ములుగు: జనగణన ప్రక్రియను సమర్థవంతంగా నిర్వహించాలని రాష్ట్ర జనగణన డైరెక్టర్ భారతి హోళికేరి తెలిపారు. ఈ మేరకు ఆమె హైదరాబాద్ నుంచి జనగణనపై అన్ని జిల్లాల కలెక్టర్లతో గురువారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. జిల్లా నుంచి కలెక్టర్ బోర్ఖడే హేమంత్ సహదేవరావు, అదనపు కలెక్టర్ మహేందర్‌జీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రాష్ట్రంలో ప్రస్తుతం కొనసాగుతున్న సెన్సస్–2027 ఫేజ్–1 కార్యక్రమాల అమలు, ప్రగతి, ఫీల్డ్ స్థాయిలో చేపడుతున్న చర్యలపై సమావేశంలో అధికారులతో సమీక్షించారు. జనగణన కార్యక్రమాలను వేగంగా పూర్తి చేయడానికి తీసుకోవాల్సిన చర్యలపై అధికారులకు వెల్లడించారు. ఈ సమావేశంలో సీపీఓ ప్రకాశ్, మున్సిపల్ కమిషనర్ సంపత్, జనాభా లెక్కల సూపరింటెండెంట్ మంజుల, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.
ఏఐ లైఫ్ స్కిల్స్‌పై
ఉచిత శిక్షణ
మహబూబాబాద్ అర్బన్: ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) లైఫ్ స్కిల్స్‌పై నాలుగు రోజుల పాటు ఇంటర్ ఉత్తీర్ణత సాధించిన విద్యార్థులతో పాటు డిగ్రీ ఆపైన చదివిన బీసీ విద్యార్థులకు ఉచిత శిక్షణ ఇవ్వనున్నట్లు ఉమ్మడి వరంగల్ జిల్లా బీసీ స్టడీ సర్కిల్ ఇన్‌చార్జ్ డైరెక్టర్ మాడిశెట్టి నరసింహస్వామి గురువారం ఒక ప్రకనటలో పేర్కొన్నారు. నూతన సాంకేతికతను ప్రజలకు అందించడమే లక్ష్యంగా మ్యాజిక్ బస ఇండియా ఫౌండేషన్ అనే సంస్థ అనుసంధానంతో జూన్ 1నుంచి 4వ తేదీ వరకు ఉచిత శిక్షణ ఇస్తామని తెలిపారు. 18 నుంచి 30 సంవత్సరాల మధ్య వయస్సు గల యువతీ, యువకులు హనుమకొండలోని బీసీ స్టడీ సర్కిల్‌లో ఈ నెల 30వ తేదీ వరకు హాజరై దరఖాస్తు చేసుకోవాలన్నారు. పూర్తి వివరాలకు 0870– 2571192 ఫోన్ నంబర్‌లో సంప్రదించాలన్నారు.
15 కిలోమీటర్లు కాలినడకన..
● గుట్టలపైకి చేరుకుని ఇళ్లగణన
వాజేడు: ప్రభుత్వం చేపట్టిన ఇళ్ల గణన భాగంగా ఎన్యుమరేటర్ రాంబాబు, సూపర్ వైజర్ శ్రీకాంత్ గురువారం 15 కిలో మీటర్లు కాలినడకన.. గుట్టలపైకి చేరుకుని ఇళ్ల గణన చేపట్టారు. వివరాల్లోకి వెళ్తే.. మండల పరిధిలోని కొంగాల గ్రామ పంచాయతీలోని పెనుగోలు గ్రామం గుట్టలపై ఉంది. అక్కడికి కాలినడకన 15కిలో మీటర్లు నడిచివెళ్లారు. అక్కడ ఉన్న ఇళ్ల గణన చేపట్టి శుక్రవారం తిరిగి రానున్నారు.


