ములుగు: జిల్లాలో నెల రోజులుగా జరుగుతున్న పదో తరగతి పరీక్షలు సోమవారంతో ప్రశాంతంగా ముగిసాయని డీఈఓ సిద్ధార్థరెడ్డి తెలిపారు. రేపు(బుధవారం) ఒకేషనల్ పరీక్ష ఉన్నట్లు పేర్కొన్నారు. జిల్లావ్యాప్తంగా ఏర్పాటు చేసిన 20 పరీక్ష కేంద్రాలలో 3,291 మంది విద్యార్థులు పరీక్షలు రాయాల్సి ఉండగా 3,287 మంది పరీక్షలకు హాజరు కాగా నలుగురు గైర్హాజర్ అయినట్లు వెల్లడించారు. పరీక్షలు ప్రశాంతంగా నిర్వహించేందుకు సహకరించిన అధికారులకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు.
నేడు, రేపు ప్రజాదర్బార్
ములుగు: జిల్లాలోని ములుగు మండలం పరిధిలో నేడు రాయినిగూడెం, సర్వాపురం గ్రామాల్లో, బుధవారం మంగపేట మండలం రాజుపేట, మల్లూరు గ్రామాల్లో బుధవారం ప్రజాదర్బార్‌ను నిర్వహించనున్నట్లు కలెక్టర్ దివాకర సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. మంగళవారం రాయినిగూడెం గ్రామపంచాయతీలో మధ్యాహ్నం 3 గంటలకు, సర్వాపురం ప్రభుత్వ పాఠశాలలో సాయంత్రం 6 గంటలకు ప్రజాదర్భార్ ఉంటుందని వివరించారు. బుధవారం మంగపేట మండలం రాజుపేట జిల్లా పరిషత్ హైస్కూల్‌లో మధ్యాహ్నం 3 గంటలకు, మల్లూరు జీపీలో సాయంత్రం 6 గంటలకు ప్రజాదర్భార్ ఉంటుందని వెల్లడించారు. ఈ కార్యక్రమానికి మంత్రి సీతక్క హాజరుకానున్నట్లు వెల్లడించారు.
ఇళ్లగణన పకడ్బందీగా
చేపట్టాలి
ములుగు: జనగణనలో భాగంగా చేపట్టనున్న ఇళ్లగణనను పకడ్బందీగా చేపట్టాలని జనగణన రాష్ట్ర సంచాలకులు భారతి హోలికేరీ అన్నారు. ఈ మేరకు సోమవారం ఆయన హైదరాబాద్ నుంచి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి కలెక్టర్లు, అదనపు కలెక్టర్లతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వచ్చే నెల 11వ తేదీ నుంచి నిర్వహించనున్న ఇళ్ల గణన ప్రక్రియలో పొరపాట్లకు తావు లేకుండా నిర్వహించాలన్నారు. ప్రక్రియ నిర్వహణలో భాగంగా ఇళ్ల జాబితా బ్లాక్‌లను రూపొందించాలని తదితర సూచనలు చేశారు. అనంతరం జిల్లా కలెక్టర్ దివాకర మాట్లాడుతూ.. జనగణనలో చేపట్టనున్న ఇళ్లగణన కార్యక్రమాన్ని నిబంధనల ప్రకారం అధికారుల సమన్వయంతో పకడ్బందీగా చేపడతామని తెలిపారు.
రామప్పలో
టీజీఎఫ్‌డీసీ జీఎం
వెంకటాపురం(ఎం): రామప్ప దేవాలయాన్ని సోమవారం తెలంగాణ రాష్ట్ర అటవీ శాఖ అభివృద్ధి సంస్థ(టీజీఎఫ్‌డీసీ) జనరల్ మేనేజర్ జి. స్కైలాబ్ సందర్శించారు. రామప్ప రామలింగేశ్వరస్వామికి ఆయన పూజలు నిర్వహించగా ఆలయ అర్చకులు హరీశ్ శర్మ, ఉమా శంకర్‌లు తీర్థప్రసాదాలు అందజేసి ఆశీర్వచనం చేశారు. ఆలయ విశిష్టత గురించి టూరిజం గైడ్ గోరంట్ల విజయకుమార్ వారికి వివరించగా రామప్ప శిల్పకళసంపద బాగుందని కొనియాడారు. అనంతరం రామప్ప చెరువును సందర్శించారు. ఈ కార్యక్రమంలో ఆయన వెంట ములుగు జిల్లా డివిజనల్ మేనేజర్ శైలజ, భూపాలపల్లి జిల్లా ప్లాంటేషన్ మేనేజర్ బి.కరుణాకర్ రావు ఉన్నారు.
కొలువుదీరిన పాలకవర్గం
కాళేశ్వరం: శ్రీ కాళేశ్వర ముక్తీశ్వరస్వామి దేవస్థానం నూతన ధర్మకర్తల మండలి ప్రమాణస్వీకార కార్యక్రమం దేవాదాయశాఖ సోమవారం ఘనంగా నిర్వహించింది. ఈఓ శనిగెల మహేష్ ఆధ్వర్యంలో 11 మంది ధర్మకర్తలు, ఒక ఎక్స్‌అఫీషియో (అర్చక)తో ఆలయ చైర్మన్‌గా అవధాని మోహన్‌శర్మను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈఓ చైర్మన్‌తో పాటు ధర్మకర్తలను ప్రమాణస్వీకారం చేయించారు. ధర్మకర్తలుగా దొడ్ల అశోక్, కుంభం పద్మ, అడ్డూరి శ్రీధర్ రావు, మంచినీళ్ల దుర్గయ్య, గందెసిరి సత్యనారాయణ, సుంకరి సీతయ్య, జలవంచ సీతారాం, కాటం సత్తయ్య, శ్యాంసుందర్ దేవుడా, ఎక్స్ అఫీషియో మెంబర్‌గా దేవస్థానం ఉపప్రధాన అర్చకుడు పనకంటి ఫణీంద్రశర్మ 12మంది సభ్యులు రెండేళ్ల కాల పరిమితితో కొలువుదీరారు. ఈ సందర్భంగా చైర్మన్ మాట్లాడుతూ దేవస్థానం అభివృద్ధికి కృషి చేస్తామన్నారు. తమ హాయంలో బృహత్తర ప్రణాళికతో మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు సహకారంతో దేవస్థానం అభివృద్ధికి అహర్నిశలు పాటుపడుతామన్నారు.


