుర్స చంటి దొర, గుండ్ల పాపారావు తదితరులు పాల్గొన్నారు.

విజయేంద్ర సరస్వతి

ప్రత్యేక పూజలు

గణపురం: గణపురం మండలం చెల్పూరు కాకతీయ థర్మల్‌ విద్యుత్‌కేంద్రంలోని శ్రీ రామలింగేశ్వర ఆలయాన్ని కంచి కామకోటి 70వ పీఠాధిపతి జగద్గురు శ్రీశ్రీశ్రీ విజయేంద్ర సరస్వతి స్వామి శుక్రవారం సందర్శించారు. కాళేశ్వరంలో సరస్వతి నది అంత్య పుష్కరాలను ప్రారంభించిన అనంతరం ఆయన తిరుగు ప్రయాణంలో కేటీపీపీకి వచ్చారు. కేటీపీపీ సీఈ, ఆలయ చైర్మన్‌ శ్రీ ప్రకాశ్‌ దంపతుల ప్రత్యేక ఆహ్వానం మేరకు ఆలయానికి విచ్చేశారు. ఆలయ ప్రాంగణానికి చేరుకున్న జగద్గురులకు సీఈ దంపతులు, ఆలయ అర్చకులు, ప్రాజెక్టు అధికారులు పూర్ణకుంభంతో మంగళవాయిద్యాల నడుమ భక్తిశ్రద్ధలతో ఘనస్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆలయంలో కొలువై ఉన్న శ్రీ రామలింగేశ్వరస్వామి వారికి కంచి పీఠాధిపతి ప్రత్యేక అభిషేకాలు, పూజలు నిర్వహించారు. దేవతామూర్తులను దర్శించుకొని పూజలు నిర్వహించారు. జగద్గురు ఆలయానికి వచ్చారన్న విషయం తెలుసుకున్న ఉద్యోగుల కుటుంబాలు పెద్దఎత్తున స్వామి వారి దర్శనానికి తరలి వచ్చాయి.

Advertisement
 
Advertisement
Advertisement