గోవిందరావుపేట : మురుగు నీరు నిల్వ ఉండకుండా గ్రామంలో పారిశుద్ధ్యానికి ప్రాధాన్యత ఇస్తున్నట్లు దుంపెల్లిగూడెం సర్పంచ్ బానోత్ సీతారాం నాయక్ అన్నారు. బుధవారం గ్రామంలో డ్రెయినేజీలో మట్టి కూరుకుపోవడంతో సీతారాం నాయక్ ఆధ్వర్యంలో గ్రామ పంచాయితీ సిబ్బందితో పూడికతీత పనులు నిర్వహించారు.ఈ సందర్భంగా సీతారాం నాయక్ మాట్లాడుతూ.. గ్రామస్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా పారిశుద్ధ్య నిర్వహణపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నామని తెలిపారు. వానాకాలంలో దోమలు, అంటువ్యాధులు ప్రబలకుండా ఉండేందుకు డ్రెయినేజీలను శుభ్రం చేస్తున్నామని అన్నారు. గ్రామ ప్రజలు కూడా పరిసరాలను పరిశుభ్రంగా ఉంచి గ్రామాభివృద్ధికి సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో పంచాయితీ సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.
క్రీడలతో స్నేహభావం
వాజేడు : క్రీడలతో స్నేహభావం పెంపొందుతుందని పేరూరు ఎస్సై గుర్రం కృష్ణ ప్రసాద్ అన్నారు. మండల పరిధిలోని ధర్మవరం గ్రామంలో బుధవారం ఎనిమిది గ్రామ పంచాయతీల ఆధ్వర్యంలో ధర్మవరం ప్రీమియర్ లీగ్ క్రికెట్ పోటీలను ఏర్పాటు చేయగా సర్పంచ్ కాక సుమతి ప్రారంభించారు. ముఖ్య అతిథిగా ఎస్సై కృష్ణ ప్రసాద్ హాజరై మాట్లాడారు. ఎలాంటి ఘర్షణలకు తావు లేకుండా క్రికెట్ పోటీలను నిర్వహించాలని నిర్వాహుకులకు సూచించారు.
పరామర్శ
ములుగు రూరల్ : జిల్లా కేంద్రానికి చెందిన కొండ్రోజు సత్యంచారి బుధవారం అనారోగ్యంతో మృతి చెందాడు. బాధిత కుటుంబ సభ్యులను నాలుగో వార్డు కౌన్సిలర్ గుంటోజు పావని నిరంజన్ పరామర్శించారు. అనంతరం సత్యం మృతదేహంపై పూలమాల వేసి నివాళులర్పించారు.
వ్యక్తి ఆత్మహత్య
కన్నాయిగూడెం : భార్య చనిపోయిందన్న బెంగతో భర్త పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్ప డ్డాడు. ఈ సంఘటన కన్నాయిగూడెం మండలంలోని చింతగూడెం గ్రామ పరిధిలో గల గొత్తికోయగూడెంలో చోటు చేసుకుంది. ఎస్సై వెంకటేశ్ కథనం ప్రకారం.. గొత్తికోయగూడెనికి చెందిన మడవి జోగయ్య (45), భార్య గతేడాది పురుగుల మందు తాగి చనిపోయింది. అనంతరం భార్య లేదనే ఆలోచనతో కలత చెందిన భర్త జోగయ్య మంగళవారం రాత్రి పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. జోగయ్య కొడుకు సమ్మయ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.
విరమణ తప్పనిసరి
భూపాలపల్లి రూరల్ : ప్రతి ఉద్యోగికి విరమణ తప్పనిసరి అని జిల్లా సహకార అధికారి వాల్య నాయక్ అన్నారు. జంగేడు పీఏసీఎస్‌లో స్టాఫ్ అసిస్టెంట్‌గా పనిచేసిన ఎం. భిక్షపతి పదవి విరమణ కార్యక్రమం బుధవారం నిర్వహించారు.ఈ కార్యక్రమానికి పాక్స్ చైర్మన్ మేకల సంపత్, జిల్లా సహకార అధికారి వాల్య నాయక్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు భిక్షపతి దంపతులను శాలువాతో సత్కరించారు.


