ఆదాయం ఫుల్..
మంగపేట: రెండో యాదగిరిగుట్టగా ప్రసిద్ధిగాంచిన మల్లూరు శ్రీ హేమాచల లక్ష్మీనర్సింహస్వామి దేవాలయంలో అభివృద్ధి పనులు కానరావడం లేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఏడాదికి కోటి రూపాయలకు పైగా ఆదాయం వస్తున్నా అభివృద్ధి పనులు హామీలకే పరిమితం అవుతున్నాయని భక్తులు ఆరోపిస్తున్నారు. ఆలయంలో ఈ నెల 27 నుంచి మే 6వ తేదీ వరకు శ్రీ హేమాచల లక్ష్మీనర్సింహస్వామి బ్రహ్మోత్సవాలు(జాతర) నిర్వహించనున్నారు. మే 1న స్వామివారి తిరుకల్యాణ మహోత్సవంతో పాటు 10 రోజుల పాటు సాగే బ్రహ్మోత్సవాలకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌తో పాటు పొరుగున ఉన్న ఛత్తీస్‌గఢ్, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్ తదితర రాష్టాల నుంచి లక్షలాదిగా భక్తులు తరలివస్తుంటారు. ఈ ఆలయానికి ప్రతీ శని, ఆది వారాల్లో వేలాది మంది భక్తులతో రద్దీగా ఉంటుంది. 35 ఏళ్లుగా దేవాదాయ శాఖ ఆధీనంలో కొనసాగుతున్నా ఆలయ అభివృద్ధి మాత్రం ఎక్కడ వేసిన గొంగలి అక్కడే అన్న చందంగా మారింది. బ్రహ్మోత్సవాలకు మరో 15 రోజుల సమయం మాత్రమే మిగిలి ఉన్నాయి. ఆలయానికి పాలకమండలి లేకపోవడంతో పాటు రెగ్యులర్ ఈఓను ఉన్నతాధికారులు నియమించలేదు. గడిచిన 8 నెలల కాలంలో ఇద్దరు ఈఓలను మార్చడంతో పాటు ఈఓ స్థానికంగా ఉండకపోవడంతో ఆలయ అభివృద్ధికి అడ్డుగా మారిందని భక్తులు చర్చించుకుంటున్నారు. అలాగే ఆలయంలో గత కొంతకాలంగా అర్చకుల మధ్య బేదాభిప్రాయాల విషయంలో రాజకీయ నాయకుల జోక్యం ఆలయ అభివృద్ధికి ప్రధాన ఆటకంగా తయారైందని స్థానికులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
కోతకు గురైన రోడ్లు
ప్రధానంగా గుట్టపైకి వెళ్లే ప్రధాన ఆర్చీ వద్ద ఇరుకుగా ఉన్న రోడ్డు వర్షాకాలంలో గుట్టపై నుంచి వచ్చే వరదల వల్ల కోతకు గురై అత్యంత ప్రమాదకరంగా మారింది. అదేవిధంగా శిఖాంజనేయ స్వామి ఆలయానికి కాలిబాటన వెళ్లే రోడ్డు వద్ద నుంచి ఆర్చీ వరకు సీసీ రోడ్డు వెంట సుమారు 50 మీటర్లకు పైగా 3 మీటర్ల వెడల్పుతో రోడ్డు కోతకు గురై అత్యంత ప్రమాదకరంగా మారింది. గతేడాది బ్రహ్మోత్సవాల సందర్భంగా చేపట్టిన రోడ్డు మరమ్మతు పనులు అసంపూర్తిగా చేపట్టి వదిలేయడంతో కాలిబాట వద్ద నుంచి రెండు కిలోమీటర్ల దూరం వరకు రోడ్డు అత్యంత ప్రమాదకరంగా తయారైంది. జాతర ప్రారంభం నాటికి సంవత్సరకాలంగా నిలిచిపోయిన రోడ్డు పనులు పూర్తి చేయడంతో పాటు భక్తులకు కనీస సౌకర్యాలు కల్పిస్తారా లేదా అనే అనుమానాలను భక్తులు వ్యక్తం చేస్తున్నారు.
మంత్రుల హామీలపైనే ఆశలు
గత నెల 1వ తేదీన మంత్రులు సీతక్క, పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, ఎంపీ బలరాంనాయక్, పలువురు ఎమ్మెల్యేలు స్వయంభు లక్ష్మీనర్సింహస్వామిని దర్శించుకున్నారు. 2027లో వచ్చే పుష్కరాల వరకు హేమాచలక్షేత్రాన్ని ప్రభుత్వం ద్వారా అన్ని విధాలుగా అభివృద్ధి చేసి చూపిస్తామని హామీనిచ్చారు. మంత్రుల ఆదేశాల మేరకు ప్రధాన ఆర్చీ నిర్మాణం, రోడ్డు విస్తరణ, ఆలయ ముఖ మండపం, కల్యాణ మండపం, కల్యాణ కట్ట, పార్కింగ్ స్థలాలతో పాటు తదితర అభివృద్ధి పనుల నివేదిక రూపొందించేందుకు కలెక్టర్, దేవాదాయశాఖ డీఈ రమేష్‌బాబు హైదరాబాద్‌కు చెందిన ఆర్కిటిక్ బృందం, రెవెన్యూ, పంచాయతీరాజ్ తదితర శాఖల అధికారులు ఆలయ పరిసరాలను పరిశీలించారు. అదే విధంగా బ్రహ్మోత్సవాల వరకు భక్తులకు సౌకర్యాలు కల్పించడంతో పాటు పలు అభివృద్ధి పనులు చేపట్టనున్నట్లు తెలిపారు.
అభివృద్ధి పనులకు అనుమతులు రాలేదు
ఈ నెల 27 నుంచి స్వామివారి బ్రహ్మోత్సవాలు జరుగనున్నాయి. బ్రహ్మోత్సవాల సందర్బంగా ఆలయంలో అభివృద్ధి పనులు చేపట్టేందుకు దేవాదాయశాఖ, ప్రభుత్వం నుంచి ప్రత్యేకంగా ఎలాంటి నిధులు మంజూరు కాలేదు. భక్తులకు ఇబ్బందులు తలెత్తకుండా సౌకర్యాలు కల్పిస్తాం. – వీరస్వామి,
ఆలయ కార్యనిర్వహణ ఇన్‌చార్జ్ అధికారి
హేమాచలక్షేత్రంలో కానరాని పనులు
నాయకుల మాటలు
హామీలకే పరిమితం
ఈ నెల 27 నుంచి లక్ష్మీనర్సింహస్వామి బ్రహ్మోత్సవాలు
ప్రమాదకరంగా మారిన రోడ్లు
హామీలకే పరిమితమైన ప్రత్యేక నిధులు
తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన నాటి నుంచి నేటి వరకు అభివృద్ధి పనులు నాయకుల మాటలకే పరిమితం అవుతున్నాయని అటు భక్తులు, ఇటు స్థానికులు ఆరోపిస్తున్నారు. 2017లో అప్పటి గిరిజన సంక్షేమ, పర్యాటక శాఖ మంత్రి అజ్మీరా చందూలాల్ ఆలయ అభివృద్ధికి నిధులు మంజూరు చేయిస్తానని హామీ ఇచ్చారు. అలాగే మద్రాస్‌కు చెందిన స్థపతి వల్లినాయర్ బృందం ఆధ్వర్యంలో డిజిటలైజేషన్ చేసిన ప్రత్యేక మాస్టర్ ప్లాన్‌గా ఆలయాన్ని ఆధునీకరించేందుకు ప్రతిపాదనలు రూపొందించి దేవాదాయశాఖకు నివేదిస్తామని తెలిపారు. అదేవిధంగా ట్రైబల్ టూరిజం నుంచి ప్రత్యేక నిధులను కేటాయించే విధంగా కృషి చేస్తానని ఇచ్చిన హామీలు నీటి మూటలుగానే మిగిలిపోయాయి.


