జిల్లాలోని భూగర్భ జలాల వివరాలు(మీటర్ల లోతుల్లో..)
రిజర్వాయర్లు నిర్మించాలి
రెండు ప్రాజెక్టుల ద్వారా నీటిని ఇవ్వాలి
తలాపునే గోదావరి..
● జిల్లా ప్రజలకు తప్పని నీటి కష్టాలు
● బ్యారేజీలతో జిల్లాకు ఫలితం శూన్యం
ఏటూరునాగారం: జిల్లాలో గోదావరి 110 కిలోమీటర్ల మేర ప్రవహిస్తోంది. అయినా ఎండాకాలం వచ్చిందంటే భూ గర్భజలాలు రోజురోజుకూ పడిపోతున్నాయి. దీంతో ప్రజలు నీటి కోసం అష్టకష్టాలు పడుతున్నారు. తలాపునే గోదావరి ఉన్నా జిల్లా ప్రజలు చుక్కనీరు వినియోగించుకునే అవకాశం లేకపోవడంతో ఇబ్బందులు పడుతున్నారు. చేతి పంపులు వేయించుకుని దాహార్తిని తీర్చుకుంటున్న పరిస్థితులు ఉన్నాయి. మంత్రులు, ఎమ్మెల్యేలు జిల్లాకు గోదావరి జలాలు అందించి సస్యశ్యామలం చేయాల్సిన పాలకులు మిన్నకుండిపోతుండడంతో ప్రజలు అసహనం వ్యక్తం చేస్తున్నారు.
ములుగులో 14.82 మీటర్ల లోతుల్లో..
జిల్లా కేంద్రంలో 14.82 మీటర్ల లోతుల్లోకి భూగర్భ జలాలు పడిపోయాయి. అలాగే వెంకటాపురం(ఎం)లో అత్యధిక పైస్థాయిలోనే నీటి నిల్వలు ఉన్నట్లు ఇరిగేషన్ శాఖ, భూగర్భజలాల శాఖ అధికారులు గుర్తించారు. సమీప గోదావరిలో సైతం రైతులు నీటి కోసం బోర్లను దింపుకొని అవసరాలను తీర్చుకుంటున్నారు. జిల్లా ప్రజల నీటి సమస్య పరిష్కారం కావాలంటే సమ్మక్క బ్యారేజ్, దేవాదుల ఎత్తిపోతల పథకం కింద జిల్లాలోని చెరువులు, సరస్సులు నీటితో నింపాలని ప్రజలు, రైతులు కోరుతున్నారు. ఈ విషయంలో 2016లో అప్పటి కలెక్టర్ ఆకునూరి మురళి సమ్మక్క బ్యారేజ్‌కు గ్రావిటి కాల్వలు తవ్వించి రైతులు, ప్రజలకు నీటి సౌకర్యం కల్పించాలని అప్పటి ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపారు. కానీ అవి ఆచరణలోకి రాలేదు.
ఇతర ప్రాంతాలకు నీటి తరలింపు
జిల్లాలోని దేవాదుల, తుపాకులగూడెం బ్యారేజీల పరిధిలోని నీటి లభ్యత అంతా కూడా కరీంనగర్, భూపాలపల్లితో పాటు ఇతర ప్రాంతాలకు తరలిస్తున్నారు. తుపాకుల గూడెంలో 6 టీఎంసీల నీటి నిల్వలు కేవలం దేవాదుల కోసం కేటాయించి పంపింగ్ చేసి నీటిని ఇతర ప్రాంతాలకు తరలిస్తున్నారు. కానీ ఏళ్లు గడుస్తున్నా జిల్లా ప్రజల నీటి కష్టాలు కలగానే ఉండిపోతున్నాయి. పాలకులు దృష్టి సారించి సమస్యను పరిష్కరించాలని ప్రజలు కోరుతున్నారు.
ఏటూరునాగారం 8.51
గోవిందరావుపేట 5.47
కన్నాయిగూడెం 9.75
మంగపేట 9.44
ములుగు 14.82
వెంకటాపురం(ఎం) 2.60
వెంకటాపురం(కె) 8.96
వాజేడు 11.74
ఎస్‌ఎస్‌తాడ్వాయి 8.93
దేవాదుల, తుపాకులగూడెం నీటి నిల్వలను ఉపయోగించుకునే విధంగా అనువైన ప్రదేశాల్లో రిజర్వాయర్లను నిర్మించాలి. నీటిని మళ్లించి సాగు, తాగునీటికి ఉపయోగ పడేలా చూడాలి. రిజర్వాయర్లు లేకపోవడంతోనే ఇక్కడ ఉన్న ప్రజలు సాగు, తాగునీటికి కష్టాలు పడుతున్నారు.
– సప్పిడి రాంనర్సయ్య, ఏటూరునాగారం
జిల్లాలోని రైతులు, ప్రజలకు దేవాదుల, తుపాకులగూడెం ప్రాజెక్టుల ద్వారా సాగు, తాగు నీటి సౌకర్యం కల్పించాలి. స్థానికంగా ప్రాజెక్టులు ఉన్నా ప్రజలకు గోరంత ఉపయోగపడడం లేదు. దీనిపై ప్రభుత్వాలు, అధికారులు దృష్టి సారించి స్థానిక ప్రజలకు ఉపయోగపడే విధంగా గ్రావిటి కాల్వల నిర్మాణం చేపట్టాలి.
– ఈసం రామ్మూర్తి, మాజీ సర్పంచ్, ఏటూరునాగారం


