జిల్లాలో సాగవుతున్న పంటల
వివరాలు (ఖరీఫ్)
పెరుగుతున్న పెట్టుబడులు
వరి క్వింటాకు రూ.72, పత్తికి రూ.557 పెరిగిన ధర
ములుగు: జిల్లాలో ప్రధానంగా సాగయ్యే పంటలకు ఇంకాస్త మద్దతు ధర పెరిగింది. ప్రతిఏటా మాదిరిగానే కేంద్ర ప్రభుత్వం వివిధ అంశాలను పరిగణనలోకి తీసుకొని పంటలకు మద్దతు ధరలను నిర్ణయిస్తుంది. 2026–27 సంవత్సరానికి వివిధ పంటలకు కనీస మద్దతు ధరలను కేంద్రం ప్రకటించింది. జిల్లాలో అన్ని పంటలు కలిపి 1,63,229 ఎకరాల్లో సాగవుతుండగా ఇందులో వరి, పత్తి పంటలు ప్రధానంగా ఉంటాయి. వర్షాలు అనుకూలించి, రాబోయే వానాకాలంలో 1,07,700 ఎకరాల్లో వరిపంట, 28,600 ఎకరాల్లో పత్తిపంట సాగవుతుందని అధికారులు అంచనా వేశారు. మొక్కజొన్న 11,329 ఎకరాల్లో, ఇతర పంటలు 15,600 ఎకరాల్లో సాగు కానున్నాయి.
గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది కేంద్రం వరిపంట క్వింటాకు రూ.72లు పెంచింది. గ్రేడ్ –ఏ రకానికి గతేడాది రూ.2,389 ఉంటే ఈ ఏడాది రూ.2,461లకు చేరింది. ఇక సాధారణ రకాలకు గతేడాది రూ.2,369గా ఉన్న ధర రూ.2,441కు పెరుగుతుంది. పత్తి క్వింటాకు రూ.557 పెంచడంతో రూ.8,110 నుంచి రూ.8,667కు చేరుకోనుంది. వరి పంటకు కేవలం రూ.72లు మాత్రమే పెరగడంతో అన్నదాతలు నిరుత్సాహానికి గురవుతున్నారు. కనీసం క్వింటా వరి పంటకు రూ.500లు పెంచాలని అన్నదాతలు కోరుతున్నారు.
కేంద్ర ప్రభుత్వం 14 రకాల పంటలకు మద్దతు ధర పెంచగా అందులో అత్యల్పంగా కేవలం మొక్కజొన్న పంటకు రూ.10లను మాత్రమే పెంచి రైతులకు మొండిచేయి చూపింది. జిల్లాలోని 10 మండలాల పరిధిలో రాబోయే వానాకాలం సీజన్‌కు 11,329 ఎకరాల్లో మొక్కజొన్న పంట సాగు కానుంది. 2024 ఖరీఫ్‌లో 2,717 ఎకరాలు, 2025 ఖరీఫ్‌లో 10,029 ఎకరాల్లో రైతులు మొక్కజొన్న పంటను సాగు చేశారు. ప్రతిఏటా జిల్లాలో మొక్కజొన్న పంట సాగు పెరుగుతుండగా ప్రభుత్వం మద్దతు ధర కేవలం రూ.10లు మాత్రమే పెంచడంతో మొక్కజొన్న పంటల సాగుకు రైతులు వెనుకడుగు వేసే అవకాశం ఉంది. క్వింటా మొక్కజొన్నకు రూ.2,400లు ఉండగా పెరిగిన ధరతో రూ.2,410 కానుంది. కందులకు రూ.450, మినుమలకు రూ.400, వేరుశనగకు రూ.254, పొద్దు తిరుగుడుకు రూ.622, నువ్వులకు రూ.500 మద్దతు ధరను కేంద్రం పెంచింది.
జిల్లాలో అత్యధికంగా
సాగయ్యే రెండు పంటలివే..
మొక్కజొన్నకు కేవలం రూ.10 పెంపు
2026–27 సీజన్ నుంచి పెరిగిన
ధరలు వర్తింపు
పంట 2024 2025 2026
వరి 95,739 1,06,236 1,07,700
పత్తి 20,740 27,294 28,600
మొక్కజొన్న 2,717 10,029 11,329
ఇతర పంటలు 14,000 14,000 15,600
పంటల సాగుకు ఏటేటా పెట్టుబడులు పెరుగుతున్నాయి. యంత్రాలు, డీజిల్, ఎరువులు, క్రిమిసంహారక మందుల ధరలు ౖపైపెకి వెళ్తున్నాయి. వీటికి తోడు నిత్యావసర ధరలు పెరగడంతో కూలీల ధరలు పెరుగుతున్నాయి. ఇలాంటి సమయంలో కేంద్ర ప్రభుత్వం పెరిగిన పెట్టుబడులను పరిగణనలోకి తీసుకోకుండా పంటల ధరలు నిర్ణయించడంపై రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జిల్లాలో ప్రధానంగా సాగయ్యే వరి, పత్తి పంటలకు పెట్టుబడులు పెరిగాయని అందుకు అనుగుణంగా మద్దతు ధరలు పెరగలేదని రైతులు వాపోతున్నారు. మొక్కజొన్న మద్దతు ధర పరిస్థితి మరింత ఆధ్వాన్నంగా ఉందని, కేంద్ర ప్రభుత్వం మద్దతు ధరలు మరికొంత పెంచి ఆదుకోవాలని రైతులు కోరుతున్నారు.


