ఏటూరునాగారం: జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్‌తో పాటు మండల కేంద్రంలోని ఐటీడీఏలో సోమవారం గిరివాణి(గిరిజన దర్బార్) నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఏపీఓ వసంతరావు పాల్గొని బాధితుల నుంచి 10 వినతులు స్వీకరించారు. బాధితులు అందజేసిన వినతులు ఇలా..జయశంకర్ భూపాలపల్లి జిల్లాకు చెందిన కండెల గంగయ్య, కండెల సమ్మక్క పోడు భూములకు పట్టాలు ఇప్పించాలని ఏపీఓను కోరారు. మంగపేట మండల కేంద్రంలోని ప్రభుత్వ భూమిలో గిరిజన భవన్ ఏర్పాటు చేయాలని తొలెం నర్సింగరావు విన్నవించారు. అదే మండలానికి చెందిన సున్నం శ్రీకన్య టైలర్‌షాపు రుణం కావాలని విన్నవించారు. అలాగే సున్నం రాఘవరావు, శ్రీకన్యలు ఆర్‌ఓఎఫ్‌ఆర్ పట్టా ఇప్పించాలని మొరపెట్టుకున్నారు. ఏటూరునాగారం క్రాస్‌రోడ్డు వద్ద ప్రమాదకరంగా ఉన్న కల్వర్టును తొలగించాలని కందిర్‌సింగ్ విన్నవించారు. మంగపేటకు చెందిన బంగారు నర్సయ్య తన కుమార్తెకు పసుపు కుంకుమల కింద భూమి ఇస్తున్నానని దానిని పట్టా చేయాలని వేడుకున్నారు. కన్నాయిగూడెం మండలానికి చెందిన ఆర్కె నాగలక్ష్మి ఆర్‌ఓఎఫ్‌ఆర్ పట్టా ఇప్పించాలని కోరారు. గోవిందరావుపేట మండలం సర్వాపూర్ కు చెందిన మోట్లపల్లి పూజ పట్టాదార్ పాసుపుస్తకంలో పేర్లు తప్పుగా నమోదు అయ్యాయని వాటిని సరి చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో డీటీడీఓ దబ్బగట్ల జనార్ధన్, ఏఓ రాజ్‌కుమార్, ఎస్‌ఓ సురేశ్‌బాబు, మేనేజర్ శ్రీనివాస్, ఐటీఐ ప్రిన్సిపాల్ జగన్‌మోహన్‌రెడ్డి, జేడీఎం కొండల్‌రావు తదితరులు పాల్గొన్నారు.


