ములుగు: జిల్లాలో రైతుల పరిస్థితి దారుణంగా మారిందని, పండించిన పంటను అమ్ముకోలేని పరిస్థితుల్లో అన్నదాతలు ఉండడం కాంగ్రెస్ ప్రభుత్వం వైఫల్యానికి నిదర్శనమని రాష్ట్ర రెడ్ కో మాజీ చైర్మన్ ఏరువ సతీష్ రెడ్డి అన్నారు. శుక్రవారం బీఆర్‌ఎస్ నాయకులతో కలిసి కలెక్టరేట్ ఎదుట నిరసన వ్యక్తం చేసిన అనంతరం అదనపు కలెక్టర్ మహేందర్‌జీకి రైతుల ఇబ్బందులను తీర్చాలని కోరుతూ వినతిపత్రం అందించారు. ఈ సందర్భంగా సతీష్‌రెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వం రైతులకు పెట్టుబడి సాయాన్ని సరిగా అందించకున్నా.. రైతులు అప్పులు చేసి పెట్టుబడులు పెట్టారన్నారు. ప్రభుత్వం రైతులకు అండగా నిలబడాల్సి ఉండగా కొనుగోలు కేంద్రాల వద్ద తరుగు పేరుతో 10 కిలోల వరకు కటింగ్‌లు పెడుతూ ఇబ్బందులకు గురిచేస్తుందని ఆరోపించారు. కష్టపడి పండించిన పంటలను అమ్ముకోలేక రైతులు నిద్రలేని రాత్రులు గడుపుతున్నారని, నిస్సహాయ స్థితిలో ఉన్న రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో బీఆర్‌ఎస్ నాయకులు భూక్య జంపన్న, మల్క రమేష్, సానికొమ్ము రమేష్‌రెడ్డి, లింగాల రమణారెడ్డి, భిక్షపతి, జగదీష్, వెంకన్న తదితరులు పాల్గొన్నారు.
రెడ్ కో మాజీ చైర్మన్ సతీష్‌రెడ్డి
కలెక్టరేట్ ఎదుట నిరసన


