వాజేడు: మండలంలో జరుగుతున్న జాతీయ గ్రామీణ ఉపాధిహామీ పనులను మంగళవారం ఎంపీడీఓ శ్రీకాంత్‌నాయుడు పరిశీలించారు. మండల పరిధిలోని ఏడ్జెర్లపల్లి, పూసూరు గ్రామాల్లో కుంటల పూడిక తీత పనులు జరుగుతుండగా పనులను పరిశీలించి కూలీలకు పలు సూచనలను చేశారు.
మొగుళ్లపల్లి: మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయంలో తిరుమలాపూర్ గ్రామానికి చెందిన వర్ధమాన గేయ రచయిత దాసారపు నరేష్ రచించిన పురిటి నొప్పులు పోస్టర్‌ను తహసీల్దార్ సునీత మంగళవారం ఆవిష్కరించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ.. ఈ గేయాన్ని ఆలపించిన అంకుశాపూర్ గ్రామానికి చెందిన జీడి అనితను అభినందిస్తూ సామాజిక చైతన్య గీతాలు ఇంకా ఎన్నో పాడాలని, మంచి పేరు తెచ్చుకోవాలన్నారు. అమ్మ ప్రేమను వెలకట్టలేమనీ, ఎన్ని జన్మలెత్తినా అమ్మ రుణం తీర్చలేమని, కన్నతల్లి ప్రేమను మరువద్దని, జీవితాంతం అమ్మను కంటి రెప్పల కాపాడుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్ జిల్లా నాయకులు మంగళపెల్లి శ్రీనివాస్, నాయకులు నిమ్మల భద్రయ్య, కాంగ్రెస్ సీనియర్ నాయకులు మంద సాంబయ్య, డీలర్ల జిల్లా కార్యదర్శి గంగాదార్ రాజు, జీడి సంపత్ ,గాయకులు పుల్ల ప్రతాప్ తదితరులు పాల్గొన్నారు.
ఏటూరునాగారం: రోడ్డు ప్రమాదంలో మహిళకు గాయాలైన సంఘటన మండలంలోని జీడివాగు వద్ద మంగళవారం చోటు చేసుకుంది. మంగపేటకు చెందిన సోడి సమ్మక్క అనే మహిళ శుభకార్యానికి ఏటూరునాగారం వచ్చి మంగపేట వైపు వెళ్తుండగా బైక్ అదుపు తప్పి కిందపడింది. ప్రమాదంలో ఆమెకు తీవ్ర గాయాలు అయ్యాయి. 108కు సమాచారం ఇవ్వడంతో టీఎంటీ పర్వతాల రాజ్‌కుమార్, పైలెట్ భరత్ సహాయంతో బాధితురాలిని ఏటూరునాగారం సామాజిక ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
గుడుంబా పట్టివేత
చిట్యాల: మండలంలోని నవాబుపేట గ్రామానికి చెందిన తీగల రమ అక్రమంగా 10లీటర్ల గుడుంబాను రవాణా చేస్తుండగా పట్టుకున్నట్లు ఎస్సై పోచంపల్లి సతీష్ మంగళవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఎస్సై తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలోని నవాబుపేట గ్రామ శివారులో పోలీసులు ఉదయం పెట్రోలింగ్ చేస్తుండగా అదే గ్రామానికి చెందిన తీగల రమ గుడుంబాను పట్టుకుని అమ్ముకునేందుకు వెళ్తుతుండగా పట్టుకున్నారు. గుడుంబాను స్వాధీనం చేసుకుని ఆమైపె కేసు నమోదు చేశారు. అనంతరం ఎస్సై మాట్లాడుతూ.. మండలంలోని ఎవరైనా గుడుంబా అమ్మినా, తయారు చేసిన వారిపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. అలాగే పోలీసులకు సమాచారం అందించాలని కోరారు.


