ములుగు రూరల్: ఔషధాలను మోతాదుకు మించి వాడొద్దని, వైద్యుల సూచనల మేరకు మాత్రమే వాడాలని డ్రగ్ ఇన్‌స్పెక్టర్ దేవేందర్‌రెడ్డి సూచించారు. ఈ మేరకు శనివారం ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా ఔషధ నియంత్రణ– బలోపేతం, యాంటి నార్కోటిక్ బ్యూరో ఆధ్వర్యంలో ప్రభుత్వ జనరల్ ఆస్పత్రి నుంచి అంబేడ్కర్ సెంటర్ వరకు అవగాహన ర్యాలీ నిర్వహించారు. అనంతరం కలెక్టరేట్ సమావేశ మందిరంలో శనివారం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. వైద్యుల సూచనల మేరకు యాంటి బయాటిక్స్ వాడాలన్నారు. నకిలీ మందులపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. మందుల నాణ్యతను తనిఖీ చేసేందుకు ప్యాకింగ్‌పై ఉన్న క్యూఆర్ కోడ్‌ను స్కాన్ చేయాలని వివరించారు. ఫిర్యాదు చేసేందుకు నంబర్ 18005996969కు కాల్ చేయాలని సూచించారు. గంజాయి, మత్తు పదార్ధాల వల్ల కలిగే దుష్పప్రభావాలను వివరించారు. నిషేధిత వస్తువుల అమ్మకాలపై టోల్ ఫ్రీ నంబర్ 1908కు ఫిర్యాదు చేయాలని సూచించారు. అనంతరం ఆస్పత్రి సూపరింటెండెంట్ చంద్రశేఖర్ మాట్లాడుతూ జిల్లా ఆస్పత్రిలో మత్తుకు బానిసైన వారి చికిత్స నిమిత్తం 10 బెడ్లను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. నర్సింగ్ కళాశాల విద్యార్థినులకు క్విజ్, వ్యాసరచన పోటీలు నిర్వహించారు. ప్రతిభ కనబర్చిన వారికి బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా వైద్యాధికారి గోపాల్‌రావు, డీసీహెచ్‌ఎస్ జగదీశ్వర్, మెడికల్ అసోసియేషన్ సభ్యులు, మెడికల్ షాపుల యజమానులు, పార్మసిస్టులు, నర్సింగ్ కళాశాల విద్యార్థులు పాల్గొన్నారు.
‘ఉపాధి పనులకు కూలీలు వచ్చేలా చూడాలి’
ఏటూరునాగారం: మండల పరిధిలోని సర్పంచ్‌లు వారి గ్రామాల్లోని ఉపాధి హామీ కూలీలు ఎక్కువ రోజులు పనికి వచ్చేలా చూడాలని ఈజీఎస్ ఏపీఓ చరణ్‌రాజ్ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈజీఎస్ పనులు గ్రామాల్లో చేసినప్పుడు కూలీలకు పనులు కల్పించడం వల్ల మెటీరియల్ నిధులు వస్తాయని వెల్లడించారు. గ్రామాల్లో చెక్‌డ్యామ్‌లు, సీసీ రోడ్లు, అంగన్‌వాడీ భవనాలు, వీఓ భవనాలు, స్కూల్ బాత్‌రూమ్‌లు, పాఠశాల పహరీలు, ఇంకుడు గుంతలు, కంపోస్టు యూనిట్లు, మేకల షెడ్డు, గొడ్ల, బర్లపాకలు, కోళ్ల పెంపకంతో పాటు షెడ్ల వంటి పనులు చేయించుకునే అవకాశాలున్నాయని వివరించారు. ఈజీఎస్ పనులకు కూలీలు రాకపోతే మెటీరియల్ నిధులు రాకుండా పోతాయని పేర్కొన్నారు. పనికి హాజరు కాని వారి జాబ్ కార్డులను తొలగిస్తారని తెలిపారు. అదే విధంగా గ్రామాల్లో కూలీలతో పనులు చేయించేందుకు మేట్‌లు కావాలని వెల్లడించారు. రాయడం, చదవడం వచ్చిన వారికి మేట్‌గా అవకాశం కల్పిస్తామని, ఆసక్తిగల వారు వారి వారి జీపీల్లో పేర్లు నమోదు చేసుకోవాలని వివరించారు.
పార్టీ బలోపేతానికి కృషి చేయాలి
వాజేడు: బీజేపీని గ్రామ స్థాయి నుంచి బలోపేతం చేసేందుకు కార్యకర్తలు నిరంతరం కృషి చేయాలని భద్రాది కొత్తగూడెం జిల్లా అధ్యక్షుడు బైరెడ్డి ప్రభాకర్‌రెడ్డి, భద్రాచలం నియోజక వర్గ ఇన్‌చార్జ్ రామచంద్రారెడ్డి అన్నారు. మండల పరిధిలోని పూసూరు వద్ద రిసార్ట్‌లో వాజేడు, వెంకటాపురం(కె), చర్ల మండలాలకు చెందిన బీజేపీ నాయకులు, కార్యకర్తలకు రెండు రోజుల పాటు శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా శనివారం వారు మాట్లాడుతూ పని స్థాయిని బట్టి దేశం నుంచి మండల స్థాయి వరకు నిర్ణీత బృందాల సమావేశంలో పార్టీ అభ్యున్నతికి ప్రణాళికలు రూపొందించుకోవాలని సూచించారు. పార్టీని గ్రామ స్థాయి నుంచి బలోపేతం చేయడానికి కార్యక్రమాలను నిర్వహించాలని సూచించారు. ఈ శిక్షణ కార్యక్రమంలో సీనియర్ నాయకుడు కందుల రాంకిశోర్, మండల అధ్యక్షుడు పెద్ది జగపతి బాబు, చర్ల, వెంకటాపురం(కె) మండలాల అధ్యక్షులు రాజశేఖర్, రమేశ్ నాయకులు అట్టం మమత, సీతారామరాజు, బలరాం, సుబ్బయ్య, సాయి తదితరులు పాల్గొన్నారు.


