ములుగు: జిల్లా నుంచి అంతర్జాతీయ స్థాయి క్రీడాకారులుగా ఎదగాలని కలెక్టర్ బోర్ఖడే హేమంత్ సహదేవరావు పిలుపునిచ్చారు. జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాల ఆవరణలో గురువారం జిల్లా యువజన క్రీడల శాఖ ఆధ్వర్యంలో జిల్లా స్థాయి ‘ప్లే పార్టిసిపేట్, స్పోర్ట్స్ డే, ఆడండి – పాల్గొనండి’ అనే థీమ్‌తో ఘనంగా కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కలెక్టర్ ముఖ్య అతిథిగా హాజరై పోటీలను ప్రారంభించారు. అనంతరం 2026 సీఎం కప్ పోటీలలో ప్రతిభ కనబర్చి పతకాలు సాధించిన క్రీడాకారులను, విద్యార్థులను కలెక్టర్ అభినందించి ప్రశంస పత్రాలు, పతకాలు అందజేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ క్రీడలు యువతలో క్రమశిక్షణ, నాయకత్వ లక్షణాలను పెంపొందిస్తాయని పేర్కొన్నారు. యువత క్రీడలను జీవితంలో భాగం చేసుకోవాలన్నారు. నిరంతర సాధనతో ఉన్నత లక్ష్యాలను సాధించవచ్చని, విద్యతో పాటు క్రీడలకు సమాన ప్రాధాన్యత ఇవ్వాలని పేర్కొన్నారు. అనంతరం విజేతలకు జిల్లా యువజన క్రీడల అధికారి బి.రామ్మోహన్, డీఈఓ సిద్ధార్థ రెడ్డి క్రీడాకారులకు పతకాలు, ప్రశంస పత్రాలు అందజేసి సన్మానించారు. అనంతరం కలెక్టర్ నేడు జిల్లా కేంద్రంలోని లీలా గార్డెన్ ఫంక్షన్‌హాల్ నిర్వహించనున్న ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమం ఏర్పాట్లను పరిశీలించారు. అలాగే కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్‌లో హలో ఫ్లుయెన్సర్లు రీల్స్ కాంపిటీషన్‌పై ప్రత్యేక సమావేశం నిర్వహించారు. రీల్స్‌తో జిల్లా పర్యాటక అందాలను విశ్వవ్యాప్తం చేయాలని, లోకల్ టు గ్లోబల్‌గా జిల్లా ఘన కీర్తిని ప్రపంచానికి పరిచయం చేయాలని సూచించారు. జిల్లా టూరిజాన్ని ప్రపంచానికి పరిచయం చేసేందుకు నిర్వహిస్తున్న ఈ కాంపిటీషన్ ఫ్లుయెన్సర్లు, మీడియా ప్రతినిధులు, సోషల్ మీడియా ప్రతినిధులతో కలెక్టర్ ముఖాముఖిగా చర్చించారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలోని పర్యాటక ప్రాంతాలకు బ్రాండింగ్ కలిగించేలా కాంపిటీషన్ నిర్వహిస్తున్నట్లు స్పష్టం చేశారు.పర్యాటక ప్రాంతాలపై 4కె వీడియో క్వాలిటీతో రీల్స్ సమర్పించాలని, ఆసక్తి గలవారు తమ వీడియోలను మే 30వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు జిల్లా పౌర సంబంధాల శాఖ కార్యాలయంలో సమర్పించవచ్చని వివరించారు. ఆన్‌లైన్ విధానంలో డీపీఆర్‌ఓ రఫీక్ సెల్ 99483 92976, ఏపీఆర్‌ఓ వేణు 9494970535 నంబర్లకు వాట్సాప్ ద్వారా పంపించవచ్చని పేర్కొన్నారు.
కలెక్టర్ బోర్ఖడే హేమంత్ సహదేవరావు


