మంగపేట : మండలంలోని గ్రామ పంచాయతీల పాలనపై సంబంధిత అధికారుల పర్యవేక్షణ కొరవడింది. మండలంలో 14 ఏళ్లుగా పంచాయతీ ఎన్నికలు నిలిచి పోయిన విషయం తెలిసిందే. దీంతో మండలంలోని 52 గ్రామ పంచాయతీలకు సర్పంచ్‌లో లేకపోవడంతో వారి స్థానంలో వివిధ శాఖలకు చెందిన అధికారులను ప్రత్యేక అధికారులుగా నియమించారు. ప్రత్యేకాధికారులు, పంచాయతీ కార్యదర్శుల పర్యవేక్షణలో పంచాయతీల పాలన కొనసాగుతోంది. దీంతో పాటు మండలంలో ఎంపీటీసీ, జెడ్పీటీసీలు కూడా లేకపోవడంతో ప్రజా సమస్యలను పట్టించుకునే వారే కరువయ్యారని ప్రజలు వాపోతున్నారు. పంచాయతీల్లో కార్యదర్శులు అందుబాటులో ఉండకుండా అలా వచ్చి ఇలా వెళ్తున్నారనే ఆరోపణలున్నాయి. 25 గ్రామ పంచాయతీల ప్రత్యేకాధికారుల పాత్ర సైతం పేరుకే అన్న చందంగా తయారైందని ప్రజలు ఆరోపిస్తున్నారు.
లక్షల్లో నిధుల దుర్వినియోగం
గ్రామ పంచాయతీల పాలన, నిధుల వినియోగంపై సంబంధిత మండల, జిల్లా స్థాయి అధికారుల పర్యవేక్షణ లేకపోవడంతో కొందరు పంచాయతీ కార్యదర్శులు నిధుల దుర్వినియోగానికి పాల్పడినట్లు విశ్వసనీయ సమాచారం. ఆయా పంచాయతీలకు జనవరి, ఫిబ్రవరిలో జనాభా ప్రతిపాదికన ఒక్కో పంచాయతీకి సుమారు రూ.2లక్షల నుంచి రూ.10 లక్షల వరకు 15వ ఆర్థిక సంఘం నిధులు ప్రభుత్వం విడుదల చేసింది. మండలంలోని నిమ్మగూడెం పంచాయతీ కార్యదర్శి రూ 7.29 లక్షల నిధుల దుర్వినియోగానికి పాల్పడటంతో ఇటీవల సస్పెండ్ చేశారు. మరికొందరు కార్యదర్శులు ఆయా పంచాయతీల ట్రాక్టర్ల రిపేరు, డీజిల్ కొనుగోలు, పారిశుద్ధ్య నిర్వాహణ ఖర్చు, వీదిలైట్ల ఏర్పాటు, సిబ్బంది దుస్తులు, చెప్పులు తదితర పనుల పేరుతో లక్షల్లో దుర్వినియోగానికి పాల్పడినట్లు తెలుస్తోంది. జిల్లా అధికారులు స్పందించి పంచాయతీ కార్యదర్శులు కార్యాలయాల్లో ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా చర్యలు తీసుకోవాలని, నిధుల వినియోగంపై ప్రత్యేక దృష్టి సారించాలని కోరుతున్నారు.
చుట్టపుచూపుగా జీపీ కార్యదర్శులు
పేరుకే ప్రత్యేకాధికారులు
పంచాయతీ నిధుల దుర్వినియోగంపై
దృష్టి సారించని అధికారులు


