హెరిటేజ్‌ వాక్‌ | - | Sakshi
Sakshi News home page

హెరిటేజ్‌ వాక్‌

May 21 2026 5:03 AM | Updated on May 21 2026 5:03 AM

ములుగు రూరల్‌: 99 రోజుల ప్రజాపాలన–ప్రగతి ప్రణాళిక పర్యాటక వారోత్సవాల్లో భాగంగా బుధవారం హెరిటేజ్‌ వాక్‌ను కలెక్టర్‌ బోర్ఖడే హేమంత్‌ సహదేవరావు జెండా ఊపి ప్రారంభించారు. ఈ వాక్‌ మండల పరిధిలోని జాకారం యూత్‌ ట్రైనింగ్‌ సెంటర్‌ నేషనల్‌ హైవే యూటర్న్‌ నుంచి జాకారం శివాలయం వరకు కొనసాగింది. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్‌ సంపత్‌రావు, జిల్లా పర్యాటక శాఖ అధికారి శివాజీ, పురావస్తు శాఖ అసిస్టెంట్‌ డైరెక్టర్‌ బుజ్జి, ఇరిగేషన్‌ అధికారి అప్పలనాయుడు, డీఈఓ సిద్ధార్థరెడ్డి, డీపీఓ వెంకయ్య, డీపీఆర్వో రఫిక్‌, తహసీల్దార్‌ విజయభాస్కర్‌, ఎంపీఓ రహీమ్‌, సర్పంచ్‌ దాసరి సమత తదితరులు పాల్గొన్నారు.

ఎరువుల ధరలను

తగ్గించాలని వినతి

ములుగు రూరల్‌: నాణ్యమైన విత్తనాలు, పచ్చిరొట్ట విత్తనాలు ఎరువుల ధరలు తగ్గించాలని కోరుతూ బుధవారం జిల్లా వ్యవసాయ శాఖ అధికారి సురేశ్‌కుమార్‌కు తెలంగాణ రాష్ట్ర రైతుసంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి అంజాద్‌ పాషా ఆధ్వర్యంలో వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లా పూర్తి ఏజెన్సీ ప్రాంతం కాబట్టి సకాలంలో రైతాంగానికి నాణ్యమైన విత్తనాలు అందించాలన్నారు. ప్రభుత్వం పెంచిన ఎరువుల ధరలను తగ్గించాలని కోరారు. ఈ కార్యక్రమంలో నారాయణ సింగ్‌, మంజునాయక్‌, రమేశ్‌, కొమురయ్య తదితరులు పాల్గొన్నారు.

‘ఆదివాసీల జోలికొస్తే

సహించేది లేదు’

వాజేడు: ఆదివాసీల జోలికి వస్తే సహించేది లేదని తుడుం దెబ్బ రాష్ట్ర ఉపాధ్యక్షుడు పాయం రమణ అన్నారు. మండల పరిధిలోని గుమ్మడిదొడ్డిలో బుధవారం నిర్వహించిన ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. వెంకటాపురం(కె) మండలంలో ఆదివాసీలపైన జరిగిన దాడిని తీవ్రంగా ఖండించారు. అమాయక ఆదివాసీలపై దాడులు జరుగకుండా అధికారులు చర్యలు తీసుకోవాలని సూచించారు. అలా జరగని పక్షంలో ప్రతిఘటనలు తప్పవని హెచ్చరించారు. ఈ సమావేశంలో మండల అధ్యక్షుడు తొర్రెం సంతోష్‌, ప్రధాన కార్యదర్శి చాప లక్ష్మణ్‌, వాసం సంతోష్‌, సురేశ్‌, హరికృష్ణ, నాగేంద్ర బాబు తదితరులు పాల్గొన్నారు.

మేలైన వరి వంగడాలను విత్తుకోవాలి

ఏటూరునాగారం: మేలైన వరి వంగడాలను విత్తుకోవాలని వరంగల్‌ శాస్త్రవేత్తలు శేషు, మధు తెలిపారు. మండల కేంద్రంలోని రైతు వేదికలో వరిసాగు పద్ధతులపై బుధవారం అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వ్యవసాయ యూనివర్సిటీ అభివృద్ధి చేసిన మేలైన వరి రకాలైన కేఎన్‌ఎం 1638, ఆర్‌ఎన్‌ఆర్‌ 1508, సాంబమసూరి, డబ్ల్యూజీఎల్‌ 962, డబ్ల్యూజీఎల్‌ 44, కేఎన్‌ఎం 118 వేసుకోవడం వల్ల పురుగులు, తెగుళ్లు తక్కువగా ఆశిస్తాయన్నారు. దీని ద్వారా అధిక దిగుబడులు పొందచ్చని తెలిపారు. రైతులు తమ పొలంలో పండించిన రకాలను జాగ్రత్తలు పాటించి విత్తనాలుగా రెండు, మూడు సంవత్సరాల వరకు విత్తనంగా ఉపయోగించుకోవచ్చని వివరించారు. అలాగే విత్తనాల మీద పెట్టే ఖర్చులు తగ్గించుకోవాలని సూచించారు. వరిసాగు పద్ధతుల్లో మెలకువలు పాటించాలన్నారు. పంట మార్పిడి, సేంద్రియ పద్ధతులపై రైతులు అవగాహన పెంచుకోవాలన్నారు. వరి పంట వేసుకునే ముందు ఈ నెల చివరిలో లేదా జూన్‌ మొదటి వారంలో పచ్చిరొట్ట పంటలను వేసుకొని పూత దశలో భూమిలో కలియదున్నాలన్నారు. అనంతరం మండల వ్యవసాయ అధికారి వేణుగోపాల్‌, ఆత్మ చైర్‌పర్సన్‌ అరుణ మాట్లాడుతూ యూనివర్సిటీ నుంచి విడుదలైన మేలైన వరి రకాలను సాగు చేసుకోవాలని సూచించారు. ఈ విత్తనాలు 50 శాతం సబ్సిడీ మీద లభిస్తాయని వివరించారు. శాస్త్రవేత్తలు చెప్పిన సూచనలు పాటించి అధిక దిగుబడులు సాధించాలని రైతులకు సూచించారు. ఈ కార్యక్రమంలో ఏఈలు రవి, రాజు, రైతులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement