ములుగు: రహదారిపై నియమనిబంధనలు పాటించి వాహనాలు నడిపితేనే సురక్షిత ప్రయాణం సాధ్యమని, రహదారి భద్రతపై వాహనదారులకు విస్తృత అవగాహన కల్పించాలని కలెక్టర్ టీఎస్. దివాకర తెలిపారు. అరైవ్ అలైవ్ వారోత్సవాల్లో భాగంగా సోమవారం కలెక్టరేట్‌లో రవాణా శాఖ ఆధ్వర్యంలో రూపొందించిన జాతీయ రహదారి భద్రతా మాసోత్సవాలు – 2026 పోస్టర్‌ను కలెక్టర్ ఆవిష్కరించారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ రక్షణ – సాంకేతికతతో మార్పు అనే నినాదంతో ఈ ఏడాది అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ‘బీ ఏ రోడ్ సేఫ్టీ ఛాంపియన్’ అంటూ పిలుపునిస్తూ వాహనదారులందరూ రహదారి నిబంధనలు పాటించి సురక్షిత ప్రయాణాన్ని సాగించాలని సూచించారు. ప్రపంచవ్యాప్తంగా రహదారి ప్రమాదాల్లో భారత్ అగ్రస్థానంలో ఉండటం అందరిని ఆందోళనకు గురి చేస్తున్న అంశమని వివరించారు. గతేడాది గణాంకాల ప్రకారం దేశవ్యాప్తంగా సుమారు 4.80 లక్షల ప్రమాదాలు జరుగగా, అందులో దాదాపు 1.70 లక్షల మంది ప్రాణాలు కోల్పోయారని తెలిపారు. కుటుంబానికి ఆధారమైన వ్యక్తులు ప్రాణాలు కోల్పోవడం వల్ల అనేక కుటుంబాలు రోడ్డున పడుతున్నాయని తెలిపారు. ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నిబంధనలు పాటిస్తేనే రోడ్డు ప్రమాదాలు నివారించవచ్చని సూచించారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ సంపత్ రావు, ఆర్డీఓ వెంకటేశ్, జిల్లా రవాణా శాఖ అధికారి శ్రీనివాస్, అసిస్టెంట్ మోటార్ వెహికల్ ఇన్‌స్పెక్టర్ వినోద్ తదితరులు పాల్గొన్నారు. అదే విధంగా నేడు నిర్వహించనున్న అంబేడ్కర్ జయంతి ఉత్సవాలను నిర్వహించాలని కలెక్టర్ దివాకర అధికారులకు సూచించారు. అంబేడ్కర్ ఉత్సవ కమిటీ సభ్యులతో తన ఛాంబర్‌లో కలెక్టర్ మాట్లాడారు. అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు ఆర్పించాలన్నారు. అక్కడి నుండి ప్రభుత్వ ఏరియా ఆసుపత్రి మీదుగా కలెక్టరేట్‌కు ర్యాలీ నిర్వహించి కలెక్టరేట్‌లో 11:30 గంటలకు ఉత్సవాలను నిర్వహించనున్నట్లు తెలిపారు.
జియో కోఆర్డినేషన్‌లో జాగ్రత్త వహించాలి
ములుగు రూరల్: రాంచంద్రాపూర్ భూముల సర్వేలో జియో కోఆర్డినేషన్‌లో ఎలాంటి పొరపాట్లు జరుగకుండా జాగ్రత్తలు వహించాలని కలెక్టర్ దివాకర సూచించారు. ఈ మేరకు సోమవారం మల్లంపల్లి మండల పరిధిలోని రాంచంద్రాపూర్ శివారు రాజేశ్వర్‌రావుపల్లిలో చేపడుతున్న భూ సర్వేను ఆయన పరిశీలించి మాట్లాడారు. సర్వే తీరు, డేటా ఎంట్రీ, జియో కోఆర్డినేషన్ పనుల వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు.
కలెక్టర్ టీఎస్.దివాకర


