ఏటూరునాగారం: పోడు రైతులపై ఫారెస్ట్ అధికారులు దాడులు ఆపాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు జి.నాగయ్య డిమాండ్ చేశారు. మండల కేంద్రంలో సీపీఎం మండల విస్తృత స్థాయి సమావేశం పార్టీ జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు ఎండి. దావూద్ అధ్యక్షతన సోమవారం నిర్వహించారు. ఈ సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. వారం రోజులుగా ఫారెస్ట్ అధికారులు వలస ఆదివాసీ గూడేలపై పడి దౌర్జన్యంగా సాగు భూముల్లో కందకాలు తీస్తున్నారని తెలిపారు. ఇదేమిటని నిలదీస్తే గుడిసెలు జేసీబీలతో కూలగొట్టి ఆ భూముల్ని సైతం ఆక్రమించుకుంటామని బెదిరిస్తున్నారని తెలిపారు. ఫారెస్ట్ అధికారులకు పోడు భూములపై ఉన్న శ్రద్ధ తునికాకు మోడు నరికించడంపై లేదని విమర్శించారు. 2020 నుంచి రావాల్సిన తునికాకు బోనస్‌ను సీపీఎం నాయకులు పోరాడి వచ్చేలా చేస్తే కూలీలకు పంచకుండా అధికారులే దండుకున్నారని మండిపడ్డారు. ఫారెస్ట్ అధికారులు దాడులు ఆపకుంటే పోరాటాలు చేస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో సీపీఎం జిల్లా కార్యదర్శి భీరెడ్డి సాంబశివ, చిట్టిబాబు, రవి, యాకూబ్ పాల్గొన్నారు.
సీపీఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు
నాగయ్య


